ఈ విపత్కాలంపై ఒక దార్శనికుడు ప్రసరించిన వెలుగు చీకట్లు!

ABN , First Publish Date - 2020-04-27T10:29:11+05:30 IST

నోబెల్‌ పురస్కార గ్రహీత ఆల్బర్ట్‌ కామూ 1941లో ఇరవై ఎనిమిదేళ్ళ వయసులో రాయడం ఆరంభించి ఆరేళ్ళ తరువాత 1947లో ప్రచురించిన ఫ్రెంచ్‌ నవల ‘ది ప్లేగ్‌’. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు మనిషి ఉనికిని ప్రశ్నిస్తూ భయభ్రాంతులను చేస్తున్న...

ఈ విపత్కాలంపై  ఒక దార్శనికుడు ప్రసరించిన వెలుగు చీకట్లు!

1957లో ప్రతిష్ఠాత్మక నోబెల్‌ పురస్కారం అందుకుంటూ చేసిన తన ప్రసంగంలో ‘‘రాయడానికి మించి ఒక రచయిత చాలా చెయ్యాలి’’ అంటాడు కామూ. ఆ ‘చాలా’ చేసే ఆ బరువునూ, గౌరవాన్నీ కామూ ఇష్టంగా ఆస్వాదించాడు గనకే బహుశా అంత పరివేదనతో రాయగలిగాడు.                      


నోబెల్‌ పురస్కార గ్రహీత ఆల్బర్ట్‌ కామూ 1941లో ఇరవై ఎనిమిదేళ్ళ వయసులో రాయడం ఆరంభించి ఆరేళ్ళ తరువాత 1947లో ప్రచురించిన ఫ్రెంచ్‌ నవల ‘ది ప్లేగ్‌’. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు మనిషి ఉనికిని ప్రశ్నిస్తూ భయభ్రాంతులను చేస్తున్న కరోనా విపత్తు పరిస్థితుల్ని 73 ఏళ్ళ కిందట ప్లేగ్‌ వ్యాధి నేపథ్యంలో లేవనెత్తిన పుస్తకం. ఒక అరుదైన క్లాసిక్‌. మనిషి భవితవ్యం, అస్తిత్వాల మీద ఒక లోతైన టిప్పణిలా సాగుతుంది నవల. మృత్యువుతో మనిషి చేసే సమరమూ, సహవాసమూ ‘ది ప్లేగ్‌’ లో కామూ ఎన్నుకున్న సార్వకాలీన కథా వస్తువు.


సమాజం సవ్యంగా ఉన్న కాలమైతే పుస్తకం చదవడం ఒక అన్యమనస్కత (distraction), కాలం దొర్లింపు (time pass) లేదంటే బుద్ధివికాసం (enlightenment) కోసమో చేస్తాం. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ‘ది ప్లేగ్‌’ని విద్యావంతులూ, క్రియాశీలురూ బహుశా కరోనా సంహారానికి ఏవైనా ఆధారాలు దొరుకుతాయేమోనని చదువుతున్నారు.


తాను నివాసం ఉన్న అల్జీరియాలోని పట్టణం వాహ్రాన్‌లో ప్లేగు వ్యాధి (కల్పితం) వ్యాపించడం, అప్పటి ప్రజలూ, ప్రభుత్వమూ దాన్ని ఎదుర్కోవడంలో చూపిన చొరవా, (మొదట్లో) ఉపేక్షా ‘ది ప్లేగ్‌’ లో వస్తువు. కామూ చర్చించింది కనబడే ఒక వ్యాధి గురించే కాదనీ, ప్రతీకాత్మకంగా మనిషిని వేధించిన ఫాసిస్ట్‌ నియంతృత్వాన్నీ, దాని అవశేషాలనూ చిత్రించాడనీ కూడా విశ్లేషకులు అంటారు. 


1957లో ప్రతిష్ఠాత్మక నోబెల్‌ పురస్కారం అందుకుంటూ చే సిన తన ప్రసంగంలో ‘‘రాయడానికి మించి ఒక రచయిత చాలా చెయ్యాలి’’ అంటాడు కామూ. ఆ ‘చాలా’ చేసే ఆ బరువునూ, గౌరవాన్నీ కామూ ఇష్టంగా ఆస్వాదించాడు గనకే బహుశా అంత పరివేదనతో రాయగలిగాడు. కామూ మరో రచన ‘ది స్ట్రేంజర్‌’ చదివినా ఈ భావన కలుగుతుంది.


