వీరు మారరు

ABN , First Publish Date - 2021-10-14T06:33:06+05:30 IST

కొండ మీద పోలీసుల తీరు మారదు.

వీరు మారరు
అడ్డదారిలో వచ్చే భక్తులను స్వయంగా నిలువరిస్తున్న ఈవో

మళ్లీ అనధికార వీవీఐపీ - ప్రొటోకాల్‌ దర్శనాలు

సిబ్బందిపై ఈవో ఆగ్రహం.. గేట్లు క్లోజ్‌

సబ్‌ కలెక్టర్‌కు క్యూల్లోని భక్తుల మొర


కొండ మీద పోలీసుల తీరు మారదు. కలెక్టర్‌, పోలీస్‌ కమిషనర్‌లు ఉక్కుపాదం మోపటంతో రెండు రోజులు మమ అనిపించారు. వ్యవస్థ గాడిలో పడిందని ఉన్నతాధికారులు భావించగానే మళ్లీ తమ పాత బుద్ధిని బయటపెట్టుకున్నారు. బుధవారం దుర్గాదేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవటానికి భక్తులు భారీగా తరలివచ్చారు. అనధికార వీవీఐపీ-ప్రొటోకాల్‌ దర్శనాలే ఎక్కువగా జరుగుతుండటంతో క్యూల్లో భక్తులు గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. నాలుగు గంటలు గడిచినా, అమ్మవారి దర్శనం లభించకపోవటంతో భక్తుల్లో సహనం నశించింది. పోలీసుల తీరుపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు.


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : పోలీసు శాఖలో కిందిస్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు వందలాది మంది బంధువర్గాలతో కలిపి దర్శనాలకు వస్తుండటంతో వారందరికీ పోలీసులు రెడ్‌ కార్పెట్‌ పరుస్తున్నారు. దీంతో వీవీఐపీ - ప్రొటోకాల్‌ దర్శనాలు పెరిగిపోయాయి. వారంతా అంతరాలయ ముఖద్వారం దగ్గర ఎక్కువ సేపు ఉండటం వల్ల వెనుక నుంచి దర్శనం చేసుకునే రూ.100, ఉచిత దర్శనం క్యూల్లోని భక్తులు తమకు అమ్మవారు కనిపించడం లేదని, అమ్మ దర్శనం లేకుండా ముందుకు కదలమని పట్టుబట్టారు. ఇక రూ.300 లైన్‌లో వచ్చినవారి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. వీఐపీ లైన్‌లో తాకిడి పెరగడంతో దాని ప్రభావం రూ.300 క్యూలో ఉన్న భక్తులపై పడింది. వీరు కూడా గంటల తరబడి నిలబడాల్సి వచ్చింది.


ఈవో ఆకస్మిక తనిఖీలు.. అన్ని గేట్లూ మూసివేత 

దేవస్థానంలో అడ్డదారుల నుంచి భక్తులు తండోపతండాలుగా వస్తుండంతో ఈవో భ్రమరాంబ ఆలయం చుట్టూ నడుచుకుంటూ వెళ్లి పరిశీలించారు. లోనికి వెళ్లే గేట్లు తెరిచిన సిబ్బందిపై మండిపడ్డారు. ఎవరుపడితే వారు రాజమార్గాల్లో దర్శనాలకు వస్తుంటే క్యూల ఉద్దేశం ఏమవ్వాలని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసి, తెరిచిన గేట్లన్నింటినీ మూసివేయించారు. 


లైన్లు కదలట్లేదు.. సబ్‌కలెక్టర్‌కు భక్తుల మొర

కొండ మీదకు వచ్చి, క్యూలను పరిశీలిస్తున్న సబ్‌ కలెక్టర్‌ ప్రవీణ్‌చంద్‌కు భక్తులు తమ గోడు వెళ్లగక్కారు. క్యూలోకి వచ్చి మూడున్నర గంటలైనా, దర్శనం కాలేదని, చాలా మంది నేరుగా వెళ్లిపోతున్నారని ఫిర్యాదు చేశారు. వారి ఇబ్బందులను విన్న సబ్‌ కలెక్టర్‌ ఆలయంలో అడ్డదారిలో దర్శనాలు జరుగుతున్నాయేమోనని పరిశీలించేందుకు లోపలికి వెళ్లారు. 


వీవీఐపీల పేరుతో వాహనాలకు బ్రేక్‌ 

వీవీఐపీలు వస్తున్న ప్రతిసారీ రాజగోపురం దగ్గర విధులు నిర్వహిస్తున్న పోలీసులు బస్సులను నిలిపివేయటంతో మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అదే సమయంలో పోలీసుల కుటుంబాలు వచ్చే కార్లను మాత్రం లోపలికి పంపించేస్తున్నారు. దీంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీ వాళ్ల దర్శనాలకు ఇబ్బంది కలుగుతోందని మహిళలను, వృద్ధులను ఇబ్బందులకు గురిచేస్తారా? అంటూ  పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు రోప్‌ పట్టుకుంటే.. దానిని లాగి దాటుకు వెళ్లేందుకు కొందరు మహిళా భక్తులు ప్రయత్నించారు.  


ఆ రెండూ సరిదిద్దుకుంటేనే..

ఉత్సవాల్లో కొండపైకి బస్సులతో పాటు వీవీఐపీ ప్రొటోకాల్‌ వాహనాలు కూడా వస్తుంటాయి. ఇవన్నీ ఒకేచోట ఆగటంతోనే సమస్య తలెత్తుతోంది. బస్సులు, కార్లు దిగిన వెంటనే అందరూ కలిసిపోతారు. దీంతో వీఐపీలు ఎవరో.. ఇతరులు ఎవరో అర్థం కాదు. బస్సుల్లో వచ్చిన వారిని వారు దిగిన ప్రదేశం నుంచే ప్రత్యేకంగా క్యూలలోకి మళ్లిస్తే కొండ మీద రద్దీ కనిపించదు. వీవీఐపీల వాహనాలను ఎగువన నిలిపి, అక్కడి నుంచే వారిని క్యూ మార్గాన వీవీఐపీ-ప్రొటోకాల్‌ లైన్‌కు అనుసంధానం చేస్తే ఎటువంటి సమస్యా ఉండదు. ఇక రెండో సమస్య ఉత్సవాల్లో క్యూల దగ్గర పోలీసులను నియమించటం. సమస్య అంతా ఇక్కడే వస్తోంది. పోలీసులకు ట్రాఫిక్‌ క్రమబద్దీకరణ, అన్నదానం, ప్రసాదాల కౌంటర్ల దగ్గర విధులు అప్పగించి, భక్తులు వెళ్లే మార్గాల్లో స్వచ్ఛంద సంస్థలకు బాధ్యతలు అప్పగించి, దేవస్థానం, జిల్లా యంత్రాంగాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించగలిగితే ఇన్ని సమస్యలు ఉత్పన్నం కావు.



Updated Date - 2021-10-14T06:33:06+05:30 IST