న్యాయానికి ఊపిరి పోసింది!

ABN , First Publish Date - 2020-06-17T05:30:00+05:30 IST

‘‘ఊపిరాడడం లేదు’’ అని ప్రాథేయపడుతున్నా వినకుండా ఆమెరికాలో జార్జి ఫ్లాయిడ్‌ అనే నల్లజాతీయుడి ఉసురుతీసిన పోలీసు నిర్వాకంపై ప్రపంచం ఇంకా అట్టుడుకుతోంది. ఈ ఘటనకు తిరుగులేని ఆధారం ఫ్లాయిడ్‌ను అమెరికన్‌ పోలీసులు క్రూరంగా హింసించిన దృశ్యాలు...

న్యాయానికి ఊపిరి పోసింది!

‘‘ఊపిరాడడం లేదు’’ అని ప్రాథేయపడుతున్నా వినకుండా ఆమెరికాలో జార్జి ఫ్లాయిడ్‌ అనే నల్లజాతీయుడి ఉసురుతీసిన పోలీసు నిర్వాకంపై ప్రపంచం ఇంకా అట్టుడుకుతోంది. ఈ ఘటనకు తిరుగులేని ఆధారం ఫ్లాయిడ్‌ను అమెరికన్‌ పోలీసులు క్రూరంగా హింసించిన దృశ్యాలు. వాటిని ఫోన్‌ కెమేరాలో బంధించి, ప్రపంచం ముందుకు తెచ్చింది పదిహేడేళ్ళ యువతి డార్నెల్లా ఫ్రేజియర్‌.


‘‘ఏదైతే నేను చూశానో, దాన్ని ప్రపంచమంతా చూడాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సంఘటనలు చాలాసార్లు నిశ్శబ్దంలోనే జరిగిపోతూ ఉంటాయి’’ అంటోంది 17 ఏళ్ళ యువతి డార్నెల్లా ఫ్రేజియర్‌. ఈ హైస్కూల్‌ విద్యార్థిని తన కుటుంబంతో పాటు అమెరికాలోని మినెసోటా రాష్ట్రంలోని మినియాపొలిస్‌ నగరంలో ఉంటోంది.


ఈ ఏడాది మే నెల 25వ తేదీ రాత్రి డార్నెల్లా తన తొమ్మిదేళ్ళ కజిన్‌తో కలిసి వాళ్ళ అపార్ట్‌మెంట్‌కు దగ్గర్లో ఉన్న ‘కప్‌ ఫుడ్స్‌’ స్టోర్స్‌కు వెళ్ళింది.. అక్కడ జార్జి ఫ్లాయిడ్‌ సిగరెట్లు కొని, ఇరవై డాలర్ల నకిలీ నోటు ఇచ్చాడనేది ఆరోపణ. డార్నెల్లా ఆ దుకాణం దగ్గర్లోకి రాగానే, నలుగురు పోలీస్‌ అధికారులు ఒక నల్లజాతీయుణ్ణి అతని మోటార్‌ సైకిల్‌ మీద నుంచి కిందకు లాగడం కనిపించింది. ఆ ప్రాంతంలో పోలీసులు విచక్షణరహితంగా ప్రవర్తించడం చాలా సాధారణంగా జరిగేదే. కానీ అలా ప్రవర్తించినందుకు ఫలితాలను పోలీసులు అనుభవించడం చాలా అరుదు. ఆ దృశ్యాన్ని చూడగానే తన ఐఫోన్‌ను ఆమె బయటకు తీసి, రికార్డ్‌ చెయ్యడం ప్రారంభించింది. జార్జి ఫ్లాయిడ్‌ మెడ మీద పోలీస్‌ అధికారి డెరెక్‌ చౌవిన్‌ మోకాలితో తొక్కాడు. అతనికి మరో ముగ్గురు పోలీసులు సహకరించారు. పది నిమిషాలకు పైగా సాగిన ఈ తతంగాన్ని చిత్రీకరించి, దాన్ని అదే రోజు రాత్రి ఫేస్‌బుక్‌లో  పోస్ట్‌ చేసింది. ఆ వీడియో ఆధారంగానే సదరు పోలీసు అధికారిపై హత్య కేసు నమోదైంది. అతనితోపాటు మిగిలిన ముగ్గురినీ విధుల్లోంచి తొలగించి, హత్యకు సహకరించినందుకు కేసులు పెట్టారు. 


హీరో కావాలనుకోవడం లేదు!

