దసరా మనకు 10 రోజులైతే.. వాళ్లకు 75 రోజులు!

ABN , First Publish Date - 2020-10-24T21:26:35+05:30 IST

దసరా, ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా నిర్వహించుకుంటారు. దేనికదే ప్రత్యేకత. కానీ, అన్నింటా ఒకే రకమైన సందేశం ప్రస్ఫుటిస్తుంది. చెడుపై మంచి విజయం, శక్తి పూజ, అమ్మవారి ఆరాధన. ఏ పేరుతో పిలిచినా, ఎలా జరుపుకున్నా,.. దేశమంతటా జరిగే ఉత్సవాల్లో ఈ మూడు అంశాలు కనిపిస్తాయి.

దసరా మనకు 10 రోజులైతే.. వాళ్లకు 75 రోజులు!

దసరా, ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా నిర్వహించుకుంటారు. దేనికదే ప్రత్యేకత. కానీ, అన్నింటా ఒకే రకమైన సందేశం ప్రస్ఫుటిస్తుంది. చెడుపై మంచి విజయం, శక్తి పూజ, అమ్మవారి ఆరాధన. ఏ పేరుతో పిలిచినా, ఎలా జరుపుకున్నా,.. దేశమంతటా జరిగే ఉత్సవాల్లో ఈ మూడు అంశాలు కనిపిస్తాయి. 


హిమాచల్ ప్రదేశ్‌లోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం కులు.. ప్రకృతి అందాల్లోనే కాదు, దసరా వేడుకల్లోనూ ప్రత్యేకమే. దసరా సందర్భంగా కులులోని ధలపూర్ మైదానంలో రఘునాథ రథయాత్ర నిర్వహిస్తారు. కులు సమీపంలోని వివిధ గ్రామాల నుంచి 200 పైగా విగ్రహాలను ఊరేగిస్తారు. ఈ ఊరేగింపులకు శతాబ్దాల చరిత్ర ఉంది. 1637లో రాజా జగత్ సింగ్ ఈ సాంప్రదాయాన్ని ప్రారంభించారు. ఈ వేడుకలకు మరో ప్రత్యేకత కూడా ఉంది. దేశంలో దసరా వేడుకలు ముగిసిన తర్వాత విజయదశమి నుంచి కులు దసరా వేడుకలు ప్రారంభమవుతాయి. ఇక్కడ రావణ విగ్రహానికి బదులు ఆకులు, గడ్డి కాల్చుతూ 'లంకా దహనం' నిర్వహిస్తారు.


దేశమంతటా దసరా పదిరోజుల పాటు జరుపుకుంటే, ఛత్తీస్‌గడ్‌లోని ఆదివాసీలు 75 రోజుల పాటు దసరా వేడుకలు నిర్వహిస్తారు. ఈ వేడుకలు 'బస్తర్ దసరా'గా వినుతికెక్కాయి. ఈ ఉత్సవాలను ప్రకృతి ఆరాధనగా చేసుకుంటారు. దేవీ దంతేశ్వరికి ఇక్కడ పూజలు చేస్తారు. 13వ శతాబ్దంలో బస్తర్ రాజు పురుషోత్తమ్ దేవ్ జగదల్‌పూర్‌లో ఈ సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. వేడుకల్లో భాగంగా చెట్లను ఆరాధిస్తారు. ఇంకా ఎన్నో రకాలుగా అమ్మవారికి పూజలు చేస్తూ ఆదివాసీ సాంప్రదాయాల్లో ఉత్సవాన్ని నిర్వహిస్తారు. దసరా పండుగ వచ్చిందంటే చెన్నైలో 'బొమ్మై కలు' వేడుకలు నిర్వహించుకుంటారు. అవి అందరికీ కనువిందు చేస్తాయి. బొమ్మై కలు అంటే  బొమ్మల కొలువు. ఈ వేడుకల్లో భాగంగా చెక్క అల్మారాల్లో దేవుడి బొమ్మలను అందంగా అలంకరిస్తారు. ఈ అలంకరణల్లో కూడా ప్రత్యేకమైన థీమ్‌లు ఉంటాయి. రామాయణం, మహాభారతం థీమ్‌లలో బొమ్మలను ఏర్పాటు చేస్తారు. వీటి మధ్య పోటీ కూడా నిర్వహిస్తారు. తమిళనాడులోని కులశేఖరపట్టణంలో పది రోజుల పాటు 'కులసాయి పండుగ' పేరుతో దసరా వేడుకలు నిర్వహిస్తారు. ప్రసిద్ధ ముతరమ్మన్ ఆలయం వద్ద ఉత్సవాలు నిర్వహిస్తారు. వివిధ నృత్యాలు, నాటకాలు, ఆటపాటలతో వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. తరాయ్ తప్పట్టం నృత్యాలు భక్తులను ఆకట్టుకుంటాయి.


