అంతటా కోలాహలం .. దసరా ప్రాముఖ్యం ఏంటి?

ABN , First Publish Date - 2020-10-25T00:31:34+05:30 IST

దేశంలోనే అతిపెద్ద పండుగ దసరా. ఒక్కో ప్రాంతంలో ఒక్కోగాథకు ప్రతీకగా ఈ పండుగను జరుపుకుంటారు. ఒక్కో పేరుతో పిలుస్తారు. అక్కడి సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించే..

అంతటా కోలాహలం .. దసరా ప్రాముఖ్యం ఏంటి?

అంతటా దసరా కోలాహలం నెలకొంది. ఊరూ, వాడా పండుగ శోభలో మునిగిపోయాయి. దేశమంతా ఈ వేడుకలు ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. మరి.. దసరా ప్రాముఖ్యం ఏంటి? ఎక్కడెక్కడ ఏ పేరుతో చేసుకుంటారు?


దేశంలోనే అతిపెద్ద పండుగ దసరా. ఒక్కో ప్రాంతంలో ఒక్కోగాథకు ప్రతీకగా ఈ పండుగను జరుపుకుంటారు. ఒక్కో పేరుతో పిలుస్తారు. అక్కడి సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా వేడుకలు నిర్వహిస్తారు. 


దసరా.. విజయానికి ప్రతీక. అందుకే ఈ పర్వదినాన్ని విజయదశమి అని కూడా అంటారు. దసరా అనగానే ఉత్సాహం ఉరకలు వేస్తుంది. మనసంతా జోష్‌ ఆవరిస్తుంది. హిందువుల అతిపెద్ద పండుగల్లో ఒకటైన విజయదశమిని దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. ఏ ప్రాంత సంస్కృతి సంప్రదాయాలకు తగినట్లు నిర్వహించుకుంటారు. అలా.. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా దసరా వేడుకలు జరుగుతాయి. ఆయా రాష్ట్రాల్లో సంస్కృతిని బట్టి ప్రత్యేకంగా విజయదశమి వేడుకలను వేర్వేరు పేర్లతో పిలుస్తారు. 


దసరా పర్వదినం అంటే ఒక్కరోజు వేడుక కాదు. పదిరోజుల పండుగ ఇది. ప్రతి యేడూ ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి మొదలుకొని నవమి వరకు తొమ్మిది రోజుల పాటు దేవీ నవరాత్రులు, శరన్నవరాత్రులుగా భారతీయులు కొలుస్తారు. ఈ నవరాత్రుల తరువాత రోజు వచ్చే శుద్ధ దశమిని 'విజయ దశమి', 'దసరా'గా జరుపుకుంటారు. దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఈ పండుగ జరుపుకోవడం అనాది సంప్రదాయంగా వస్తోంది.


దసరా పర్వదినం అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించే అపురూపమైన పండుగ. శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ప్రధానంగా అమ్మవారిని మహాశక్తిగా ఆరాధించే పర్వదినం. దేవీ ఆలయాల్లో ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని తొమ్మిది రోజులపాటు తొమ్మిది ప్రత్యేక రూపాల్లో అమ్మవారిని అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సాధారణంగా ఈ నవరాత్రులలో మొదటి మూడు రోజులు పార్వతీ దేవికి, తదుపరి మూడు రోజులు లక్ష్మీదేవికి, చివరి మూడు రోజులు సరస్వతీ మాతకు చెందినవిగా భావించినా, ప్రతి నిత్యం అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించడం ఆనవాయితీగా  వస్తోంది. 


దసరా వేడుకల్లో అమ్మవారి అలంకారాలు ఎంతో ప్రాశస్త్యం పొందాయి. తొలిరోజు అమ్మవారిని శ్రీ బాలాత్రిపుర సుందరిగా అలంకరిస్తారు. రెండోరోజు శ్రీ గాయత్రీ మాతగా కొలుస్తారు. మూడోరోజు శ్రీ మహాలక్ష్మీ అమ్మవారిగా పూజిస్తారు. నాలుగోరోజు శ్రీ అన్నపూర్ణేశ్వరిగా అభయమివ్వాలని వేడుకుంటారు. ఐదోరోజు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా అమ్మవారిని సేవిస్తారు. ఆరో రోజు శ్రీ మహా సరస్వతీ దేవిగా అలంకరిస్తారు. ఏడో రోజు శ్రీ దుర్గా మాతగా అమ్మవారిని అలంకరించి పూజిస్తారు. ఎనిమిదో రోజు శ్రీ మహిషాసుర మర్దనిగా, చివరి రోజైన తొమ్మిదో రోజు శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా అమ్మవారిని కొలుస్తారు. అందుకే ఈ తొమ్మిది రోజులను దేవీ నవరాత్రులుగా పిలుస్తారు. శరత్‌ కాలంలో ఈ వేడుకలు జరుపుకుంటున్నందున వీటిని శరన్నవరాత్రులు అని కూడా అంటారు. 


కొన్ని ప్రాంతాలలో ఈ తొమ్మిది రోజుల పాటు బొమ్మల కొలువులు కూడా పెట్టి పూజిస్తారు. ఈ తొమ్మిది రోజుల పాటు.. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించిన రోజు ఆ రూపంలో ఉన్న తల్లి జన్మించిన పవిత్ర దినంగా భావిస్తారు. వివిధ రూపాల్లో అమ్మవారిని సేవించడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయని బలంగా విశ్వసిస్తారు. 


