Advertisement
Advertisement
Abn logo
Advertisement

నేటితో ముగియనున్న దర్బంగా కేసు నిందితుల కస్డడీ

  • వివిధ ప్రాంతాల్లో పర్యటించి కీలక ఆధారాల సేకరణ


హైదరాబాద్‌ సిటీ : దర్బంగా పేలుళ్ల కేసు నిందితుల ఎన్‌ఐఏ కస్టడీ నేటితో ముగియనుంది. హైదరాబాద్‌లో అరెస్టు అయిన సోదరులిద్దరితో పాటు కైరానాలో చిక్కిన మరో ఇద్దరికి వారం రోజుల క్రితం పాట్నా ప్రత్యేక ఎన్‌ఐఏ కోర్టు 7రోజుల కస్టడీకి అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో అరెస్టు అయిన నలుగురికి కస్టడీకి అప్పగించినప్పటికీ.. హాజీ సలీమ్‌ అనారోగ్యానికి గురి కావడంతో అతడ్ని మినహాయించి ముగ్గురిని అధికారులు విచారించారు. దర్బంగా ఎక్స్‌ప్రెస్‌ పార్శిల్‌ పేలుడుతో డైరెక్ట్‌ లింక్‌ ఉండి ఇప్పటికే అరెస్టు అయిన ఇమ్రాన్‌ మాలిక్‌, నాసిర్‌ఖాన్‌లు ఇచ్చిన సమాచారంతో సోదరుల స్వగ్రామం... ఉత్తరప్రదేశ్‌, షామ్లి జిల్లా కైరానా గ్రామానికి చెందిన మహ్మద్‌ సలీం అహ్మద్‌ అలియాస్‌ హాజీ సలీమ్‌, కఫీల్‌లను కూడా ఎన్‌ఐఏ అధికారులు గత వారం అదుపులోకి తీసుకుని పాట్నాకు తరలించారు. సోదరులిద్దరు ఈ ఏడాది ఫిబ్రవరిలో హాజీ సలీమ్‌తో అతడి ఇంటి వద్ద కలిసి రన్నింగ్‌ ట్రైన్‌లో బాంబు పెట్టేందుకు వ్యూహరచన చేసినట్లు అధికారులు గుర్తించి.. కస్టడీలో వివరాలు రాబట్టారు. 


దర్యాప్తు పూర్తి?

దర్బంగా పేలుడు కేసు నిందితులైన నాసిర్‌ మాలిక్‌, ఇమ్రాన్‌ మాలిక్‌ సోదరులను జాతీయ దర్యాప్తు బృందం(ఎన్‌ఐఏ) దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలించి వివరాలు సేకరిస్తున్నారు. విచారణలో భాగంగా బుధవారం ముగ్గురు నిందితులను ఉత్తరప్రదేశ్‌లోని ఖైరానాకు తీసుకెళ్లి.. అక్కడ ఏం జరిగిందో ఆధారాలు సేకరించారు. చిక్కిన నలుగురూ ఖైరానాకు చెందిన వారే కావడంతో ఇతరుల పాత్ర గురించి కూడా ఆరా తీశారు. వారి ఇంట్లో సోదాలు నిర్వహించి ఆధారాలు సేకరించినట్లు సమాచారం. 


అంతకు ముందు రెండు రోజులపాటు వారిని హైదరాబాద్‌లోనే విచారించిన దర్యాప్తు అధికారులు సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌, మల్లేపల్లి, చిక్కడపల్లి ప్రాంతాల్లో సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేశారు. బాంబు తయారీ సామగ్రి కొనుగోలు నుంచి సికింద్రాబాద్‌లోని రైల్వే పార్శిల్‌ కేంద్రం వరకు సీన్‌ రీకన్‌స్ట్రక్ట్‌ చేశారు. వారి ఇళ్లలో సోదాలు చేసి.. పలు కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా ఈ పేలుడుతో సంబంధమున్న ఇంకో వ్యక్తిని దర్యాప్తు అధికారులు అదుపులోకి తీసుకుని విచారించారు. శుక్రవారం నిందితులను ఆస్పత్రికి తరలించి, వైద్య పరీక్షల అనంతరం జైలుకు తరలించే అవకాశముంది. అయితే ఎన్‌ఐఏ అధికారుల దర్యాప్తు పూర్తయ్యిందా.. లేక తిరిగి కస్టడీకి కోరే అవకాశం ఉందా తేలనుంది. 

మాలిక్‌ సోదరుల అరెస్టు.. 

హాజీ సలీమ్‌ వద్దకు చేరిన అధికారులు అతడ్ని విచారిస్తే చాలా విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది. ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిన తర్వాత అతడ్ని కస్టడీలోకి తీసుకుని అధికారులు విచారిస్తే సూత్రధారిగా అనుమానిస్తున్న ఇక్బాల్‌ ఖాన్‌ ఆనవాళ్లు గుర్తించే అవకాశముంది. ఇప్పటి వరకు సాగిన దర్యాప్తులో లష్కరే తోయిబాలో కీలకంగా వ్యవహరిస్తున్న ఇక్బాల్‌తో హాజీ సలీమ్‌ నేరుగా సంప్రదించినట్లు సమాచారం. ఇక్బాల్‌ ఆదేశాలను హాజీ సలీమ్‌ ఫోన్‌ ద్వారా మాలిక్‌ సోదరులకు చేరవేసినట్లు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా హాజీ సలీమ్‌ ఫోన్‌ నుంచి బాంబు తయారీకి సంబంధించిన వీడియోలు.. ఇమ్రాన్‌ ఫోన్‌ వద్దకు చేరాయి. అంతకు ముందు ఆ వీడియోలు ఎక్కడి నుంచి వచ్చాయోననే అంశాలను కూడా అధికారులు రాబడుతున్నారు.  సలీమ్‌ను విచారిస్తే పలు అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయి.

Advertisement
Advertisement