డార్నెల్లా ఒక సాధారణమైన అమ్మాయి. ఆమె ఒక మాల్‌లో పని చేస్తోంది. బాయ్‌ఫ్రెండ్‌ ఉన్నాడు. అమెరికా చరిత్రలో ఎంతో ముఖ్యమైన, హైప్రొఫైల్‌ పోలీసు హత్యల్లో ఒకటైన ఘటనకు తను సాక్షిననీ, దాన్ని నమోదు చేస్తున్నాననీ ఆ క్షణంలో ఆమెకు తెలీదు. జాత్యహంకారానికీ, పోలీసుల క్రూరత్వానికీ వ్యతిరేకంగా సర్వత్రా ఇప్పుడు అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. కానీ దీని ద్వారా ఒక హీరో అయిపోవాలని అనుకోలేదనీ,  ఇప్పడూ అనుకోవడం లేదనీ ఆమె చెబుతోంది. ఆమె ధైర్యంగా ఫేస్‌బుక్‌లో ఆ వీడియోను పెట్టకపోతే, తన బాధను లోకంతో పంచుకోవాలని అనుకోకపోతే, ఆ నలుగురు పోలీసు అధికారులూ ఇప్పటికీ వీధుల్లో తిరుగుతూ ఉండేవారు. సమాజంలోని ప్రజలను బహుశా ఇంకా భయభ్రాంతుల్ని చేస్తూ ఉండేవారు. 




అతను వేడుకుంటున్నా పోలీసులు వినలేదు!

ఈ సంఘటన జరిగిన చోటుకు మర్నాడు వచ్చిన డార్నెల్లా కన్నీటిపర్యంతమైపోయింది. ‘‘ఇక్కడే... ఇక్కడే వాళ్ళు ఆ మనిషిని చంపేశారు. నేను సరిగ్గా అయిదడుగుల దూరంలో ఉన్నాను. ఆ వీడియోను ఫేస్‌బుక్‌లో నిన్న రాత్రే పెట్టాను. కానీ ఈ ఘటన మీద ఈ స్థాయిలో నిరసనలూ, ఆందోళనలూ జరుగుతాయని నేను ఊహించలేదు. అతను మరణించడం నేను చూశాను. ‘నువ్వెలా ఫీలవుతున్నావు’అని చాలామంది నన్ను అడుగుతున్నారు. కానీ ఎలా ఫీలవాలో నాకు తెలియడం లేదు. ఎందుకంటే ఇది గొప్ప విషాదం. నిన్న రాత్రి ఎనిమిది గంటలకు ఆ మనిషి సరిగ్గా ఇక్కడ, సజీవంగానే ఉన్నాడు. ఇదో భయానకమైన అనుభవం. ‘‘ప్లీజ్‌! నాకు ఊపిరాడడం లేదు. నాకు ఊపిరి ఆడడం లేదు’’ అని అతను వేడుకున్నాడు. కానీ పోలీసులు అతని మాటలు పట్టించుకోలేదు. అతన్ని వాళ్ళు చంపేశారు’’ అని ఆమె ఆ భయానక దృశ్యాన్ని గుర్తుచేసుకుంది.  




తిరుగులేని రుజువిది!

ఇప్పుడు ‘కప్‌ ఫుడ్స్‌’ స్టోర్స్‌ బయట వీధంతా ‘జార్జి ఫ్లాయిడ్‌ స్మారక ప్రాంతం’గా మారిపోయింది. పోలీసులు కూడా వీడియో తీసిన యువతి డార్నెల్లాను అభినందిస్తున్నారు. ‘‘పోలీసుల్ని బాధ్యుల్ని చేసే సాక్ష్యాలున్న వీడియో మీద మేము ఇంతకు ముందెప్పుడూ ఇంతలా ఆధారపడలేదు. ఫ్లాయిడ్‌ కేసులో దాన్ని చిత్రీకరించిన పద్ధతి తిరుగులేని రుజువులు అందించింది. ఇలాంటి సంఘటనలను పౌరులెవరైనా చూస్తే, రికార్డు చెయ్యండి. రికార్డు చేసి, పోలీస్‌ హెల్ప్‌ లైన్‌కు సమాచారం ఇవ్వండి. సంఘటన స్థలంలో మాకొక పరిశీలకుడు ఉండాలి కదా! ఏం జరుగుతోందో మాకు తెలియాలి. కాబట్టి సమాజం కీలకమైన పాత్ర పోషించాలి’’ అని పిలుపునిచ్చారు మినియాపొలిస్‌ ప్రాంత పోలీసు ఉన్నతాధికారులు. 


