భారత క్రికెటర్ సంచలనం.. టీ20లో డబుల్ హ్యాట్రిక్

ABN , First Publish Date - 2021-11-20T23:44:08+05:30 IST

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా ఈ రోజు (శనివారం) కర్ణాటకతో జరిగిన రెండో సెమీఫైనల్‌లో

భారత క్రికెటర్ సంచలనం.. టీ20లో డబుల్ హ్యాట్రిక్

న్యూఢిల్లీ: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా ఈ రోజు (శనివారం) కర్ణాటకతో జరిగిన రెండో సెమీఫైనల్‌లో విదర్భ పేసర్ దర్శన్ నలకండే సంచలనం సృష్టించాడు. టీ20 క్రికెట్‌లో డబుల్ హ్యాట్రిక్ సాధించి ఎలైట్ లిస్ట్‌లో చేరాడు.


చివరి ఓవర్ వేసేందుకు బంతి అందుకున్న దర్శన్.. రెండో బంతికి అనిరుద్ధ జోషి (1)ని అవుట్ చేశాడు. మూడో బంతికి శరత్ బీఆర్‌ను గోల్డెన్ డక్‌గా వెనక్కి పంపాడు. నాలుగు బంతికి జె.సుచిత్‌ వికెట్‌ను నేలకూల్చి హ్యాట్రిక్ సాధించాడు. ఐదో డెలివరీకి క్రీజులో కుదురుకున్న అభినవ్ మనోహర్ (27)ను ఔట్ చేసి డబుల్ హ్యాట్రిక్ సాధించిన రెండో భారత బౌలర్‌గా రికార్డులకెక్కాడు. 


అంతకుముందు టీమిండియా మాజీ పేసర్ అభిమన్యు మిథున్ తొలిసారి ఈ ఘనత సాధించాడు. కర్ణాటకకు ప్రాతినిధ్యం వహించిన అభిమన్యు 2019లో హర్యానాతో జరిగిన మ్యాచ్‌లో వరుస బంతుల్లో ఐదు వికెట్లు పడగొట్టి సంచలనం సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో లసిత్ మలింగ్ పేరుపై ఈ రికార్డు ఉంది. 2019లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మలింగ డబుల్ హ్యాట్రిక్ సాధించాడు. 

  

ఈ మ్యాచ్‌లో కర్ణాటక జట్టు నాలుగు వికెట్ల తేడాతో విదర్భపై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక కెప్టెన్ మనీష్ పాండే (54) సూపర్ ఇన్నింగ్స్‌తో నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది.


అనంతరం 177 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన విదర్భ విజయం ముంగిట బోల్తా పడింది. 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 172 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది.





Updated Date - 2021-11-20T23:44:08+05:30 IST