కమలానికి మరో షాక్‌

ABN , First Publish Date - 2022-01-13T07:24:34+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి దెబ్బమీద దెబ్బ పడుతోంది. మంగళవారం సీఎం యోగి ఆదిత్యనాథ్‌ కేబినెట్‌లోని కీలక మంత్రి స్వామిప్రసాద్‌ మౌర్య, మరో నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా..

కమలానికి మరో షాక్‌

  • యోగి క్యాబినెట్‌ నుంచి దారాసింగ్‌ చౌహాన్‌ ఔట్‌
  • 2014 నాటి కేసులో ఎస్పీ మౌర్యపై అరెస్టు వారంట్‌ జారీ
  • అయోధ్య నుంచి యోగి పోటీ!
  • బీజేపీ నుంచి ఆరుకు చేరిన వలసల సంఖ్య


లఖ్‌నవ్‌/న్యూఢిల్లీ, జనవరి 12: ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి దెబ్బమీద దెబ్బ పడుతోంది. మంగళవారం సీఎం యోగి ఆదిత్యనాథ్‌ కేబినెట్‌లోని కీలక మంత్రి స్వామిప్రసాద్‌ మౌర్య, మరో నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయగా.. బుధవారం మరో మంత్రి దారాసింగ్‌ చౌహాన్‌ రాజీనామా చేశారు. దీంతో రాజీనామా సంఖ్య ఆరుకు చేరింది. రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రిగా ఉన్న దారాసింగ్‌.. యూపీలోని మావు ప్రాంతంలో అత్యంత వెనుకబడిన వర్గాలకు చెందినవారు. 2017 ఎన్నికల ముందు బహుజన సమాజ్‌ పార్టీ నుంచి బీజేపీలో చేరిన దారాసింగ్‌ అంతకుముందు బీఎస్పీ తరఫున రెండుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. వెనుబడిన వర్గాలు, దళితులను యోగి ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినందుకు నిరసనగానే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు గవర్నర్‌కు సమర్పించిన లేఖలో పేర్కొన్నారు. మంగళవారం మంత్రి పదవికి రాజీనామా చేసిన స్వామిప్రసాద్‌ మౌర్యకు ఓ పాత కేసుకు సంబంధించి స్థానిక కోర్టు అరెస్టు వారెంటు జారీ చేసింది. హిందూ దేవుళ్లకు వ్యతిరేకంగా మౌర్య అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ 2014లో ఆయనపై కేసు నమోదైంది.


ఈ కేసులో 2016లోనే కోర్టు అరెస్టు వారంట్‌ జారీ చేయగా.. అలహాబాద్‌ హైకోర్టులోని లఖ్‌నవ్‌ బెంచ్‌ దానిపై స్టే విధించింది. మరోవైపు స్వామిప్రసాద్‌ మౌర్యను తిరిగి వెనక్కి రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని బీజేపీ నేతలు తెలిపారు. అయితే తాను మళ్లీ బీజేపీలోకి వెళ్లే ప్రసక్తే లేదని మౌర్య ప్రకటించారు. ఆయన సమాజ్‌వాది పార్టీలో ఇప్పటికే చేరినట్లు ప్రచారం జరిగినా.. తాను ఇంకా ఏ పార్టీలో చేరలేదని తెలిపారు. మరోవైపు స్వామిప్రసాద్‌ మౌర్యతోపాటు బీజేపీని వీడుతున్నట్లు ప్రకటించిన ఎమ్మెల్యే వినయ్‌ శక్యాను కొందరు బలవంతంగా ఎత్తుకెళ్లారని ఆయన కుమార్తె ఆరోపించగా.. ఈ ఆరోపణల్ని శక్యా ఖండించారు. తాను ఇప్పుడు కూడా తన ఇంట్లోనే ఉన్నానని తెలిపారు. కాగా, మరో బీజేపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌ త్రిపాఠి ఆ పార్టీని వీడి ఎస్పీలో చేరనున్నట్లు సోషల్‌ మీడియాలో ప్రచారం జరగడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను పార్టీని వీడుతున్నట్లుగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడికి రాసినట్లు నకిలీ లేఖను సృష్టించారని తెలిపారు. 


బీజేపీలోకి సమాజ్‌వాది, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు..

