Abn logo
Oct 18 2021 @ 23:59PM

దసారా తాగుడు రూ.65కోట్లు

పది రోజుల్లోనే  పెద్ద మొత్తంలో తాగేశారు

నాటుసారా లెక్కలేనంత

బార్లు ఫుల్‌

రాజమహేంద్రవరంలో బార్ల నిర్వాహకుల సిండికేట్‌ 


(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

పండగ అంటే అందరికీ ఇష్టమే. అందులో మందుబాబులకు మరీ ఇష్టం. దేవుడ్ని తలచుకుంటూ కూడా తాగేస్తారు. ఇటీవల షాపులు, బార్లు, ఇళ్లే కాదు. బహిరంగ ప్రాంతాలు, నిర్మానుష్య ప్రాంతాలను బాగా ఎంపిక చేసుకుంటున్నారు. తాగుబోతులకు ధైర్యం ఎక్కువో, లేక వారికి ఆ మత్తులో భయమనేది తెలియదో కానీ... రాత్రివేళల్లో చెట్ల పొదలు, డొంకలు వంటి ప్రాంతాలలోనూ, చీకటి గుహల వంటి  నిర్జన ప్రాంతాల్లో నేలమీదే కూర్చుని తాగడానికి ఎక్కువ మంది మక్కువ చూపుతున్నారు. పోలీసులు వీరిపై  కేసులు పెట్టి కంట్రోలు చేస్తున్నారు. పండగొచ్చిందంటే ఏదో ఒక సమయంలో, ఏదో ఒక మూల కూర్చుని ఛీర్స్‌ కొట్టవలసిందే. దసరా ఉత్సవాల్లోనూ ఈ కోవకు చెందిన వారు ‘ఫుల్‌’గా తాగేశారు. కానీ డిసెంబరు 31, సంక్రాంతి పండుగలతో పోలిస్తే ఇది తక్కువేనని అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే ఈ సీజన్లో ఎక్కువ మంది భవానీ మాల ధరిస్తారు. ఈ నెల 7న మొదలైన దసరా పండుగ 15న ముగిసింది. ఈ పది రోజుల్లో జిల్లాలోని మందుబాబులు సుమారు రూ.65 కోట్లు తాగేశారు. జిల్లాలో 373 ప్రభుత్వ మద్యం అవుట్‌లెట్‌లు ఉన్నాయి. రాజమహేంద్రవరం డిపో పరిధిలో 138 అవుట్‌ లెట్లు ఉండగా.... దసరా పది రోజుల్లోనూ ఇక్కడ రూ.17,58,98,420 తాగారు. సామర్లకోట డిపో పరిధిలో 148 అవుట్‌లెట్‌లు ఉండగా రూ.19,82,53,820 తాగేశారు. అమలాపురంలో 88 అవుట్‌ లెట్‌లు ఉండగా రూ.16,04,48,910 తాగారు. ఈ మూడు డిపోల పరిధిలోని మొత్తం 374 అవుట్‌ లెట్లలో రూ.53,46,01,150 తాగారు. ఇక జిల్లాలో సుమారు 40 వరకు బార్లు ఉన్నాయి. ఇక్కడ రాత్రి, పగలు తాగేస్తుంటారు. రాత్రి 11 గంటల వరకు అక్కడే కూర్చుకుని తాగి దొర్లుతారు. ఈ బార్లలో సుమారు రూ.11-12 కోట్ల వరకు తాగి ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. ఇక నాటుసారా, కల్లు ఎంత తాగారో లెక్కేలేదు. కల్లుకైనా లెక్క కట్టవచ్చేమో కానీ, నాటుసారా లెక్కలు తీయడం ఎవరి తరమూ కాదు. జిల్లాలో సగంపైగా ప్రాంతాల్లో నాటు సారా జోరుగా లభ్యమవుతోంది. తయారీదారుడు లీటరు నాటుసారాను రూ.200కు అమ్ముతాడు. అది తాగుబోతుల వద్దకు వచ్చేసరికి రూ.1000 వరకు ఉంటుంది. ఈ వ్యాపారం ద్వారా అనేక మంది రూ.కోట్లు గడిస్తున్నారు. అధికారులు ఎన్ని దాడులు చేసినా నాటుసారాను అరికట్టడం కష్టమవుతోంది.