వారణాసిలో దసరా ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే 'రామలీల' ప్రసిద్ధి చెందింది. రామ్‌నగర్‌కోటలో 1800 సంవత్సరం నుంచి సంప్రదాయరీతిలో ఈ వేడుకలు నిర్వహిస్తారు. ఈ వేడుకలను బెనారస్ మహారాజ ఉదిత్ నారాయణ్ సింగ్ ప్రారంభించారు. ఈ కోట మొత్తాన్ని ఓ భారీ వేదికగా మార్చేశారు. ఇక్కడ అయోధ్య, లంక, అశోకవాటిక రూపంలో పర్మినెంట్ సెట్టింగ్‌లు ఏర్పాటు చేశారు. ఈ వేడుకను చూసేందుకు చాలా సహజంగా అనిపిస్తుంది. ఇక, దేశ రాజధాని ఢిల్లీలో దసరా వేడుకలు అంబరాన్ని తాకుతాయి. ముఖ్యంగా రామలీల మైదానంలో ఏర్పాటు చేసే రావణ దహన కార్యక్రమాన్ని చూసేందుకు భారీగా ప్రజలు తరలివస్తారు. నవరాత్రుల ఆఖరి రోజు రావణ, మేఘనాథ, కుంభకర్ణ విగ్రహాలను దహనం చేస్తారు. 170 ఏళ్ల నుంచీ ఈ వేడుకలు జరుగుతున్నాయి. కంజక్ పూజా పేరుతో పూరీ, హల్వా, చెనాలను ప్రసాదంగా ఇస్తారు. ఇక్కడి రెస్టారెంట్లలో నవరాత్రి స్పెషల్ వంటకాలను వడ్డిస్తారు. రాజస్థాన్‌లోని కోటాలో కూడా ఇదే తరహాలో వేడుకలు నిర్వహిస్తారు.


ఆంధ్రప్రదేశ్‌లో దసరా వేడుకలు ఎంతో ఉత్సాహంగా సాగుతాయి. అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. బెజవాడ ఇంద్రకీలాద్రిలో దసరా వేడుకలు అంబరాన్ని తాకుతాయి. నవరాత్రులు పురస్కరించుకుని అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో రూపంలో దర్శనమిస్తారు. నవరాత్రుల చివరిరోజు కృష్ణానదిలో నిర్వహించే తెప్పోత్సం కనువిందు చేస్తుంది. దసరా రోజున ఊరేగించే ప్రభలు ఎంతగానో ప్రసిద్ధిచెందాయి. ప్రభల్లో నిర్వహించే భేతాళనృత్యం అందరినీ ఆకట్టుకుంటుంది. ప్రధానంగా దసరా అనగానే అందరికీ గుర్తొచ్చేవి ఆయుధపూజ, రావణ దహనం. అయితే, తెలంగాణలో మాత్రం మరో ప్రత్యేకమైన వేడుక కూడా మదిలో మెదులుతుంది. అంతేకాదు.. మనసంతా పులకిస్తుంది కూడా. బతుకమ్మ వేడుకలు, దసరా వేడుకలు కలిపి తెలంగాణ అంతా పది రోజుల పాటు.. ప్రత్యేకమైన వాతావరణం సంతరించుకుంటుంది. ఊరూ, వాడా ఉప్పొంగిపోతాయి. రాష్ట్రమంతా ఆధ్యాత్మిక లోగిలిలో ఓలలాడిపోతుంది. తెలంగాణలో బతుకమ్మ, దసరా వేడుకలను రాష్ట్రపండుగగా గుర్తించారు. 


