నయా దాండియా

ABN , First Publish Date - 2020-10-25T22:06:38+05:30 IST

దసరా నవరాత్రులు.. అద్దాలు పొదిగిన లెహంగా చోలీల్లో అమ్మాయిలు యువ రాణుల్లా మెరిసిపోతుంటే, తెల్లటి కుర్తా పైజామాలో అబ్బాయిలు యువరాజుల్లా వెలిగిపోతున్నారు.. జూమ్‌కాల్‌ మొదలైంది....

నయా దాండియా

దసరా నవరాత్రులు.. అద్దాలు పొదిగిన లెహంగా చోలీల్లో అమ్మాయిలు యువ రాణుల్లా మెరిసిపోతుంటే, తెల్లటి కుర్తా పైజామాలో అబ్బాయిలు యువరాజుల్లా వెలిగిపోతున్నారు.. జూమ్‌కాల్‌ మొదలైంది.. ‘లెట్స్‌ స్టార్ట్‌.. వన్‌.. టూ.. త్రీ..’ స్ర్కీన్‌ మీద నెంబర్లు చకచకా కదిలిపోతున్నాయి.. దృశ్యం మారింది. దీపం వెలిగిస్తూ దీపికా పదుకొనె.. ‘నగడ సంగ్‌ డోల్‌ భాజే..’ పాట అందుకుంది.


అదొక రాజదర్బారు. రాజసం ఉట్టిపడే సంగీత ధ్వనులు.. జానపద సమ్మిళితమైన గార్బా నృత్యరీతులు.. పించం విప్పిన మయూరంలా హొయలు పోతున్న ఆమె దేహ సౌందర్యం.. కళ్లనే కాదు, మనసునూ కట్టిపడేసింది. గుండెల్లో డోలు మోగింది. దాండియా ప్రారంభమైంది. ఈసారి మైదానాల్లో కాదు.. ఇదిగో ఇలా ఇళ్లలో..! ప్రకృతి నుంచీ పుట్టిందే పండగ. అందుకే ప్రకృతి అంతటి శక్తిమంతమైనదీ వేడుక. కాబట్టే నవరాత్రుల సంబరాలను కరోనా ఆపలేకపోయింది. పెద్ద పెద్ద సమూహాలతో దాండియా ఆడకపోయినా.. ఆన్‌లైన్‌ పుణ్యమాని ఎవరిళ్లలో వాళ్లు ఆడుకునే అవకాశం దొరికింది. జూమ్‌ కాల్స్‌లో దాండియా బాలీవుడ్‌ గీతాలు.. మధ్య మధ్యలో లైవ్‌ యాంకరింగ్‌లతో అలరించాయి నిర్వహణ సంస్థలు. ఇళ్లలో టీవీలు, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు.. అపార్ట్‌మెంట్లలోని ఓపెన్‌ ఎయిర్‌ స్ర్కీన్‌లు చూస్తూ.. వర్చువల్‌ దాండియా ఆడుతున్న దృశ్యాలు.. ఇదివరకు ఎన్నడూ లేని కొత్త అనుభూతిని మిగిల్చాయి. 


ఎక్కడ చూసినా నవతరమే కనువిందు చేస్తోంది. దీనికి కారణం? వాళ్ల అభిరుచులకు తగ్గట్టు గార్బా- దాండియా సంగీత నృత్యాలు మారడం!. అవును.. ఇప్పుడు నడుస్తున్నది ‘నయా.. దాండియా’ అనే చెప్పొచ్చు. ఆ మ్యూజిక్‌ మానియా గుజరాతీ గ్రామాల్లోని జానపదాల నుంచీ ముంబయిలోని బాలీవుడ్‌ వరకు ఎంతో మారింది. రెండు దశాబ్దాల నుంచీ.. ఇండీపాప్‌, మెలోడి, జాజ్‌, బాలీవుడ్‌ సంగీత రీతులను కలుపుకుని.. ప్రతీ నవరాత్రులను కొత్త వెలుగులతో నింపేస్తోంది. సంజయ్‌ లీలా భన్సాలీ చిత్రం ‘గోలియొంకీ రస్‌లీల రామ్‌లీల’ (2013)లో దీపికా పదుకొనె, రణ్‌వీర్‌సింగ్‌లపై చిత్రీకరించిన గార్బా థీమ్‌తో వచ్చిన ఆ పాటే ‘నగడ సంగ్‌ డోల్‌ భాజే’. గత ఆరేడేళ్ల నుంచీ దాండియా వేడుకల్లో ఈ పాట మార్మోగుతోంది. యూట్యూబ్‌లో అయితే దీనికి పదకొండు కోట్ల వ్యూస్‌ రావడం ఒక సంచలనం.


