వెలుగు సిబ్బంది జీవితాల్లో చీకట్లు

ABN , First Publish Date - 2021-07-29T07:12:36+05:30 IST

నూతన నిబంధనతో యానిమేటర్ల సంఖ్య తగ్గే అవకాశాలు ఉండటంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వెలుగు సిబ్బంది జీవితాల్లో చీకట్లు

30 డ్వాక్రా సంఘాలుంటేనే జీతమంటూ నిబంధన 

ఆందోళనలో యానిమేటర్లు


చిత్తూరు, జూలై 28 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ జారీ చేసిన నూతన ఉత్తర్వుల ప్రకారం గ్రామ సంఘం (వీవో)లో కనీసం 30 స్వయం సహాయక సంఘాలుండాలి. ఇప్పటి వరకు ఆయా గ్రామాల్లో 10 డ్వాక్రా సహాయక సంఘాలున్నా.. ఒక గ్రామ సంఘాన్ని ఏర్పాటు చేశారు. తాజా మార్గదర్శకాలతో కనీసం 30 సంఘాలను వీవో పరిధిలోకి తీసుకురావాలి. దీంతో గ్రామ సంఘాల సంఖ్య దాదాపుగా 429 వరకు తగ్గుతుంది. ఎందుకంటే ఇప్పటివరకు 15 స్వయం సహాయక సంఘాలకు ఒక గ్రామ సంఘం ఉంది. కొన్నిచోట్ల 15 కంటే తక్కువ ఉండగా.. మరికొన్నిచోట్ల 20 నుంచి 25 స్వయం సహాయక సంఘాలున్నాయి. ప్రతి గ్రామ సంఘానికీ ఒక యానిమేటర్‌ ఉంటారు. ఇలా 2,685 గ్రామ సంఘాలుండగా.. అదేస్థాయిలో యానిమేటర్లూ ఉన్నారు. నూతన నిబంధనతో యానిమేటర్ల సంఖ్య తగ్గే అవకాశాలు ఉండటంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డ్వాక్రా సంఘాలను బలోపేతం చేసేందుకు 2012లో గ్రామ సంఘాల సహాయకుల వ్యవస్థను అమల్లోకి తెచ్చారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎన్నికలకు ముందు చంద్రబాబు యానిమేటర్లకు రూ.3వేల పారితోషికం ప్రకటించి, గ్రామ సమాఖ్యల నుంచి మరో రూ.2వేలను కలిపి మొత్తం రూ.5వేలను ఇచ్చేలా ఆదేశాలిచ్చారు. 


జీతం పెంచి ఉద్యోగాలకు ఎసరు

ఎన్నికల హామీల్లో భాగంగా సీఎం జగన్‌ రూ.5వేలను రూ.10వేలకు పెంచారు. ఈ మొత్తంలో రూ.8వేలను జీతంగా, రూ.2 వేలను గ్రామ సమాఖ్యల నుంచి ఇచ్చేలా ఉత్తర్వులిచ్చారు. ఇక్కడే మెలిక పెట్టారు. ఆగస్టు నుంచి వేతనం పొందాలంటే ఒక్కో వీవో పరిధిలో 30 సంఘాలు తప్పనిసరి గా ఉండాలన్నారు. ఇప్పటికే సాంకేతిక కారణాన్ని చూపుతూ 15 సంఘాల్లోపున్న వీవోలను పర్యవేక్షిస్తున్న 175 మంది యానిమేటర్లకు మార్చి నుంచి జూన్‌ వరకు వేతనాలివ్వలేదు. 


30 సంఘాలు కచ్చితంగా ఉండాలి

యానిమేటర్ల పనితీరును సమీక్షిస్తున్నాం. కొందరి పరిధిలో 10, 15 డ్వాక్రా సంఘాలు.. మరికొందరి పరిధిలో 30.. ఆపైగా సంఘాలున్నాయి. ఇక నుంచి అలా కాకుండా ప్రతి యానిమేటర్‌ పరిధిలోనూ కచ్చితంగా 30 సంఘాలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. యానిమేటర్ల సంఖ్య తగ్గదు. వారి ఉద్యోగాలకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు.

- తులసి, డీఆర్‌డీఏ పీడీ

Updated Date - 2021-07-29T07:12:36+05:30 IST