తెలంగాణలో ఆశ్వయుజ మాసం ఆడంబరంగా మారిపోతుంది. ఆశ్వయుజ పాడ్యమి నుంచి బతుకమ్మ, దసరా కళ వచ్చేస్తుంది. ఉత్తరాదిలో శరన్నవరాత్రులు, అమ్మవారికి అలంకారాలు ప్రసిద్ధి అయితే, తెలంగాణలో శరన్నవరాత్రులతో పాటు.. బతుకమ్మ వేడుకలు కూడా జరుపుకుంటారు. ప్రతి ఇంట్లో పూల పండుగ పరవశంలో ముంచెత్తుతుంది. ప్రకృతిని, పూలను ఆరాధించే అత్యంత అరుదైన బతుకమ్మ పండుగ తెలంగాణలో కన్నులనిండుగా జరుగుతుంది. తొమ్మిది రోజుల పాటు బతుకమ్మలను ఆరాధిస్తారు. సామాన్యులు మొదలుకొని, ప్రముఖుల దాకా బతుకమ్మ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. అందరూ పదం, పాదం కలిపి బతుకమ్మల చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. గ్రామాల్లో కూడళ్లు, నగరాల్లో పార్కులు, ప్రముఖ ప్రదేశాలు పూల శోభను సంతరించుకుంటాయి. అమ్మలక్కలు తెచ్చే బతుకమ్మలతో ఆ ప్రాంతాలన్నీ పుష్పాభిషేకాన్ని తలపిస్తాయి.తెలంగాణ సంస్కృతికి ఇదో ప్రతీక. ఫలితంగా  ఊళ్లన్నీ కోలాహలంగా మారిపోతాయి. చివరి రోజు దసరా అత్యంత ఆడంబరంగా జరుపుకుంటారు. ఎంగిలి బతుకమ్మ నుంచి మొదలుకొని దసరా సంబరాల దాకా నిత్యం వేడుకలు అంబరాన్నంటుతాయి. రాష్ట్ర రాజధాని మొదలుకొని, నగరాలు, పట్టణాలు, పల్లెల్లో జనమంతా ఆడి పాడతారు. కేరింతలు కొడతారు. తెలంగాణ ప్రాంతంలో దసరా పర్వదినం రోజు పాలపిట్టను చూడటం ఆచారం. సాయంత్రం సమీపంలోని ఆలయాల్లో నిర్వహించే శమీపూజలో పాల్గొన్న తర్వాత జనం.. పాలపిట్టను చూసేందుకు సమీపంలోని అడవుల్లోకి వెళ్తారు. కొన్ని ప్రాంతాల్లో పాలపిట్టను చూసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తారు. గత మార్చి నుంచి ప్రపంచాన్ని కరోనా వైరస్‌ పట్టిపీడిస్తోంది. ఈ క్రమంలోనే అత్యంత ప్రాముఖ్యమైన దసరా పండుగ కూడా ఈ యేడాది కరోనా కారణంగా కళ తప్పింది. పట్టణాలు, పల్లెల్లో పండుగశోభ తగ్గిపోయింది. దసరా వచ్చిందంటే ప్రతియేటా నగరాల నుంచి జనం పల్లెబాట పడతారు. కానీ, ఈసారి ప్రత్యేక బస్సులుగానీ, రైళ్లుగానీ ఊహించినంతగా లేవు. దీంతో, ఎక్కడివాళ్లు అక్కడే ఉండిపోయారు. అంతేకాదు.. అంతర్జాతీయస్థాయిలో పేరొందిన మైసూరులో దసరా ఉత్సవాలు కరోనా కారణంగా నిరాడంబరంగా మొదలయ్యాయి. కోవిడ్‌-19 మార్గదర్శకాల మేరకు ఈసారి మైసూరు దసరా ఉత్సవాలకు ప్రజలను అనుమతించడం లేదు. ప్రత్యక్షప్రసారం ద్వారా వీక్షించే సదుపాయం కల్పించారు.


- సప్తగిరి గోపగోని, చీఫ్‌ సబ్‌ ఎడిటర్‌, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి.

Updated Date - 2020-10-24T21:26:35+05:30 IST