ఇండీపాప్‌, జాజ్‌ బీట్స్‌..

దాండియా గుజరాతీ జానపద నృత్య సంప్రదాయం. గుజరాత్‌, రాజస్థాన్‌లో గార్బా, ఆంధ్రప్రదేశ్‌లో కోలాటం, తెలంగాణలో బతుకమ్మ, అసోంలో బిహు, పంజాబ్‌లో బాంగ్రా.. ఇలా దేశవ్యాప్తంగా అనేక సంప్రదాయ నృత్యరీతులు అనాదిగా మనతోనే వస్తున్నాయి. వీటికి ఏళ్ల చరిత్ర ఉంది. సంప్రదాయ మూలాలు, సాంస్కృతిక వైవిధ్యం.. భారతీయ అస్తిత్వం స్పష్టంగా కనిపిస్తుంది. ఉత్తరాదిలో దసరా నవరాత్రులు మొదలవ్వగానే ఉపవాసం పాటిస్తారు. భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తారు. ఇంటిల్లిపాదీ దాండియా, గార్బా ఆడుతూ దైవభక్తిని చాటుకుంటారు. దేశ విదేశాల్లో స్థిరపడిన గుజరాతీలు, రాజస్థానీలు సొంతూళ్లకు వచ్చేస్తారు. దక్షిణ భారత దేశంలో దాండియాకు అంత ప్రాముఖ్యం లేదు. అయితే ఇక్కడున్న నగరాల్లో స్థిరపడిన ఉత్తరభారతీయులు దాండియాతో సాంస్కృతిక వైవిధ్యాన్ని పరిపుష్టం చేస్తున్నారు. తెలుగు వాళ్లు కూడా వాళ్లతో కలిసి ఆడుతున్నారు. దాండియాకు మూలం గార్బా. కేవలం చేతులు ఆడిస్తూ.. డ్యాన్స్‌ చేయడం ఈ నృత్యరీతి. అదే రాను రాను రూపం మార్చుకుంది. కోలాట కర్రలతో లయబద్ధంగా కదులుతూ, చుట్టు తిరుగుతూ ఆడటం దాండియా లక్షణం. పూర్వం కొన్ని పాటలే ఉండేవి. కాలానుగుణంగా ఎన్నో పుట్టుకొచ్చాయి. 