నా స్థానంలో ఉంటే తెలుస్తుంది...

డార్నెల్లా చేసిన పనిని దాదాపు అందరూ ప్రశంసిస్తున్నారు. కానీ కొందరు వ్యక్తులు మాత్రం సోషల్‌ మీడియాలో ఆమెపై విమర్శలకు దిగారు. అది తనను ఎంతో బాధపెడుతోందంటోంది ఆ అమ్మాయి. ‘‘నేను దీన్ని పేరు ప్రతిష్ఠల కోసం చేశానా? అందరి దృష్టీ నా మీద పడాలని చేశానా? డబ్బు సంపాదించడానికి చేశానా? ఆ సమయంలో నాకు ఎలా అనిపించిందో, ఇదంతా ఎందుకు చేశానో నా స్థానంలో ఉంటే తెలుస్తుంది’’ అని ఫేస్‌బుక్‌లో తన ఆవేదనను పోస్ట్‌ చేసింది. ఆ తరువాత ఆమె బహిరంగంగా మాట్లాడడానికి ఇష్టపడడం లేదు.

‘‘మా అమ్మాయి ఇప్పుడు సోషల్‌ యాంగ్జైటీతో సతమతం అవుతోంది. ఆ సంఘటన ఆమెను ఎంత కుదిపేసిందో దీన్ని బట్టి తెలుస్తోంది. నా వరకూ సరైన సమయంలో సరైన చోట మా అమ్మాయి ఉంది. ఒక మనిషిగా ఏం చెయ్యాలో అది చేసింది’’ అని ఆమె తల్లి చెబుతున్నారు. ‘‘డార్నెల్లా సానుకూలంగా ఉండాలనుకుంటోంది. సోషల్‌ మీడియా వలలో పడాలనుకోవడం లేదు. ఒక ఘోరం జరుగుతున్న చోట నిలబడి, అలాంటి భయానకమైన విషాదానికి సాక్షిగా ఉండడానికి చాలా ధైర్యం కావాలి. ఈ తరానికి ఆమె ఆమెరికా తొలి పౌరహక్కుల ఉద్యమకారిణి రోజా పార్క్స్‌ లాంటిది. ఆమె ఒక థెరపి్‌స్టను సలహా కోసం కలుసుకుంది. ఇప్పుడు తను మామూలుగానే ఉంది’’ అని చెప్పారు ఆమె తరఫు న్యాయవాది. జార్జి ఫ్లాయిడ్‌పై జరిగిన దౌర్జన్యం లాంటి సంఘటనలు ప్రపంచవ్యాప్తంగా దాదాపు ప్రతి రోజూ చోటు చేసుకుంటున్న సందర్భంలో, నిజాన్ని నిర్భయంగా లోకానికి చాటిన డార్నెల్లా ఎంతోమందికి స్ఫూర్తి అవుతుందనడంలో సందేహం లేదు.


మీ సన్నిహితులకే ఇలా జరిగితే...

‘‘నేనో మైనర్‌ని. పోలీసులతో నేను పోరాడలేను. నాకూ పోలీసులంటే భయమే! కానీ నేను ఆ పని చెయ్యకపోతే, ఆ పోలీసులు ఇంకా ఉద్యోగాల్లో ఉండేవాళ్ళు. మరికొందరికి సమస్యగా తయారయ్యేవాళ్ళు. అందుకే... నన్ను విమర్శించడానికి బదులు ధన్యవాదాలు చెప్పండి. జార్జి ఫ్లాయిడ్‌కు జరిగిన దారుణం రేపు ఎప్పుడో మీరు ఇష్టపడేవాళ్ళకు జరగొచ్చు. దాని వెనుక నిజం ఏమిటో తెలుసుకోవాలని మీకు అప్పుడు అనిపిస్తుంది కదా! ఎవరికీ ఇలాంటిది జరగాలని నేను కోరుకోవడం లేదు. నా మాటలూ, చేతలూ ఎవరికైనా నచ్చకపోతే దయచేసి మీ సోషల్‌ మీడియా ఖాతాల్లో నన్ను బ్లాక్‌ చెయ్యండి. నా పోస్ట్‌లు చూడాలని ఎవరినీ నేను బలవంతం చెయ్యడం లేదు.’’                                - డార్నెల్లా  ఫ్రేజియర్‌ 


Updated Date - 2020-06-17T05:30:00+05:30 IST