Abn logo
Oct 30 2020 @ 05:29AM

ఆర్టీసీకి దసరా ధమాకా...

Kaakateeya

 ఒకే రోజు కోటి రూపాయల ఆదాయం

కరోనా ఉన్నా ప్రయాణికుల ఆదరణ


(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌): కార్మికుల సమ్మె, కరోనా కారణంగా ఆర్థికంగా కుదేలైన ఆర్టీసీ సంస్థ ఇప్పుడిప్పుడే కుదుట పడుతున్నది. దసరా పండుగ ఆ సంస్థకు సంతోషాన్ని మిగిల్చింది. పండుగ సందర్భంగా ప్రయాణికులు ప్రైవేటు రవాణా కంటే ఆర్టీసీ  ప్రయాణంపైనే మక్కువ చూపించడంతో ఆ సంస్థ ఆదాయం గణనీయంగా పెరిగింది. రాబోయే రోజుల్లో ఆర్థికంగా మరింత పరిపుష్టి సాధించే దిశగా సంస్థ సాగుతుందనే విశ్వాసం కలుగుతున్నది. బతుకమ్మ, దసరా, దీపావళి పండుగలను పురస్కరించుకుని  తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు ఒకే రోజు ఆదాయం అదిరిపోయింది. కరోనా, లాక్‌డౌన్‌ నేపథ్యంలో అంతంత మాత్రంగా వస్తున్న ఆదాయం ఒక్కసారిగా ఒకే రోజు బుధవారం కోటి రూపాయలకు చేరువైంది. అక్టోబర్‌ 27 వరకు 61,72,000 రూపాయల ఆదాయం మాత్రమే వచ్చింది. దసరా పండుగను పురస్కరించుకుని  బుధవారం నాడే రికార్డు స్థాయిలో ఆర్టీసీకి 90,97,000 రూపాయల ఆదాయం సమకూరింది. అక్టోబర్‌ నెలతో పోల్చుకుంటే ఒకే రోజున 30 లక్షల రూపాయల ఆదాయం ఆర్టీసీకి పెరిగింది. 


 లాక్‌డౌన్‌తో తగ్గిన ఆదాయం

కరోనా ప్రభావంతో బస్సు ప్రయాణాలు అంతంత మాత్రంగా సాగడంతో లాక్‌డౌన్‌ 5.0 వరకు మంగళవారం వరకు ఆదాయం అరకొరగానే ఉండిపోయింది. బతుకమ్మ, దసరా, దీపావళి పండుగలను పురస్కరించుకుని ఆర్టీసీ రీజియన్‌ వ్యాప్తంగా ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులను అధికారులు వివిధ ప్రాంతాలకు నడిపించారు. అధికారులు ఆర్టీసీ బస్సుల సంఖ్యను పెంచడంతో పాటు, ప్రయాణీకులను గమ్య స్థానాలకు చేర్చడంలో సఫలీకృతమయ్యారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు మొదటిసారిగా లాక్‌డౌన్‌ తర్వాత ప్రయాణికుల ఆదరణ పెరిగి పోవడంతో రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. లాక్‌ డౌన్‌ అనంతరం మే నెల 19వ తేదీన ఆర్టీసీ బస్సులను ప్రారంభించింది. ఆనాటి నుంచి నేటి వరకు ఒకే రోజు ఎక్కువ మొత్తంలో బుధవారం ఆదాయం ఆర్టీసీకీ సమకూరింది. రోజు వారీగా నడిపే బస్సులకు అదనంగా బుధవారం మరో 50 బస్సులను అధికారులు నడిపించారు. కరీంనగర్‌ ఆర్టీసీ రిజీయన్‌ పరిధిలోని అక్టోబర్‌  27వ తేదీ వరకు కరీంనగర్‌ డివిజన్‌ పరిధిలో 351 బస్సులను నడిపించగా 37,42,000 రూపాయల ఆదాయం వచ్చింది.


జగిత్యాల డివిజన్‌ పరిధిలో 246 బస్సులు నడిపించి 24,30,000 రూపాయల ఆదాయం సమకూరింది. మొత్తం రీజియన్‌ వ్యాప్తంగా 597 బస్సులను నడిపించి 61,72,000 రూపాయల ఆదాయం సమకూర్చుకున్నారు. అక్టోబర్‌ 28వ తేదీ బుధవారం రోజున కరీంనగర్‌ డివిజన్‌ పరిధిలో 376 బస్సులు నడిపించి 55,48,000 రూపాయల ఆదాయం వచ్చింది. జగిత్యాల డివిజన్‌ పరిధిలో 262 బస్సులను నడిపించగా, 35,49,000 రూపాయల ఆదాయం సమకూరింది. మొత్తం కరీంనగర్‌ రీజీయన్‌ వ్యాప్తంగా పది డిపోల్లో 638 బస్సులను నడిపించగా, 90,97,000 రూపాయల ఆదాయం ఆర్టీసీకి సమకూరింది. కరోనా అనంతరం ఒక్కసారిగా ఒకే రోజు కోటి రూపాయలకు చేరువ కావడంతో ఆర్టీసీ సంస్థలో పండుగ వాతావరణం నెలకొంది.


ప్రయాణికులకు ఆర్టీసీపై నమ్మకం పెరిగింది... పి జీవన్‌ప్రసాద్‌, ఆర్టీసీ రీజినల్‌ మేనేజర్‌

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థపై ప్రయాణికులకు నమ్మకం పెరిగింది. బతుకమ్మ, దసరా పండుగలను పురస్కరించుకుని ఆయా రూట్లలో ప్రయాణీకుల రద్దీకి అనుగుణంగా బస్సులను నడిపించాం. కరోనా నేపథ్యంలో అంతంత మాత్రంగా ఉన్న ఆదాయం ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలోకి చేరుకుంది. ఆర్టీసీపై నమ్మకంతో ప్రయాణికులు ఆదరించడంతో సంస్థకు అధిక ఆదాయం సమకూరింది. 

Advertisement
Advertisement