సంగీతం మారింది. దాండియాను ప్రభావితం చేసిన మ్యూజిక్‌ ట్రెండ్స్‌లో ముఖ్యమైనవి - ఇండీపాప్‌, జాజ్‌. విరుపుల పదబంధాలు, భిన్నమైన స్వరాలతో.. భారతీయ సంగీత వాయిద్యాలైన వయొలిన్‌, సితార్‌, సరోద్‌, సారంగి, ఫ్లూట్‌, సంతూర్‌, హార్మోనియం, తబలా, మాండలిన్‌, వీణ, డోలు.. వంటివన్నీ ఇండీపాప్‌లో వాడతారు. ఇందులో పాప్‌థీమ్స్‌ ఉంటాయి. ఒక రకంగా మన దేశంలో ఇండీపాప్‌కు ఆద్యుడు పాకిస్తానీ అయిన నజియా హాసన్‌ అనే చెప్పాలి. ఇండియాలో పుట్టి ఇంగ్లండ్‌లో సింగర్‌గా రాణించిన బిడ్డూ అప్పయ్య ‘డిస్కో దివానే’ (నజియాతో కలిసి) ఆల్బమ్‌ను తీసుకొచ్చాడు. బిడ్డూ తన యాభై ఏళ్ల కెరీర్‌లో వేల సంఖ్యలో ఇండీపాప్‌, జాజ్‌ గీతాలకు ప్రాణం పోశాడు. ఇంగ్లండ్‌లో ఒకప్పుడు ఆయన పేరుమోసిన గాయకుడు, రచయిత, సంగీత దర్శకుడు కూడా. ఇండీపాప్‌ను రెమో ఫెర్నాండెజ్‌, జగ్‌జీత్‌సింగ్‌, బాబాసెహగల్‌, అలీషా చినాయ్‌, ఉషా ఉతప్‌.. ఇలా ఎందరో ముందుకు తీసుకెళ్లారు. 


ఇక జాజ్‌ను తీసుకుంటే - సాక్సాఫోన్‌, ట్రంపెట్‌, ట్రంబోన్‌, పియానో, బాస్‌, డ్రమ్స్‌, గిటార్‌... వీటితో అద్భుతమైన మెలోడీస్‌ను కంపోజ్‌ చేస్తారు. జాజ్‌లో అలా అద్భుతాలు చేసిన వాళ్లలో కొందరు సంగీత దర్శకులు - నౌషాద్‌, ఓపీ నయ్యర్‌, లక్ష్మీకాంత్‌ ప్యారేలాల్‌, ఆర్‌డీ బర్మన్‌, శంకర్‌-జైకిషన్‌ తదితరులు. హిందీలో మరపురాని మధుర గీతాలకు ప్రాణం పోశారు వీళ్లు.


హవా మొదలైంది..

మన దేశంలో 1990 నుంచీ ఇండీపాప్‌ బాలీవుడ్‌లో ఒక ప్రాధాన్య సంగీత ధోరణిగా వర్ధిల్లుతూ వచ్చింది. సంప్రదాయ సంగీతానికి ఇదొక ప్రత్యామ్నాయంగా ఎదిగింది. తొలినాళ్లలో సునీతారావు ‘పారీ హూ మై’ ఆల్బమ్‌ విడుదలైంది. మరో మూడేళ్లకు శ్వేతాశెట్టి ‘జానీ జోకర్‌’ వచ్చింది. ఆ సమయంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మరో ఇండీపాప్‌ ఆల్బమ్‌ ‘మేడ్‌ ఇన్‌ ఇండియా’. బేబీ కటింగ్‌తో బూర బుగ్గల చిన్నది అలీషా చినాయ్‌ పాడుతుంటే.. యువతరం కళ్లప్పగించి చూసింది. అంతకు ముందు ఇంగ్లీషులో అలాంటి ఆల్బమ్స్‌ ఉండేవి కానీ మన దగ్గర కనిపించేవి కావు. ఒక రకంగా అది ఇండీపాప్‌లో ఐకానిక్‌ వీడియో అనే చెప్పొచ్చు. 


అప్పుడప్పుడే ఆధునిక మహిళలు కట్టుబాట్లు, పురుషాధిక్య ముళ్ల కంచెలు తెంచుకుని బయటికి వస్తున్న తరుణం. తల ఎత్తకుండా పెద్దలు నిర్ణయించిన వాళ్లనే పెళ్లి చేసుకోమనే కాలం అది. అలాంటి ఆధిక్య సమయంలో - కలల రాకుమారుడిని వెదుక్కునే స్వేచ్ఛ మాకెందుకు లేదు? అంటూ వచ్చింది అలీషా చినాయ్‌ ఆల్బమ్‌. అందులో ఆమె రాణిలా ఆశీనులై పాడుతుంది. అందమైన వరుడి కోసం వెదికే పాట అది. ఏ దేశస్థుడూ నచ్చడు. కండలు తిరిగిన ఆరడుగుల భారతీయ అందగాడు మిలింద్‌ సోమన్‌ ప్రత్యక్షమవుతాడు, తెగ నచ్చేస్తాడు. ఆ ఆల్బమ్‌ ద్వారానే ఇండియన్‌ టెలివిజన్‌కు పరిచయం అయ్యాడు మిలింద్‌. అప్పట్లో యువతను ఉర్రూతలూగించిన ‘మేడ్‌ ఇన్‌ ఇండియా’ తరువాత ఇండీపాప్‌ ఆల్బమ్‌లు వరదలా ముంచెత్తాయి. 