పదవ రోజును విజయ దశమిగా జరుపుకోవడం వెనక అనేక గాథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. రావణునిపై రాముడు విజయం సాధించిన రోజుగా చెప్పుకుంటారు. దశకంఠుని సంహరించిన రోజు గనుక తొలుత 'దశహర'గా పిలువబడిందని, క్రమంగా అదే దసరాగా మారిందని కొందరు విశ్వసిస్తారు.  అందుకే అనేక ప్రాంతాలలో దసరా రోజున రావణ దహనం నిర్వహిస్తారు.


దసరా నాడు శమీపూజ నిర్వహించడం అనాదిగా వస్తున్న ఓ ఆచారం. శమీవృక్షంగా పిలిచే జమ్మిచెట్టును పూజించడం వెనుక వేద పండితులు ఓ పౌరాణిక గాథ కూడా చెబుతారు. పాండవులు అరణ్య వాసం పూర్తయిన తర్వాత అజ్ఞాతవాసం ప్రారంభించే ముందు.. తమ తమ ఆయుధ సంపత్తిని విరాట నగర శివారులోని ఒక జమ్మి చెట్టుమీద ఉంచినట్లు మహాభారత గాథలో ఉంది. వారి వనవాస కాలం ముగిసిన వెంటనే ఆ శమీవృక్షం మీది ఆయుధాలను తిరిగి గ్రహించిన రోజుగా, అర్జునుడు గోగ్రహణ సందర్భంలో విజయం సాధించి తిరిగి వచ్చిన రోజుగా ఈ విజయ దశమి రోజును చెప్పుకుంటారు. అందుకే దసరా పర్వదినం రోజు జమ్మిచెట్టుకు శమీపూజ నిర్వహించి.. శమీ పత్రాలను ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకుంటారు. పెద్దలకు అందించి వాళ్ల ఆశీర్వాదాలు తీసుకుంటారు.


శమీపూజ సమయంలో 'శమీ శమయతే పాపం శమీశత్రు వినాశనమ్‌ | అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శినీ || అనే శ్లోకం ప్రతి ఒక్కరి నోటా పలుకుతారు. అంతేకాకుండా.. ఈ మంత్రాన్ని చిన్న చిన్న కాగితాలపై రాసి, దాని క్రింద తమ తమ కోరికలను కూడా రాసి, ఆ కాగితాలను శమీవృక్షానికి కట్టడం కొన్ని ప్రాంతాల్లో ఆచారంగా ఉంది. మొత్తానికి నవరాత్రులు, విజయ దశమి వంటి పండుగను శోభాయమానంగా నిర్వహించుకోవడంలో భారతీయులకు ఎవరూ సాటి రారని చెప్పవచ్చు.


మరో గాథలో జగన్మాత దుర్గాదేవి మహిషాసురుని సంహరించి విజయం సాధించిన రోజుగా దసరా పర్వదినం గురించి చెబుతారు. తొమ్మిది రోజుల పాటు దుర్గాదేవి యుద్ధం చేసి మహిషాసురుని సంహరించిందని, అందుకే పదోరోజు ప్రజలంతా సంతోషంతో పండుగ జరుపుకున్నారని, అదే దసరా అని అంటారు. అందుకే దుర్గాదేవి ఆలయాలలో దుర్గా నవరాత్రులు నిర్వహించి, విజయ దశమి రోజు అమ్మవారిని ఘనమైన రీతిలో ఆరాధిస్తారు. ఒక్కోరోజు ఒక్కో దేవతగా ఆలయాల్లోని అమ్మవార్లను అలంకరిస్తారు. కానీ, గర్భగుడిలోని దేవతలు మాత్రం వాళ్లే. సనాతన సంప్రదాయం ప్రకారం ఆ ఒక్కరోజు మాత్రం అలంకారానికి సంబంధించిన అమ్మవారి పేరుతో పూజిస్తారు.


అయితే, శరన్నవరాత్రుల్లో భాగంగా అమ్మవారి ఆలయాల్లోనే కాదు.. ప్రధాన కూడళ్లలో మంటపాలు ఏర్పాటు చేసి దుర్గాదేవి విగ్రహాన్ని మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకొచ్చి ప్రతిష్టిస్తారు. నవరాత్రుల పాటు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి సమీపంలోని నదులు, చెరువుల్లో నిమజ్జనం చేస్తారు. ఆలయాల్లోనూ గర్భగుడిలోని విగ్రహాలను నిత్యం ఒక్కో మాతగా అలంకరించడమే కాకుండా.. ప్రత్యేకంగా దుర్గామాత విగ్రహాలను ప్రతిష్టించడం కూడా ఆనవాయితీగా వస్తోంది. ఈ ఉత్సవ మూర్తులకు కూడా గర్భగుడిలో మాదిరిగానే తొమ్మిదిరోజుల పాటు.. పూజలు నిర్వహించి నిమజ్జనం చేస్తారు. 


ఇక.. దసరా ఉత్సవాల్లో భాగంగా ఆయుధపూజ నిర్వహించడం భారతదేశంలో ఆనవాయితీ. కర్మాగారాల్లో, వ్యాపార సంస్థల్లో భక్తి శ్రద్ధలతో ఆయుధపూజ నిర్వహిస్తారు. యేడాది పాటు.. ఏలోటూ రాకుండా చూడాలని, చేస్తున్న పనుల్లో ఆటంకాలు కలుగకుండా చూడాలని, అన్నింటా విజయాలే వరించాలని ఆకాంక్షిస్తూ ఆయుధపూజలు చేస్తారు. ఈ సంప్రదాయం దాదాపు దేశమంతటా కొనసాగుతుంది. 


- సప్తగిరి గోపగోని, చీఫ్‌ సబ్‌ ఎడిటర్‌, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి


Updated Date - 2020-10-25T00:31:34+05:30 IST