సాగర్‌లో టీఆర్ఎస్ ఓడిపోతుందనే ఈ కుట్రకు తెరలేపారు: దాసోజు శ్రావణ్

ABN , First Publish Date - 2021-04-19T23:45:26+05:30 IST

సీఎం కేసీఆర్‌కు ఎంతసేపు ఎన్నికల మీదే ధ్యాసే తప్ప.. ప్రజల ఆరోగ్యం మీద లేదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

సాగర్‌లో టీఆర్ఎస్ ఓడిపోతుందనే ఈ కుట్రకు తెరలేపారు: దాసోజు శ్రావణ్

 హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా రెండోదశ  విజృంభిస్తున్న సీఎం కేసీఆర్‌కు ఎంతసేపు ఎన్నికల మీదే ధ్యాసే తప్ప.. ప్రజల ఆరోగ్యం మీద లేదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం  ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎస్ఈసీ పార్థసారథి కూడా ప్రజల ఆరోగ్యాన్ని గాలికొదిలేసి.. కేసీఆర్‌కు కొమ్ము కాస్తున్నారని దాసోజు శ్రావణ్  ధ్వజమెత్తారు. ఇంత చిల్లర నోటిఫికేషన్ ఇవ్వడం సిగ్గుచేటని దాసోజు శ్రావణ్ మండిపడ్డారు. ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసరా అని ప్రశ్నించారు. నాగార్జున సాగర్‌లో టీఆర్ఎస్ ఓడిపోతుందనే మున్సిపల్ ఎన్నికల కుట్రకు తెరలేపారని మండిపడ్డారు. ఐఏఎస్‌లు ప్రభుత్వ తాయిలాలకు తలోగ్గి సిగ్గు లేకుండా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. మున్సిపల్ ఎన్నికల‌ను వెంటనే వాయిదా వేయాలని దాసోజు శ్రావణ్  డిమాండ్ చేశారు.


కరోనా విషయంలో ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోందని.. ఈ విషయం హైకోర్టు పేర్కొందన్నారు. రెమిడెసివర్ ఇంజక్షన్ కోసం ప్రజలు అల్లాడుతున్నారన్నారు. మంత్రి ఈటల రాజేందర్‌కు పూర్తి స్థాయిలో అధికారాలు ఇవ్వడం లేదన్నారు. ఈరోజు కరోనా పేషెంట్లకు బెడ్లు దొరక్క తిప్పలు పడుతున్నారని చెప్పారు. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని దుయ్యబట్టారు. కరోనా సెకండ్ వేవ్ ఇంత సీరియస్‌గా ఉంటే సీఎం కేసీఆర్ ఏం చేస్తున్నారని దాసోజు శ్రావణ్  ప్రశ్నించారు. ప్రభుత్వాస్పత్రుల్లో ఎంతమంది డాక్టర్లు, నర్సులను రిక్రూట్ చేశారో కేసీఆర్ వద్ద సమాధానం లేదని దాసోజు శ్రావణ్ నిలదీశారు. హైదరాబాద్‌లో టీకా తయారవుతుంది.. కానీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రెండు రోజులు నిలిపేశారని దాసోజు శ్రావణ్ తెలిపారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చుతామని చెప్పిన సీఎం కేసీఆర్.. ఆ పని ఎందుకు చేయడం లేదని దాసోజు శ్రావణ్  నిలదీశారు. 

Updated Date - 2021-04-19T23:45:26+05:30 IST