ఆల్బమ్స్‌ అదరగొట్టాయి..

అప్పటి వరకు ఇండీపాప్‌లో పేరు తెచ్చుకున్న సునీతారావు, శ్వేతాశెట్టి, అలీషా చినాయ్‌లపై పాశ్చాత్య సంగీత ప్రభావం కొట్టొచ్చినట్లు కనిపించింది. ‘చుడి’ అనే ఆల్బమ్‌తో అందుకు భిన్నంగా దూసుకొచ్చిన మరో సింగర్‌.. ఫల్గుణి పాఠక్‌. పడమటి దేశాల ఫ్యాషన్లు ఏవీ లేకుండా.. అప్పుడే పల్లెటూరి నుంచీ నగరానికి వచ్చిన అమాయకమైన అమ్మాయిలా ఆకట్టుకుంది ఫల్గుణి. ఆమె ఇన్నోసెంట్‌ ఫేస్‌కు టీనేజ్‌ గర్ల్స్‌ అందరూ ఫిదా అయ్యారు. ఎరుపుగళ్లున్న స్కర్ట్‌, తెల్లచొక్కా వేసుకున్న హైస్కూలు అమ్మాయిల తొలివలపు గీతం ‘చుడి’. తొలిచూపుల్లోని భావోద్వేగాలు, ముసిముసి నవ్వులు, కొంటెచూపులు, కోణంగి వేషాలు, తెలిసీతెలియని ఊసులతో.. ఒక ప్రేమ కథ చెబుతున్నట్లు సాగుతుందా వీడియో ఆల్బమ్‌. అందులో ముదురు నీలం రంగు కోటు, ప్యాంటు వేసుకుని, అబ్బాయిల్లా క్రాఫ్‌ చేసుకుని ర్యాంప్‌పైన పాడుతుంది ఫల్గుణి. అలా ఆమె పాడిన ‘చుడి జో కన్‌కి హాతో మై’ అప్పట్లో పల్లెపడుచుల గుండెల్లో గుబులు రేపింది. 


ఆ రోజుల్లో టీనేజ్‌లో ఉన్నవాళ్లు మళ్లీ ఇప్పుడా పాట వింటే.. తొలిప్రేమ జ్ఞాపకాల్లోకి జారుకోవడం ఖాయం. అంత ప్రభావితం చేసింది ఫల్గుణి. ఆమె గురించి ఇక్కడ ఎందుకింత చెప్పుకోవాలంటే.. ఇండీపాప్‌తో సాధారణ ఆల్బమ్స్‌ వరకే తను పరిమితం కాలేదు. అదే మ్యూజిక్‌తో దాండియా గీతాలనూ కొత్తపుంతలు తొక్కించారు. అందుకే ఆమెను గుజరాతీలు, రాజస్థానీలు ప్రేమతో ‘దాండియా క్వీన్‌’ అని పిలుస్తారు. దాండియాకు ఇండిపాప్‌ అద్దడంతోపాటు.. నవరాత్రుల వేడుకల్లో షోలు చేయడం, ఆ సంగీతానికి ఒక సెలబ్రిటీ హోదా తీసుకురావడంలో ఫల్గుణి పాఠక్‌ ఎంతో కృషి చేశారు. ఆమె ప్రేరణతో పలువురు దాండియా గాయకులు, సంగీతకారులు దీన్నొక కెరీర్‌గా ఎంచుకున్నారు. దేశ, విదేశాల్లో దాండియా షోలకు హాజరై అత్యధిక పారితోషికం అందుకుంటున్నారు. ఆ ట్రెండ్‌ అంతటితో ఆగలేదు. బాలీవుడ్‌నూ షేక్‌ చేసింది. 





