అంతటా చీ‘కట్‌’లు

ABN , First Publish Date - 2021-10-10T06:38:02+05:30 IST

జిల్లాలో కరెంటు కోతలు తీవ్రమయ్యాయి. ప్రధానంగా పల్లెల్లో రోజుకు నాలుగైదు గంటలపాటు సరఫరా నిలిచిపోతోంది.

అంతటా చీ‘కట్‌’లు
విద్యుత్‌ కోతకు నిరసనగా ముండ్లమూరు సబ్‌ స్టేషన్‌కు తాళం వేసి నిరసన తెలుపుతున్న రైతులు (ఫైల్‌)

పల్లెల్లో రోజుకు నాలుగు గంటలకుపైగా సరఫరా బంద్‌ 

ప్రజలు, రైతుల అవస్థలు 

వాడుముఖం పడుతున్న పంటలు

పట్టణాల్లోనూ తరచూ తీసేస్తున్నారు

సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ల వర్క్‌ఫ్రం హోంకు కష్టాలు

విద్యుత్‌ కోతలతో విసిగి వేసారి జనం ఏకంగా గత గురువారం రాత్రి ముండ్లమూరు సబ్‌స్టేషన్‌కు తాళాలు వేసి నిరసన తెలిపారు. ఒకవైపు వర్షాలు కురిసి సమృద్ధిగా ప్రాజెక్టుల్లో నీరు ఉన్నా ఈ వేళాపాళా లేని కోతలేమిటంటూ రైతులు, వినియోగదారులు ప్రశ్నించారు. 

విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యం కారణంగా తమ పైర్లు ఎండిపోతున్నాయంటూ సీఎస్‌పురం రైతులు పురుగుమందు డబ్బాలతో గత సోమవారం సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. కరెంట్‌ సరఫరా సరిగా ఇవ్వకపోతే తమకు ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు.

 పర్చూరు సబ్‌డివిజన్‌ పరిఽధిలో విద్యుత్‌ కోతలు ఎక్కువగా ఉన్నాయి. గ్రామాల్లో నాలుగైదు గంటలు, పట్టణ ప్రాంతాల్లో నాలుగు గంటల మేరకు కోతలు విధిస్తున్నారు. వర్షాకాలం కావటంతో దోమల బెడదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జ్వరాలు ఎక్కువగా ఉండటంతో ఆందోళన చెందుతున్నారు.

జిల్లాలో కరెంటు కోతలు తీవ్రమయ్యాయి. ప్రధానంగా పల్లెల్లో రోజుకు నాలుగైదు గంటలపాటు సరఫరా నిలిచిపోతోంది. ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఉండదో అర్థంకావడం లేదు. చార్జీలు భారీగా పెంచి ఖజానాను నింపుకొంటున్న ప్రభుత్వం సరఫరా మాత్రం సరిగ్గా చేయడం లేదని జనం మండిపడుతున్నారు. లోడ్‌ రిలీఫ్‌ పేరుతో ఉదయం, సాయంత్రం రెండుపూటలా కోతలు విధిస్తున్నారు. నెల నుంచి ఇవి ఎక్కువయ్యాయి. గత ప్రభుత్వంలో కోతలు లేకపోవడంతో ప్రజలు ఇన్వర్టర్లను మూలన పడేశారు. అయితే నెల నుంచి మరలా ఇన్వర్టర్లు కొనేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. వర్క్‌ఫ్రం హోంతో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులంతా ఇళ్ల వద్ద నుంచే పనిచేస్తుండగా, కోతల ప్రభావం వారిపై తీవ్రంగా ఉంది. 

మేదరమెట్ల/అద్దంకి టౌన్‌/ఒంగోలు(క్రైం) అక్టోబరు 9 : జిల్లాలో కరెంట్‌ కష్టాలు ప్రారంభమయ్యాయి. వర్షాకాలం లోనూ వేళాపాళా లేని కోతలతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. నెల నుంచి పల్లెల్లో రాత్రి, పగలు తేడా లేకుండా ఎడాపెడా సరఫరా నిలిపివేస్తున్నారు. గత వారంగా పట్టణాల్లోనూ కరెంట్‌ కట్‌లు పెరిగాయి. రోజుకు నాలుగు గంటలపాటు విద్యుత్‌ కోత ఉండటంతో అటు రైతులతోపాటు, వినియోగదారులు ఇబ్బందులు పడుతు న్నారు. వృద్ధులు, బాలింతలు, చిన్నారుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. ప్రధానంగా వర్క్‌ఫ్రం హోంలో ఉన్న సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లకు కష్టాలు ఎక్కువయ్యాయి. కరోనా కాలంలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు అంతా సొంత ఊర్లకు వచ్చి అక్కడి నుంచే పనిచేస్తున్నారు. ప్రస్తుతం రెండు,మూడు రోజులుగా కోతలు ఎక్కువ కావటంతో వారు అల్లాడిపోతున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే వారంతా తిరిగి నగరాల బాట పట్టక తప్పేట్లు లేదు. చాలామంది ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం విద్యుత్‌ వినియోగం కూడా పెరిగింది. అదేక్ర మంలో సరఫరా తగ్గింది. దీంతో కోతలు అనివార్యమయ్యా యని విద్యుత్‌ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో ప్రస్తుతం 10.320 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ అవసరం ఉంటే 9.424 మిలియన్‌ యూనిట్లు మాత్రమే సరఫరా అవుతోంది. అంటే ఇంకా 0.896 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ జిల్లాకు అవసరమవుతుంది. ఆ మేరకు సరఫరా లేకపోవడంతో లోడ్‌ రిలీఫ్‌ పేరుతో పగలు, రాత్రి నాలుగు గంటలపాటు కరెంట్‌ కట్‌ చేస్తున్నారు. 


