మాజీ మ్యాజిక్‌

ABN , First Publish Date - 2022-09-23T06:27:51+05:30 IST

మాజీ మ్యాజిక్‌

మాజీ మ్యాజిక్‌
సమీక్షలో ముభావంగా మంత్రి కొట్టు సత్యనారాయణ

దసరా ఉత్సవాలపై దేవదాయ శాఖ మంత్రి నిర్ణయాలన్నీ తూచ్‌..!

సమీక్ష సమావేశంలో మాజీ మంత్రి వెలంపల్లిదే హవా

తొలి రెండు సమావేశాల్లో ఉత్సాహంగా పాల్గొన్న మంత్రి కొట్టు సత్యనారాయణ

మూడో సమావేశంలో మాత్రం ముభావంగా..

ఆయన నిర్ణయాలన్నీ బుట్టదాఖలు


దసరా ఉత్సవాలపై నెల రోజుల్లో మూడుసార్లు ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశమై కీలక నిర్ణయాలు చేసిన దేవదాయ మంత్రి కొట్టు సత్యనారాయణ గురువారం జరిగిన సమావేశంలో సైలెంట్‌ అయ్యారు. తొలి రెండు సమావేశాల్లో అధికారులకు దిశానిర్దేశం చేసిన ఆయన ఈ సమావేశంలో కనీసం నోరు మెదపలేదు. గత సమావేశ సూచనలన్నింటినీ పక్కన పెట్టేయడం, సమీక్ష ఆసాంతం పశ్చిమ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు కనుసన్నల్లో జరగడం చూస్తుంటే.. తెరవెనుక మాజీ మంత్రి మంత్రాంగం నడుస్తోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.    - విజయవాడ-ఆంధ్రజ్యోతి/వన్‌టౌన్‌


అప్పుడలా..?

దసరా ఉత్సవాల్లో వీఐపీల తాకిడిని కట్టడి చేయాలన్న లక్ష్యంతో దేవదాయ శాఖ మంత్రి ఆగస్టు 25న జరిగిన సమీక్ష సమావేశంలో అధికారులకు పలు సూచనలు చేశారు. సామాన్య భక్తులు, వీఐపీలు క్లాష్‌ కాకుండా ఉండేందుకు ఘాట్‌రోడ్డులో వీఐపీల రాకను బంద్‌ చేశారు. లిఫ్ట్‌ ద్వారా పైకి చేర్చేందుకు ప్రణాళిక తయారు చేశారు. అదే సమయంలో ఘాట్‌రోడ్డులో మొత్తం భక్తులు మాత్రమే వెళ్లేలా, వీఐపీలు సహా ఎవరి వాహనాలనూ కొండపైకి రాకుండా నియంత్రించేలా చేయాలని సూచించారు. మరోవైపు భక్తుల క్యూలైన్లను కెనాల్‌ రోడ్డులోని వినాయకుడి గుడి నుంచి కాకుండా కనకదుర్గానగర్‌ వద్దనే అధిక లైన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. వీఐపీల పేరుతో వచ్చే ప్రజాప్రతినిధుల అనుచరగణాన్ని కట్టడి చేసేందుకు స్లాట్లను కేటాయించాలన్నారు. ఒక్కో ప్రజాప్రతినిధికి  10 సిఫారసు లేఖలే అనుమతించాలని, ఒక్కో లేఖపై ఆరుగురినే అనుమతించాలని ఆదేశించారు. 

ఇప్పుడేమో ఇలా..!

గతంలో మంత్రి చేసిన సూచనలన్నింటినీ గురువారం జరిగిన సమీక్ష సమావేశంలో తుంగలో తొక్కారు. దేవదాయ శాఖ మాజీ మంత్రి, పశ్చిమ ఎమ్మెల్యే వెలంపల్లి, సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఇద్దరూ అధికారులపై ఒత్తిడి తెచ్చి మంత్రి సూచనలన్నింటినీ బుట్టదాఖలు చేయించారన్న ఆరోపణలు వస్తున్నాయి. దీంతో మంత్రి సూచనలన్నింటినీ అమలు చేయడం సాధ్యం కాదని అధికారులు పక్కన పెట్టేశారు. ఒక్కో ప్రజాప్రతినిధికి 10 సిఫారసు లేఖలు ఇవ్వడం, లిఫ్టుల ద్వారా వీఐపీలను తీసుకెళ్లడమంటే పోలీసుల తరఫున, ఎమ్మెల్యేల తరఫున వచ్చే బంధుమిత్రులు, ఇతర అనుచరగణాన్ని నియంత్రించడమేనని పేర్కొన్నారు. భక్తుల క్యూలైన్లను కెనాల్‌ రోడ్డులోని వినాయకుడి గుడి వద్ద నుంచే ఏర్పాటు చేస్తామని సమావేశంలో అధికారులతో చెప్పించారు. వీఐపీ స్లాట్ల విధానాన్ని కూడా ఎత్తేశారు. ప్రజాప్రతినిధులకు సిఫారసు లేఖలు వంటి మంత్రి సూచనలన్నీ అమలు సాధ్యం కాదని తేల్చేశారు. వీఐపీలను కార్లలో ఘాట్‌రోడ్డు మీదుగా తీసుకెళ్తామని స్పష్టం చేశారు. 

మూడు ప్రసాదాలు రెండుకు..

దసరా ఉత్సవాలకు వచ్చే భక్తులకు కరోనాకు ముందు పెట్టిన తరహాలోనే భోజనాలు పెట్టాలని గత సమావేశంలో మంత్రి కొట్టు సత్యనారాయణ సూచించారు. అది సాధ్యం కాదని అధికారులు చెప్పడంతో చక్కెర పొంగలి, దద్ద్యోజనం, పులిహోర ఒక ప్లేటులో పెట్టాలని మంత్రి సూచించారు. కానీ, ఇప్పుడు మూడు ప్రసాదాలు కాస్తా రెండుకు తగ్గించారు. ప్లేటులో పెట్టి ఇవ్వడం కుదరదని, దద్ద్యోజనం, పులిహోరను ప్యాకెట్లలో కట్టి భక్తులకు ఇస్తామని అధికారులు మంత్రికి తెలిపారు. మొత్తం మీద దేవదాయ శాఖ మంత్రి చేసిన ఏ ఒక్క సూచననూ అధికారులు అమలు చేయకుండానే దసరా ఉత్సవాల నిర్వహణకు సిద్ధమవుతున్నారు. గురువారం నాటి సమీక్షా సమావేశంలో మొత్తం కార్యక్రమాన్ని పశ్చిమ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు నడిపించారు. ఆయనే ఏర్పాట్ల గురించి పలు ప్రశ్నలు వేశారు. తిరిగి ఆయనే అది ఇలా చేయండి.. ఇది ఇలా చేయండి.. అని ఆదేశాలిచ్చారు.  కొట్టు సత్యనారాయణ దేవదాయ శాఖ మంత్రి అయిన దగ్గర్నుంచి వెలంపల్లితో పొసగడం లేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మంత్రిగా ఆఖరి నిమిషంలో వెలంపల్లి పలు ఫైళ్లపై సంతకాలు చేశారని, వాటిలో అధికశాతం ఫైళ్లను కొట్టు సత్యనారాయణ అమలుకాకుండా నిలిపివేశారని, ఈ కారణంగానే వీరి నడుమ దూరం పెరిగిందని వైసీపీ నాయకులే చెబుతున్నారు.



Updated Date - 2022-09-23T06:27:51+05:30 IST