బాలీవుడ్‌లో ..

షారుక్‌, సల్మాన్‌, హృతిక్‌రోషన్‌, ఐశ్వర్య, దీపికా, ప్రియాంక, తాప్సీ.. దాండియా ఆడితే తారలు దిగివచ్చినట్లు ఉండదూ!. బాలీవుడ్‌ చిత్రాల్లో వీరి పాటల్ని చూసినప్పుడల్లా దసరా నవరాత్రులే గుర్తుకొస్తాయి. గార్బా- దాండియా థీమ్‌లతో వచ్చిన పాటలన్నీ దాదాపు హిట్లే!. ఎందుకంటే చిన్నప్పటి నుంచీ ప్రతి ఒక్కరికీ దాండియాతో అనుబంధం ఉంటుంది కాబట్టి త్వరగా కనెక్ట్‌ అవుతారు.బాలీవుడ్‌లో ఈ తరహా గీతాల హవా ఎలా మొదలైందంటే.. మెలోడీ సంగీతంలో బప్పీలహరి చేయని ప్రయోగం లేదు. దాండియా గీతాలకు డిస్కోను కలిపి.. వినసొంపుగా కంపోజ్‌ చేసి.. కనువిందు చేశాడాయన. సంజయ్‌లీలా భన్సాలీ ‘హమ్‌ దిల్‌ దే చుకే సనమ్‌’ (1999)లో సల్మాన్‌ఖాన్‌, ఐశ్వర్యారాయ్‌ జంటగా తీసిన ‘దోలి తారొ ఢోల్‌ భాజే’ పాట పెద్ద హిట్‌ అయ్యింది. గార్బా థీమ్‌తోనే ఈ పాటను తీశారు. దసరా నవరాత్రులలోనే కాదు, యూట్యూబ్‌లోనూ 4.9 కోట్ల వ్యూస్‌తో ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచిందీ పాట. 2013లో వచ్చిన ‘కాయ్‌ పోచే’లోని ‘శుభారంబ్‌..’ కూడా అలాంటిదే!. హిందీ చిత్రాలకు గ్రాండ్‌ లుక్‌ రావాలంటే దాండియా, గార్బాలు పెట్టే పరిస్థితి వచ్చింది. అనుబంధాలు, ప్రేమాయణం, ఆధ్యాత్మికత, వేడుకల వాతావరణాన్ని ప్రతిబింబింపజేస్తాయివి. 

కృష్ణుడి రాసలీలల్లా.. ఇద్దరు ప్రేమికుల రొమాన్స్‌కు దాండియా కంటే అద్భుతమైన వేదిక మరెక్కడ దొరుకుతుంది? 1990లో ప్రేక్షకులకు గుర్తుండిపోయిన రొమాంటిక్‌ జంట అనిల్‌కపూర్‌, మాఽఽధురీదీక్షిత్‌. ఆ మరుసటి ఏడాదిలో వచ్చిన ‘ప్రతీకార్‌’లోని ‘చిట్టీ ముఝే లిక్‌ నా’ ఒక అద్భుతమైన మెలోడి. ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం సమకూర్చిన మరో చిత్రం ‘దిల్‌ హై దిల్‌ మే’. అందులో మెహబూబ్‌ రాసిన ‘చాంద్‌ ఆయా హై’ పాటకు మైమరచిపోవాల్సిందే. 2002లో వచ్చిన ‘అప్‌ ముజే అచ్చీ లగ్నే లగే’ లోని ‘ఓ రె గోరి’ కూడా పాపులర్‌ అయ్యింది. 


