దసరా ధమాకా సేల్‌

ABN , First Publish Date - 2020-10-27T10:20:52+05:30 IST

పండుగ అంటేనే కొత్తదనం. అందులో దసరా, దీపావళి పండుగలకి ఇళ్లకి కొత్తవస్తువుల రాక సహజం. అలా కొత్త దుస్తులు, మద్యం, మాసం గురించి చెప్పనక్కరలేదు.

దసరా ధమాకా సేల్‌

ఉమ్మడి జిల్లాలో జోరుగా అమ్మకాలు

ఆర్టీసీ మినహా పెరిగిన అన్నీ విభాగాల వ్యాపారాలు 

పండుగ ఖర్చు రూ.300 కోట్లు పైమాటే

అగ్రభాగంలో దుస్తుల విక్రయాలు 

ఈ సీజన్‌లో 200 కేజీల బంగారం


ఖమ్మం, అక్టోబరు26 (ఆంధ్రజ్యోతి): పండుగ అంటేనే కొత్తదనం. అందులో దసరా, దీపావళి పండుగలకి ఇళ్లకి కొత్తవస్తువుల రాక సహజం. అలా కొత్త దుస్తులు, మద్యం, మాసం గురించి  చెప్పనక్కరలేదు. అయితే గతంలో ఈ సంవత్సరం సానుకూల పరిస్థితులు లేవు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో అసలు పండుగ జరుపుకొంటారా? అన్న అనుమానాలు రేకెత్తాయి. అయితే గతానికంటే ఎక్కువగానే పండుగను జరుపుకొన్నారు. ఇరు జిల్లాల ప్రజలు. దానికి ఉమ్మడి జిల్లాలో వ్యాపారాలు  నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఈ యేడాది దసరాకు ఖమ్మం జిల్లా ప్రజానికం ఖర్చు పెట్టింది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ. 300 కోట్ల పైమాటే. దసరా పండుగకు నెల రోజుల నుంచే ఆఫర్లతో మొదలైన దుస్తుల షాపులు, ఎలక్ర్టానిక్స్‌ దుకాణాల్లో అమ్మకాలు భారీగానే సాగాయి. కాగా ఇదే జోరు జిల్లాలో దీపావళి వరకు కొనసాగుతుందని వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు. 


దుస్తులు, బంగారం బంపర్‌ సేల్‌

ఈ పండుగ సీజన్‌లో దుస్తులు, బంగారం బంపర్‌ సేల్‌ అయ్యింది. సరిగ్గా దసరాకు నెల ముందు నుంచి మొదలైన సేల్‌ గత యేడాది దసరాకంటే 30 శాతానికి పైగా పెరిగింది. ఉమ్మడి జిల్లాలో సుమారు 700 నుంచి 800 వస్త్ర దుకాణాలు, పదికి పైగా మాల్స్‌ ఉన్నాయి. వారే కాకుండా ఇళ్లలో ఉంటూ వస్త్ర వ్యాపారం చేసేవారు మరో మూడు వేల మంది ఉంటారు. ఆయా వ్యాపారులు ప్రతీనెల సుమారు రూ. 150 కోట్ల వ్యాపారం చేసేవారు. ఇక దసరా వేళల్లో మరికాస్తా పెరిగేది. అలా ఈ సంవత్సరం దసరాకు మరో 30 శాతం అమ్మకాలు పెరగడంతో సుమారు రూ. 300 కోట్ల వ్యాపారం జరిగింది. ఇక బంగారం విషయానికొస్తే ఈ సీజన్‌లో సుమారు 200 కిలోల బంగారం అమ్మకాలు సాగాయి. అంటే కిలో బంగారం ధర సుమారు రూ. 50 లక్షలు ఉండగా రెండు వందల కిలోల బంగారం ధర రూ. 100 కోట్లు అవుతోంది. కాగా పండుగ వేళ జరిగిన బంగారం అమ్మకాలు బంపర్‌గానే ఉన్నాయని స్పష్టమవుతోంది. కాగా లాక్‌డౌన్‌ ఆ తర్వాత కరోనా వ్యాప్తి నేపథ్యంలో హైదరాబాద్‌, విజయవాడ, బెంగుళూరు వంటి ప్రాంతాల్లో చదువుకునే విద్యార్థులు, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు, ఇతరేత్రా వారు అంతా సొంత ఇళ్లకే పరిమితమయ్యారు. దాంతో ఈ పర్యాయం దసరాకు అందరూ సొంత జిల్లాలోనే షాపింగ్‌ చేయడంతో వ్యాపారాలు పెరిగినట్టు వ్యాపారులు అంచనా వేస్తున్నారు. 