ఎండుతున్న పంటలు

మండల కేంద్రాల నుంచి మారుమూల గ్రామాల వరకు రోజుకు నాలుగు గంటలకు తగ్గకుం డా అనధికారిక విద్యుత్‌ కోతలు ప్రారంభమయ్యాయి. ప్రధానంగా వ్యవసాయానికి ఇస్తున్న 9 గంటల సమయంలో మూడు నుంచి నాలుగు గంటలు కోతలు ఉండటంతో రైతుల బాధలు వర్షణాతీతమయ్యాయి. అసలు సరఫరా ఎప్పుడువస్తుందో ఎప్పుడు పోతుందో అంతు బట్టని పరిస్థితి నెలకొంది. దీంతో దిక్కుతోచని పరిస్థితిలో రైతులు ఉన్నారు. వ్యవసాయ మోటార్ల కింద అధికశాతం కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నారు. కొన్నిచోట్ల వరి కూడా వేశారు. ఈ పరిస్థితుల్లో సక్రమంగా నీరు అందక పంట నష్టపోయే పరిస్థితి ఉందని సాగుదారులు వాపోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకూ, లేకపోతే 7 నుంచి 9 గంటల వరకూ కోతలు విధిస్తున్నారు. కోతలకు సంబంధించి ఎవరికి ఫోన్‌ చేసినా సరైన సమాధానం ఉండటం లేదు. ఒకవేళ ఫోన్‌ ఎత్తినా మా వద్ద కాదు.. పై నుంచే తీస్తున్నారు.. ఎప్పుడు ఇస్తారో తెలియదు అని చెబుతున్నారు. వేసవిలో మాదిరిగా వర్షాకాలంలోనే కోతలు ఏంటని జనం ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే ఇక రాబోయే రోజుల్లో పరిస్థితిని ఊహించుకుని ఇన్వర్టర్లను కొనడమో.. లేక ఉన్న వాటికి బ్యాటరీలను మార్చడమో చేస్తున్నారు.


అంతా అంధకారమే

మేదరమెట్ల సబ్‌స్టేషన్‌ పరిధిలోని అద్దంకి మండలంలోని ఽధేనువకొండ పునరావాసకాలనీ, విప్పర్లవారిపాలెం, కొంగపాడు, మణికేశ్వరం గ్రామాలు ఉన్నాయి. కొద్దిరోజుల నుంచి ఎడాపెడా కోతలు విధిస్తుండటంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి సమయాల్లో ఎక్కువగా సరఫరా నిలిపివేస్తున్నారు. ధేనువకొండ పునరావాస కాలనీలో ఇళ్లస్థలాలు పొందిన వారంతా నివాసాలు ఏర్పాటు చేసుకోకపోవడంతో ఖాళీస్థలాల్లో చెట్లు దట్టంగా పెరిగి రోడ్లపైకి వచ్చాయి. కాలనీలో వీధిదీపాలు సక్రమంగా లేకపోవడంతో చీకటిపడితే రోడ్డుపైకి వచ్చేందుకు ప్రజలు భయపడుతున్నారు. శుక్రవారం ఉదయం 10గంటలకు విద్యుత్‌ సరఫరా నిలిపివేసిన  అధికారులు అప్పుడప్పుడూ ఇస్తూ మళ్లీ తీస్తూ సాయంత్రం 7గంటల వరకు కోతను కొనసాగించారు. శనివారం కూడా అలాంటి పరిస్థితే నెలకొంది. వేళాపాళా లేకుండా సరఫరా నిలిపివేస్తుండటంపై ప్రజలు విద్యుత్‌ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  






Updated Date - 2021-10-10T06:38:02+05:30 IST