ఇంకా వెనక్కి వెళితే (1979) ‘సుహాగ్‌’లోని ‘సబ్‌సే బడా తేరేనామ్‌’ను ఎప్పటికీ మరిచిపోలేని పాట. ఆనంద్‌-మిలింద్‌ సంగీత దర్శకత్వంలో వచ్చిన ‘తాఖత్‌’లోనూ ‘దాండియె కి బహానె ఆజానా’ కూడా నవరాత్రుల్లో అలరించే గీతం. షారూఖ్‌ నటించిన ‘రయిస్‌’లో ‘ఉడి ఉడి జాయె’ పాట ఇద్దరు ప్రేమికుల మధ్య సాగుతుంది. ‘లగాన్‌’లోని ‘రాధ కై ౅సే నజలే’కూడా దాండియాను గుర్తుకు తెస్తుంది. ఇక తెలుగులో వచ్చిన ‘ప్రేమికుల రోజు’లో కునాల్‌, సోనాలీబింద్రే ఆడిపాడిన.. ‘దాండియా ఆటలు ఆడ.. గుజరాత్‌ పడచులు చూడ..’ ప్రేమికుల్ని భలే ఆకట్టుకుంది.




ప్రత్యేక సింగర్స్‌..

గార్బా, దాండియా పాటల్ని మాత్రమే పాడే ప్రత్యేక సింగర్స్‌ సైతం పుట్టుకొచ్చారు. అప్పటి వరకు భజనగీతాలు, జానపదాలు, టీవీ షోలలో పాడే గాయకులు దాండియాను వేదికలపై పాడటం ప్రారంభించారు. బయట పాపులర్‌ అయిన వాళ్లు సినిమాల్లో, ఇక్కడ పేరుతెచ్చుకున్న వాళ్లు వేదికలపైన పాడుతూ వచ్చారు. ఇలా వచ్చిన కొత్త సింగర్స్‌ వేదికలపై కేవలం పాటలు మాత్రమే పాడకుండా.. అందమైన స్టెప్పులు వేస్తూ.. మధ్య మధ్యలో సరదా మాటలతో సంగీతాభిమానులను ఉత్సాహ పరుస్తున్నారు. అందుకే ఎంతసేపు దాండియా చేసినా అలుపు రాదు. 

పాతతరం దాండియా గాయకుల్లో ఫల్గుణి పాఠక్‌ ఎలా పేరుతెచ్చుకుందో.. అలా పాపులర్‌ అవుతున్న వాళ్లు చాలామందే ఉన్నారు. అందులో ఒకరు భూమి త్రివేది.


ఆమె పలు బాలీవుడ్‌ గీతాలు పాడింది. గుజరాత్‌లోని వడోదరకు చెందిన ముప్పయి ఏడేళ్ల భూమి సినీగాయని, పాప్‌, రాక్‌, జానపద, గార్బా, దాండియా పాటలు పాడటంలో ఆమెకు ఎక్కడలేని పేరుంది. అప్పట్లో ఇండియన్‌ ఐడల్‌ గెల్చుకున్న ఆమె బాలీవుడ్‌ గీతాలతో పాటు అనేక ఆల్బమ్స్‌ చేసింది. అహ్మదాబాద్‌కు చెందిన ఇరవై ఏడేళ్ల ఐశ్వర్యా మజుందార్‌ కూడా ఇలాంటి సింగరే. ఆమె చిన్నప్పుడే టీవీషోల ద్వారా పరిచయం అయ్యింది. వీడియోగ్రఫీ, ఆల్బమ్స్‌తో పాటు బాలీవుడ్‌ గీతాలు పాడింది. గత రెండు మూడేళ్ల నుంచీ నవరాత్రుల వేడుకల్లో స్టార్‌ సెలబ్రిటీగా మారింది. అహ్మదాబాద్‌తోపాటు సిడ్నీ, మెల్‌బోర్న్‌, డిస్నీలాండ్‌, పెర్త్‌.. ఇలా అనేక నగరాల్లో దాండియా వేడుకల్లో పాడింది ఐశ్వర్య. వీళ్లే కాదు.. కీర్తిదాన్‌ గాద్వి, కింజాల్‌ దేవ్‌, ప్రీతి-పింకీ, ఇస్మాయిల్‌ దర్బార్‌, పృథ్వి గోమిల్‌-లాలిత్య మున్నా, దేవాంగ్‌ పటేల్‌, సోలి కపాడియా, నేహా కక్కడ్‌, .. ఇలా ఎంతోమంది సింగర్స్‌ పాడుతున్నారు. 