నిన్నా నేడూ సోషల్‌ డిస్టెన్సింగ్‌, క్వారంటైన్‌ల పేరుతో నాలుగు గోడల నడుమ బం దీలై, తన్నుకొస్తున్న విసుగుతో సతమతమయ్యే జనం ఆవులింతల నడుమ టీవీలు చూస్తూ ఊహించుకుంటున్న ఆశలూ, నిరాధార భయాలూ అన్నింటినీ ఆల్బెర్ట్‌ కామూ తన కథనంలో వివరంగానూ, గుంభనగానూ చిత్రించాడు


వైద్యులూ, నర్సులూ ఇతర సిబ్బందీ ఈ నాడు ఎదుర్కొంటున్న అన్ని సంక్లిష్టతలనూ ‘ది ప్లేగ్‌’లో విడమరచిన రీతి అబ్బురపరుస్తుంది. హీరోల్ని, వాళ్ళ సాహసాలనూ, త్యాగాలనూ సినిమాలో మాత్రమే చూసే తరంలో ఉన్నాం మనం. ఒక్కసారిగా, ఏ సంకేతాలూ ఇవ్వకుండా సాధారణ జన జీవన శైలి తిరగబడ్డప్పుడు హీరోలుగా చూడ్డానికి మనం అలవాటు పడని డాక్టర్లూ, నర్సులూ ఎంత ధీరోదాత్తంగా ఉండగలరో నేడు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ‘ది ప్లేగ్‌’లో డాక్టర్‌ అదే చేశాడు. విధి నిర్వహణ అన్నింటికీ మించిన యోగ్యత అని డాక్టర్‌ రైయూ అంటాడు ఒక సందర్భంలో. అసలు సిసలు హీరోలంటే విధి నిర్వహణలో మునిగి తేలే సగటు మనుషులులేనని ఇవాళ మనకు తెలిసి వస్తూంది. వినయం మరచిపోయి బలాదూరు తిరిగే ఇప్పటి కొందరు జనం లానే డాక్టర్‌ రైయూ కూడా నిర్లక్ష్యాన్నీ, బుద్ధి లేని ధీమానీ చుట్టూ ఉన్న సగటు మనుషుల్లో చూస్తాడు. 


ప్లేగు వ్యాధి సోకి 1556లో ఒకసారి, 1678లో ఇంకోసారీ అపార ప్రాణ నష్టం జరిగిన ఫ్రాన్స్‌లోని చిన్న పట్టణం ఒరాన్‌లో జరిగే కథనం ది ప్లేగ్‌. ఆ తరువాత 1921, 1931, 1944ల్లో మళ్ళీ సోకిన వ్యాధికి ప్రాణనష్టం చాలా పరిమితం చెయ్యబడింది. ఒరాన్‌ నగరం భయంకరమైన ఆ అంటురోగాన్ని ఎలా ఎదుర్కొందో కామూ తన నవలలో చెప్పాడు.


కథలో పాత్రలు మాట్లాడే చాలా మాటలు వ్యక్తి పరిధి దాటి ఒక సార్వజనీన స్వభావాన్నో, భయాన్నో, ఆశనో చెబుతున్నట్టు సాగుతాయి. పైకి వ్యక్తమయే మాటల అడుగున కానరాని అర్థాలూ, దృష్టాంతాలూ (allegorical indications) చదువరికి తగులుతుంటాయి. సగటు మనిషిలో ఈసడించుకోవాల్సిన గుణాలకంటే ప్రశంసార్హ మైన లక్షణాలే ఎక్కువ ఉంటాయని చెప్పిన అరుదైన ప్రయత్నం ఈ నవల.


బెర్నార్డ్‌ రైయూ అనే 35 ఏళ్ళ వైద్యుడు, జీన్‌ టారో అనే ఒక స్థానికేతరుడూ, రేమండ్‌ రాంబర్ట్‌ అనే పాత్రికేయుడు, గ్రాండ్‌ అనే మునిసిపాలిటీ ఉద్యోగి, ఆత్మహత్యా ప్రయత్నమొకటి చేసి బైటపడ్డ ఒక టక్కరి కాటార్డ్‌, ఫాదర్‌ ప్యానెలూక్స్‌ అనే ఒక మతప్రచారకుడూ ఈ నవలలో పాత్రలు.


