వెలుగులు నింపాల్సిన చోట చీకట్లు..!

ABN , First Publish Date - 2022-01-29T05:39:19+05:30 IST

జిల్లాలోని పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి, అందరి జీవితాల్లో వెలుగులు నింపాల్సిన డీఈఓ కార్యాలయంలోనే చీకట్లు అలుముకున్నాయి.

వెలుగులు నింపాల్సిన చోట చీకట్లు..!
చీకట్లో ఎండీఎం విభాగాధికారులు

అనంతపురం విద్య, జనవరి 28: జిల్లాలోని పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి, అందరి జీవితాల్లో వెలుగులు నింపాల్సిన డీఈఓ కార్యాలయంలోనే చీకట్లు అలుముకున్నాయి. డీఈఓ కార్యాలయం 48 గంటలుగా చీకట్లో మగ్గుతోంది. విద్యుత్‌బకాయిలు చెల్లించకపోవడంతో విద్యుత్‌శాఖ అధికారులు.. డీఈఓ కార్యాలయానికి విద్యుత సరఫరా నిలిపివేశారు. దీంతో రెండు రోజులుగా విద్యాశాఖ అధికారులు చీకట్లోనే మగ్గుతున్నారు. శుక్రవారం సైతం కరెంట్‌ లేక ఉద్యోగులు విలవిల్లాడారు. కమలానగర్‌లోని పాత డీఈఓ కార్యాలయానికి 7112201000725, 7112201286560  సర్వీసు నెంబర్ల ద్వారా విద్యుత సరఫరా చేస్తున్నారు. సర్వీసు నెంబర్లు కొంతకాలంలో బిల్లులు పెండింగ్‌ ఉండడంతో గురువారం మధ్యాహ్నం విద్యుత్‌అధికారులు డీఈఓ  ఆఫీ్‌సకు వచ్చి వైర్లు కట్‌ చేశారు. దీంతో అప్పటినుంచి ఉద్యోగులు చీకట్లోనే మగ్గుతున్నారు. కార్యాలయంలో ఆదర్శ పాఠశాల విభాగం, ఏడీ చాంబర్‌, మధ్యాహ్న భోజన విభాగం, ఓపెన్‌ స్కూల్స్‌ డీసీ విభాగం, ప్రభుత్వ పరీక్షల విభాగం, అనంతపురం డిప్యూటీ డీఈఓ ఆఫీస్‌ విభాగాలున్నాయి. వీటి పరిధిలో పని చేసే అధికారులు 48 గంటలుగా చీకట్లోనే ఉంటున్నారు. అసలే గుహలా ఉండే డీఈఓ కార్యాలయానికి కరెంట్‌ కూడా కట్‌చేయడంతో లోపల చీకట్లు అలముకున్నాయి. ఉద్యోగులు సైతం రెండు రోజులుగా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. విద్యుత్‌బకాయిలు రూ.1.30 లక్షలున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. గతనెల 29న కూడా విద్యుత సరఫరా నిలిపేశారు. డబ్బు రాగానే చెల్లిస్తామని విద్యాశాఖాధికారులు చెప్పడంలో అప్పట్లో విద్యుత్‌సరఫరా పునరుద్ధరించారు. తాజాగా రెండో సారి సైతం కరెంట్‌ కట్‌ చేశారు. పెండింగ్‌ బకాయిలు చెల్లిస్తే కానీ విద్యుత సరఫరా చేసేలాలేరు. దీంతో బకాయిల చెల్లింపునకు డీఈఓ కార్యాలయ అధికారులు ఆగమేఘాల మీద ఫైల్‌ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.


 

Updated Date - 2022-01-29T05:39:19+05:30 IST