దాండియా.. డైటింగ్‌... ఫిట్‌నెస్‌

ఒకప్పుడు ఇళ్ల ముంగిట విశాలమైన లోగిళ్లలో దాండియా ఆడేవాళ్లం. ఇప్పుడన్నీ నగరాల్లో ఇరుకిరుకు ఇళ్లే కదా. ఆడటం కష్టం. అందుకే వేదికలు పుట్టుకొచ్చాయి. కొత్త కొత్త సింగర్స్‌ వచ్చారు. ఇదొక ఆర్గనైజింగ్‌ సెక్టర్‌గా తయారైంది.  దాండియాకు ఎప్పుడైతే డ్రమ్స్‌, డీజే, ఇన్‌స్ట్రుమెంటల్‌ మ్యూజిక్‌ వంటివి తోడయ్యాయో అప్పుడు దాని కథే మారిపోయింది. ఇలా మారింది కాబట్టే పాతతరానికే పరిమితం కాలేదు దాండియా. నేటి పిల్లల్ని ఆకట్టుకోవడానికి.. దీనికి మరో ప్రత్యేకత ఉంది. ఇప్పుడంతా డైటింగ్‌, ఫిట్‌నెస్‌, గ్లామర్‌ అంటున్నారు కదా.. అవన్నీ దాండియాలో ఇమిడి ఉన్నాయి. అది కూడా ఒక కారణమే! మన పెద్దలకు ముందు చూపు ఎక్కువ. మారుతున్న రుతువులను బట్టి.. పండగలను డిజైన్‌ చేశారు. దానికొక ఆధ్యాత్మిక పునాది వేశారు. ఉత్తరాది నవరాత్రుల్లో ఉపవాసాలు ఉంటారు. అది శరీరంలోని మలినాలను తొలగించే డైటింగ్‌లాంటిదే. దాండియా నవరాత్రులలో తొమ్మిది రోజులు డ్యాన్స్‌లు చేస్తారు. తొలి రోజు అమ్మాయిలు అందరూ కష్టపడి మేకప్‌ వేసుకొస్తారు.  మూడో రోజు అయ్యే సరికి మేకప్‌ వేయరు. ఎందుకంటే అప్పటికే వాళ్ల ముఖాలు వెలిగిపోతుంటాయి. సాముహిక సంతోషం మనిషిలో ఆనంద హార్మోన్లను విడుదల చేస్తుంది. నవరాత్రులు పూర్తయ్యే లోపు అమ్మాయిలు, అబ్బాయిల ముఖాల్లో కొట్టిచ్చినట్లు అందం కనిపిస్తుంది. ఉపవాసంతో పరిమితమైన తిండి తింటారు కాబట్టి.. శరీరం తేలిగ్గా, మనసు ఉల్లాసభరితంగా మారుతుంది. అందుకే నవరాత్రులను మించిన డైటింగ్‌, దాండియా కంటే గొప్ప ఫిట్‌నెస్‌ టెక్నిక్‌లు ఇంకేమీ లేవు.