‘ది ప్లేగ్‌’లో తారసపడే పాత్రలన్నింటిలోనూ అంతర్లీనంగా ఒక ప్రవృత్తి ఉంది: చుట్టుముట్టిన వ్యాధి ముందు తమ సత్తా చాలదని తెలిసినా సరే సమక్షంలో నిలబడి దాన్ని ఎదుర్కోవాలనే నిబద్ధత. శక్తి శూన్యమని తెలిసీ వెనక్కి తగ్గకుండా నిరోధించడానికి మనిషి సన్నద్ధం కావడమే నవల ఏకైక సందేశం. తాను నిర్వహిస్తున్న వైద్య సేవ సరిహద్దును పరిరక్షించే సైనికుడి పహారా లాంటిదే అని భావిస్తాడు రైయూ.


భాష, రచనా సంవిధానం రీత్యా నవలను ఒక ఎంపిక చేసుకున్న బల్ల పరుపు, నిరలంకార ధోరణితో సాగిస్తాడు కామూ. శవాల దిబ్బలూ, మృత్యు మృదంగాలూ అని నేడు మనం వాడుతున్న గులకరాళ్ళ వంటి మాటలు ‘ది ప్లేగ్‌’లో వెదికి చూసినా కనబడవు. మాటల్లో కంటే మాటల వెనక నిగూఢంగా దాగివుండే అన్యార్థ సందేశం రచనను సం పన్నం చేసింది. ఎడతెగని దైనందిన వ్యాపకాల మత్తులో మనిషి పరిత్యాగం చేసిన పారలౌకికత గురించి అంటించిన చురకలు నవలలో చాలానే కనబడతాయి.


సమాజం అన్నాక- మృత్యుముఖంలో నుంచుని కూడా మతాన్నీ, దేవుడిమీద విశ్వాసాన్నీ ఒదులుకోని ప్యానెలూక్స్‌ లాంటి చర్చి ఫాదర్లూ ఉంటారు, ఉత్పాతాన్ని కూడా క్యాష్‌ చేసుకునే కాటార్డ్‌లూ ఉంటారు. బలవంతపు నిర్బంధం కొత్తలో నచ్చకపోయినా ప్రజలు కాలక్రమంలో ఆ చర్య సమూహానికి మేలే చెయ్యగలదని విశ్వసించి సహకరిస్తారు. 


ఎక్కడో వేరే చోట టీబీవ్యాధికి చికిత్స తీసుకుంటూ రైయూ భార్య మరణిస్తుంది. జీవితం తీరే అంత. ‘‘ఇదంతా సర్దుకున్నాక రేపేం జరగబోతూందో నాకు తెలీదు. ఇప్పటికిప్పుడు నాకు తెలిసిందంతా చుట్టూ ఉన్న రోగులు, వాళ్ళకి అందాల్సిన వైద్యం’’, అంటాడు ఆ కర్మయోగి. ఇక్కడ తనకేమీ కాని జనాల ప్రాణాలు కాపాడ్డంలో డాక్టర్‌ రైయూ నిమగ్నమై ఉన్నప్పటికీ అతని అర్ధాంగికి మృత్యువు నుంచీ ఏమీ మినహాయింపు ఉండదు. ఈ అనివార్యతే కామూ రచనలకూ, జీవన దృక్పథానికి ఆనవాలు. 


నవల ముగింపులో, ప్లేగ్‌ వ్యాధి మీద మనిషి సాధించిన విజయం అనంతరం, ప్రధాన పాత్రధారి రైయూ అన్నట్టు మనిషికి అంతిమంగా మనశ్శాంతి దొరికేందుకు హేతువు పరస్పరమైన ‘ప్రేమ’. మొత్తంగా నవల ద్వారా కామూ ఆవిష్కరించాలనుకున్నదీ ఈ చిన్న మెలికనే.

తిరువాయపాటి రాజగోపాల్‌

95731 69057


నిన్నా నేడూ సోషల్‌ 

డిస్టెన్సింగ్‌, క్వారంటైన్‌ల పేరుతో నాలుగు గోడల నడుమ బందీలై, తన్నుకొస్తున్న విసుగుతో సతమతమయ్యే జనం ఆవులింతల నడుమ టీవీలు చూస్తూ ఊహించుకుంటున్న ఆశలూ, నిరాధార భయాలూ అన్నింటినీ ఆల్బెర్ట్‌ కామూ తన కథనంలో వివరంగానూ, గుంభనగానూ చిత్రించాడు


Updated Date - 2020-04-27T10:29:11+05:30 IST