ఓవైపు బీజేపీ ఎమ్మెల్యేలను సమాజ్‌వాది పార్టీలో చేర్చుకునే పనిలో అఖిలేశ్‌ యాదవ్‌ ఉండగా.. మరోవైపు ఆయన పార్టీకి చెందిన ఎమ్మెల్యే హరి ఓం యాదవ్‌ను కమలనాథులు తమ గూటికి రప్పించుకున్నారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే నరేశ్‌ సైనీ, ఎస్పీ మాజీ ఎమ్మెల్యే ధరమ్‌పాల్‌ సింగ్‌తో కలిసి హరి ఓం యాదవ్‌ బుధవారం డిప్యూటీ సీఎం కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య సమక్షంలో బీజేపీలో చేరారు. మరోవైపు యూపీ కాంగ్రె్‌సలో ఫైర్‌బ్రాండ్‌గా ముద్రపడ్డ ఇమ్రాన్‌ మసూద్‌ ఆ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. మరోవైపు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అవతార్‌సింగ్‌ బదానా రాష్ట్రీయ లోక్‌దళ్‌లో చేరారు. మంత్రులు, ఎమ్మెల్యేల రాజీనామాతో పార్టీకి ఎటువంటి నష్టం లేదని బీజేపీ అంటోంది. టికెట్లు దక్కవన్న భయంతోనే వారు వెళ్లిపోతున్నారని ఆ పార్టీ సీనియర్‌ నేత ఒకరు అన్నారు. యూపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి వ్యూహాత్మక ప్రాంతంలో ప్రధాని మోదీ సభలు నిర్వహించాలని బీజేపీ భావిస్తోంది. 


సీఎం అభ్యర్థిని కాంగ్రెస్‌ ప్రకటించాలి: ఛన్నీ

చండీగఢ్‌/పనాజీ/నోయిడా : కాంగ్రె్‌స పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించాలని పంజాబ్‌ సీఎం చరణ్‌జిత్‌ సింగ్‌ ఛన్ని అభిప్రాయపడ్డారు. నవ్‌జ్యోత్‌ సింగ్‌  సిద్ధూ, సునీల్‌ జాఖడ్‌ సహా పలువురు సీఎం అభ్యర్థులు ఉన్నారంటూ కాంగ్రె్‌సను లక్ష్యంగా చేసుకుని ప్రతిపక్షాలు చేసిన విమర్శల నేపథ్యంలో  ఛన్ని వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సీఎంను ఎన్నుకునేది పంజాబ్‌ ప్రజలేగాని, అధిష్ఠానం కా దంటూ పీసీసీ చీఫ్‌ సిద్ధూ తాజాగా చేసిన వ్యాఖ్యలూ పార్టీలో చర్చనీయాంశమయ్యాయి. ఈనేపథ్యంలో సీఎం అభ్యర్థి ఎంపిక వల్ల పార్టీ జయాపజయాలను ఛన్నీ వివరించారు. కాగా, రాష్ట్రం ఎదుర్కొంటున్న సవాళ్లకు పరిష్కారం చూపేవారు, కఠిన నిర్ణయాలు తీసుకునే నేతలు పంజాబ్‌కు ఇప్పుడెంతో అవసరమని కాంగ్రెస్‌ ఎంపీ మనీశ్‌ తివారీ పేర్కొన్నా రు. మరోవైపు, పార్టీ సీఎం అభ్యర్థిని వచ్చేవారం ప్రకటిసా ్తమని ఆప్‌ కన్వీనర్‌ కేజ్రీవాల్‌ తెలిపారు. 


అయోధ్య నుంచి యోగి పోటీ..

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ అయోధ్య శాసనసభ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో అభ్యర్థుల ఎంపికపై ఇటీవల ఢిల్లీలో జరిగిన అగ్రనేతల సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చిందని ఆ భేటీలో పాల్గొన్న నేత ఒకరు వెల్లడించారు. రాష్ట్ర బీజేపీ శాఖ కూడా యోగిని అయోధ్య లేదా మథుర నుంచి బరిలోకి దించాల్సిందిగా జాతీయ నాయకత్వాన్ని కోరుతున్నట్లు తెలుస్తోంది.  


18 మంది మంత్రులు బీజేపీని వీడతారు: రాజ్‌భర్‌

సీఎం యోగి ఆదిత్యనాథ్‌ కేబినెట్‌ నుంచి ప్రతి రోజూ రెండు వికెట్ల చొప్పున పడిపోతాయని మాజీ మంత్రి, సుహెల్‌దేవ్‌ భారతీయ సమాజ్‌ పార్టీ నేత ఓంప్రకాశ్‌ రాజ్‌భర్‌ అన్నారు. ఈ నెల 20 నాటికి 18 మంది మంత్రులు తమ పదవులకు రాజీనామా చేస్తారని తెలిపారు. బీజేపీ పాలనలో అణచివేతకు గురైన వారంతా సమయం కోసం ఎదురుచూస్తున్నారని, ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి గుణపాఠం తప్పదని అన్నారు. 2017 ఎన్నికల్లో బీజేపీతో జతకట్టిన రాజ్‌భర్‌.. సీఎం యోగి కేబినెట్‌లో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే యోగితో విభేదాలతో 2019లో మంత్రి పదవికి రాజీనామా చేసి బీజేపీతో తెగదెంపులు చేసుకున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో సమాజ్‌వాది పార్టీతో ఆయన పొత్తు పెట్టుకున్నారు. 

Updated Date - 2022-01-13T07:24:34+05:30 IST