జయహో.. శత్రు సంహారిణీ!

ABN , First Publish Date - 2021-10-15T06:14:05+05:30 IST

లక్షలాది మంది భక్తులతో ఇంద్రకీలాద్రిపై అంగరంగ వైభవంగా జరుగుతున్న దసరా మహోత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి.

జయహో.. శత్రు సంహారిణీ!
మహిషాసుర మర్దినీ దేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు

ఎనిమిదో రోజు మహిషాసుర మర్దినీ దేవిగా దుర్గమ్మ 

భారీగా తరలివచ్చిన భక్తజనం

నేడు రాజరాజేశ్వరీదేవిగా అమ్మవారి దర్శనం 

నేటితో ముగియనున్న దసరా ఉత్సవాలు 


లక్షలాది మంది భక్తులతో ఇంద్రకీలాద్రిపై అంగరంగ వైభవంగా జరుగుతున్న దసరా మహోత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఎనిమిదో రోజైన గురువారం దుర్గమ్మ మహిషాసురమర్దినిగా భక్తులకు దర్శనమిచ్చింది. జయహో.. శత్రు సంహారిణీ! జయ జయహో దుర్గా భవానీ! అంటూ జయజయ ధ్వానాలు చేస్తూ, భక్తులు అమ్మను దర్శించుకున్నారు. బ్రహ్మాస్త్రం, విష్ణుచక్రం, రుద్రశూలం, యమదండం, వరుణపాశం వంటి ఆయుధాలు ధరించి మహిషుడిని వధించిన అమ్మవారిని భక్తితో మొక్కి, భక్తులు వెనుదిరిగారు. 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఎనిమిదో రోజైన గురువారం కనకదుర్గమ్మ మహిషాసుర మర్దినీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చింది. దుష్టుడైన మహిషాసురుడిని సంహరించిన దుర్గాదేవి.. అష్టభుజాలతో ఆయుధాలను ధరించి, సింహవాహనంపై అధిష్ఠించి, ఉగ్రరూపంతో భక్తులకు అనుగ్రహమిచ్చారు. లక్షలాదిగా తరలివచ్చిన భక్తుల భవానీ నామస్మరణతో ఇంద్రకీలాద్రి మార్మోగింది. సినీ నటుడు రాజేంద్రప్రసాద్‌, నటి హేమ, రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, తాళ్లాయపాలెం శివస్వామి తదితర ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు. సాధారణ భక్తులతోపాటు భవానీ దీక్ష చేపట్టిన మాలధారులు రాష్ట్రం నలుమూలల నుంచి భారీసంఖ్యలో తరలివచ్చారు. స్నానఘాట్లు, కేశఖండనశాలలు కిటకిటలాడాయి. ఉదయం నాలుగు గంటల నుంచే భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. మహామండపం ఆరో అంతస్థులో నిర్వహించిన విశేష కుంకుమార్చన, హోమశాలలో నిర్వహించిన శతచండీహోమం, శ్రీచక్ర నవావర్ణార్చన తదితర ఆర్జిత పూజల్లో అధికసంఖ్యలో పాల్గొన్నారు. సాయంత్రం మహానివేదన, పంచహారతుల సేవ అనంతరం ప్రదోష కాలంలో గంగా సమేత దుర్గామల్లేశ్వరస్వామి వార్ల ఉత్సవమూర్తులకు మంగళ వాయిద్యాల నడుమ పల్లకీ సేవ వైభవంగా జరిగింది.


నేడు ఉత్సవాల ముగింపు 

ఇంద్రకీలాద్రిపై వైభవంగా సాగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు శుక్రవారం విజయదశమితో విజయవంతంగా పూర్తి కానున్నాయి. ఉత్సవాల చివరి రోజు అమ్మవారు రాజరాజేశ్వరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఉదయం 10 గంటలకు ఆలయ వేదపండితులు హోమశాలలో మహా పూర్ణాహుతి నిర్వహించి ఉత్సవాలకు ముగింపు పలకనున్నారు. సాయంత్రం ఐదు గంటలకు కృష్ణానదిలో గంగా సమేత దుర్గామల్లేశ్వరస్వామి వార్ల తెప్పోత్సవానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కృష్ణానదికి వరద తాకిడి ఎక్కువగా ఉండటంతో దుర్గాఘాట్‌లోనే హంస వాహనాన్ని నిలిపి, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. తెప్పోత్సవం అనంతరం పోలీసుల ఆధ్వర్యంలో వన్‌టౌన్‌లో పెద్దఎత్తున సంబరాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. 

Updated Date - 2021-10-15T06:14:05+05:30 IST