ఎలక్రానిక్స్‌, ఇతరేత్రా అమ్మకాలు రూ.5 కోట్లు పైగానే

రిఫ్రిజిరేటర్‌లు, ఎల్‌ఈడీ టీవీలు, వాషింగ్‌ మెషీన్లు, కొత్త వాహనాలు ఇలా ఒకటేంటి బోలెడన్నీ కొత్త వస్తువులు కూడా ఈ సారి బాగానే అమ్మకాలు సాగాయి. కాగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎలక్ర్టానిక్స్‌ వస్తువుల జాతర సాగిందనే చెప్పాలి. ఏ షాపును చూసిన పండుగ ముందురోజు జనాలతో కిక్కిరిసి పోయాయి. ప్రతీఒక్క వ్యాపారి పండుగ ఆఫర్లతో హోరేత్తించారు. ఇక దుస్తుల షాపుల్లో ఎంత కొనుగోలు చేస్తే దానికి తగ్గట్టుగా ఎలక్ర్టానిక్స్‌లోనూ ఆఫర్లను ప్రకటించేశారు. వారు ప్రకటించిన ఆఫర్లకు తగ్గట్టుగా సామాన్య, మధ్యతరగతి నుంచి మొదలుకుని పెద్దస్థాయి కుటుంబాల వరకు ఎవరికి తగ్గస్థాయిలో వారు షాపింగ్‌లు చేశారు. దాంతో పండుగ సేల్‌ విపరీతంగా పెరిగింది. జిల్లా వ్యాప్తంగా సాగిన ఎలక్ర్టానిక్స్‌, ఇతరేత్రా అమ్మకాలు విలువ రూ.ఐదు కోట్లకు పైగానే అని కొందరు నిపుణులు చెబుతున్నారు. 


మద్యం, మాంసం విక్రయాలదీ అదేదారి

దసరాకు రెండు రోజుల ముందు నుంచి డిపో నుంచి కొనుగోలు చేసిన మొత్తం మద్యం విలువ రూ. 14.66 కోట్లు. దానితోపాటుగా మాసం విక్రయాలు కూడా అదేస్థాయిలో సాగాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమాఉ 75వేల కోళ్ల అమ్మకాలు సాగాయి. ఒక్కో కేజీ ధర రూ. 240 నుంచి 260 వరకు అమ్మకాలు సాగించారు. అలా చికెన్‌ అమ్మకాలు రూ. నాలుగు  కోట్లు కాగా సుమారు 15వేల మేకలు, గొర్రెలు అమ్మకాలు సాగాయి. ఒక్కొక్కటి 12 నుంచి 15 కిలోలు ఉండగా.. కిలో ధర రూ. 680 నుంచి రూ. 800 వరకు అమ్మకాలు సాగించారు. అలా రూ. 16 కోట్ల వ్యాపారం సాగింది. 


కోలుకోని ఆర్టీసీ

ప్రతీ దసరాకు ఆర్టీసీ బస్టాండులు మాత్రం కళకళలాడుతూ ఉండేవి. తమ సొంత ప్రాంతాలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగస్థులు ఇలా దసరా సమయాల్లో కిటకిటలాడేవి.  ప్రస్తుతం కరోనా వ్యాప్తి కారణంగా అవి వెలవెలబోతున్నాయనే చెప్పాలి. రెండేళ్లుగా దసరా సమయాల్లో ఆర్టీసీకి ఇదే పరిస్థితి నెలకొంది. గతంలో ఆర్టీసికి దసరా సమయంలో రూ. కోటికి పైగానే ఆదాయం వచ్చేది. కాగా గతేడాది ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె కారణంగా నష్టం మిగిలింది. కాగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో అందరూ లాక్‌డౌన్‌ సమయంలోనే ఇళ్లకు చేరుకున్నారు. దాంతో ప్రస్తుతం ఆర్టీసీకి దసరా ఆదాయం వచ్చే పరిస్థితి కనిపించడంలేదు. ఒకవేళ వచ్చిన అది నామమాత్రమేనని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2020-10-27T10:20:52+05:30 IST