- సుధా జైన్‌, దాండియా సెలబ్రిటీ





పాపులర్‌ పాటలతో ఉత్సాహం

ఇతర సంగీత ధోరణులతో మిళితం చేసి, ఫ్యూజన్‌తో వస్తున్న దాండియా మ్యూజిక్‌ నేటి తరాన్ని బాగా ఆకట్టుకుంటోంది. ఇప్పుడిదే లేటెస్ట్‌ ట్రెండ్‌. ఫ్యూజన్‌ దాండియా-గార్బాలతో కూడిన ఆల్బమ్స్‌, యూట్యూబ్‌ వీడియోలు చాలానే వచ్చాయి. ఇంగ్లిష్‌ మ్యూజిక్‌ను, ట్రెడిషినల్‌ మ్యూజిక్‌ను కలిపి రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. నగరాల్లోని యువతకు బాలీవుడ్‌ దాండియా గీతాలంటే చాలా ఇష్టం. అందులో అభిమాన తారల జ్ఞాపకాలు ఉంటాయి..  హై బీట్‌ మ్యూజిక్‌ ఉంటుంది. దాంతో ఆ పాటలు వినగానే ఆడేద్దామన్న ఉత్సాహం కలుగుతుంది. ఇలా సినిమాలే కాదు, దాండియా ఆల్బమ్స్‌, వీడియోగ్రఫీలలో పాపులర్‌ అయిన పాటలు ప్రతి వేదికపైనా కనిపిస్తున్నాయిప్పుడు. 

- కవితా జైన్‌, హైదరాబాద్‌





దాండియా క్వీన్‌..

మన ఊరి గుడిలో భజన పాటలు  విన్నప్పుడో, లేదంటే వరి నాట్లు వేస్తున్నప్పుడు పాడే  పాటల్ని వింటేనో.. ఎంత హాయిగా ఉంటుంది. ఆ పాటల్లోని సహజ మాధుర్యం మనసును తాకుతుంది. అదే జానపదాల్లోని మహత్యం. ఫల్గుణి పాఠక్‌ ముఖంలోనూ, స్వరంలోనూ ఆ సహజత్వమే ఉట్టిపడుతుంది. తొంభయ్యవ దశకంలో దాండియా ఆడినవాళ్లకు ఆమె పేరు సుపరిచితం. సంగీత ప్రపంచంలో సంచలనాలు సృష్టించిందామె. గార్బా, దాండియా పాటల్లో తిరుగులేని ఇండీపాప్‌ సింగర్‌. దశాబ్దాలు  దాటినా ఆమె ప్రాధాన్యం తగ్గలేదు. గుజరాత్‌లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఆమెకు సంగీత అభిమానులు ఉన్నారు. కేవలం దసరా నవరాత్రుల వేడుకల్లో దాండియా పాటలు పాడినందుకే.. ఆమెకు లక్షల రూపాయల రెమ్యునరేషన్‌ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఒక దశలో ఫల్గుణి రోజుకు రూ.22 లక్షలు  తీసుకునేది. ఒక ఏడాదిలో ఆమె సంపాదించిన మొత్తం రెండు కోట్ల రూపాయలు. ‘అసలు నాకు సంగీతమంటే తెలీదు. అనుకోకుండా సింగర్‌ అయ్యాను. ఒకప్పుడు దాండియా గీతాలను ఒక్కసారి వింటే.. జీవితాంతం గుర్తుండిపోయేవి. సంగీతం సాంకేతిక పరికరాల చేతుల్లోకి వెళ్లిపోయాక.. పాటల జీవిత కాలం బాగా తగ్గిపోయింది. ఈ రోజుల్లో హైబీట్‌ ఉన్న పాటలు వినిపించిన వెంటనే డ్యాన్సులు బాగా వేస్తున్నారు కానీ.. ఆ పాటలు మనసుల్లోకి వెళ్లి.. మధుర జ్ఞాపకాలుగా మిగలడం లేదు. పాతతరంలో ఉన్నన్ని సంగీత అనుభూతులు, జ్ఞాపకాలు ఇప్పటి వాళ్లకు లేవనే చెప్పాలి...’ అంటారు ఫల్గుణి.



- మల్లెంపూటి ఆదినారాయణ

Updated Date - 2020-10-25T22:06:38+05:30 IST