ఆగస్టు కంటే సెప్టెంబరులో తగ్గింది?

ఆగస్టులో కంటే సెప్టెంబరు నెలలో కొంత మేర తాగుడు తగ్గినట్టు అధికార లెక్కలు చెప్తున్నాయి. భవానీ మాలలు ధరించడం వల్లే ఈ తగ్గుదల కనిపిస్తోందనే వాదన ఉంది. ఆగస్టు నెలలో జిల్లాలోని 374 అవుట్‌లెట్లలో  ఏకంగా రూ.197,25,14,850 విలువైన మద్యం తాగారు. సామర్లకోట డిపో పరిధిలోని 148 అవుట్‌లెట్లలో రూ.74, 25,69,400, రాజమహేంద్రవరం డిపో పరిధిలోని 138 అవుట్‌లెట్లలో రూ.65,19,40,770,  అమలాపురం డిపో పరిధిలోని  88 అవుట్‌లెట్లలో  రూ.57,80,04,680 మద్యం తాగారు. బార్లలో లెక్కలు సరిగ్గాలేవు. అక్కడ సుమారు రూ.12కోట్లు తాగి ఉండొచ్చు. సెప్టెంబరు నెలలో సామర్లకోట పరిధిలో రూ.67,56,84,120,  రాజమహేంద్రవరం పరిధిలో రూ.61,45,28,450, అమలాపురం పరిధిలో రూ.52,39,96,150 తాగారు.

 

బార్లలో బాదుడు

అసలే మద్యం ధరలు ఎక్కువని బాధపడుతుంటే బార్లలో మరింత బాదేస్తున్నారు. ప్రభుత్వ అవుట్‌ లెట్లలోని ధర కంటే రూ.50 నుంచి రూ.60 వరకు అధికంగా విక్రయిస్తున్నారు. ఇటీవల రాజమహేంద్రవరంలో బార్ల నిర్వాహకులు రెండు సిండికేట్లుగా ఏర్పడ్డంతో ఒకరు రూ.10 తగ్గించడం గమనార్హం. ఇటీవల మరో కొత్త మార్పు ఏమిటంటే గతంలో కాస్త విలువైన మద్యం తాగే వర్గాలు కూడా చీఫ్‌ క్వాలిటీ తాగుతున్నారు. గ్రీన్‌ చాయిస్‌, ఆంధ్రా గోల్డ్‌, 9హార్స్‌టైమర్‌ వంటి రకాలు క్వార్టరు బాటిల్‌ ధర రూ.150 పలుకుతోంది. సీప్రం, రాయల్‌ రకాలు రూ.200 వున్నాయి. మేన్సన్‌ హౌస్‌, రాయల్‌ గ్రీన్‌,  వైట్‌ అండ్‌ బ్లూ... రూ.270 ఉంది. బీర్ల విషయంలో బూమ్‌, టెన్‌థౌజండ్‌, బ్రిటిష్‌ వంటివి రూ.210-220 ఉన్నాయి. ఇవి ప్రభుత్వ అవుట్‌లెట్‌లలోని ధరలు. బార్లలో మరింత ఎక్కువ. ఇటీవల కొంత తగ్గినట్టు కనిపిస్తున్నా నవంబరు నుంచి డిసెంబరుకు తాగుడు మరింత పెరిగే అవకాశం ఉంది. డిసెంబరు 31 నాటికి రికార్డు స్థాయిలో అమ్మకాలు ఉండవచ్చు.