డీఏపీ అరకొరే!

ABN , First Publish Date - 2022-06-12T07:00:28+05:30 IST

ఈ సారి రుతుపవనాలు సకాలంలోనే రానున్నాయని, సాధారణ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ రైతులకు ఊరటనిచ్చే వార్త చెప్పింది. మరో పక్క విత్తన సమయంలో ప్రధానమైన డీఏపీ ఎరువు కొరత రైతులను ఆందోళనకు గురిచేస్తోంది.

డీఏపీ అరకొరే!

  • ఉమ్మడి జిల్లాలో అప్పుడే కొరత
  • అందుబాటులో మిగతా ఎరువులు 
  • డీఏపీకి బదులు కాంప్లెక్స్‌ ఎరువులు వాడాలని అధికారుల సూచన
  • సాగుకు రైతులు సన్నద్ధం

   ఈ సారి రుతుపవనాలు సకాలంలోనే రానున్నాయని, సాధారణ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ రైతులకు ఊరటనిచ్చే వార్త చెప్పింది. మరో పక్క విత్తన సమయంలో ప్రధానమైన డీఏపీ ఎరువు కొరత రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. కేంద్ర ప్రభుత్వం డీఏపీ అమ్మకం ధరను తగ్గిండంతో ఉత్పత్తిదారులు ఈ ఎరువు ఉత్పత్తిని తగ్గించినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే డీఏపీ మినహా ఇతర ఎరువులు మాత్రం అవసరమైన మేర అందుబాటులో ఉన్నాయి. డీఏపీ మరింత ఎక్కువ అందుబాటులో ఉంచితేనే రైతుల అవసరాలు తీరుతాయి.


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి): రుతుపవనాలపై వాతావరణ శాఖ తీపి కబురు తెలిపింది. రెండు మూడు రోజుల్లో రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించనున్నట్లు వెల్లడించింది. దీంతో తొలకరి వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతులు వ్యవసాయ పనులు ముమ్మరం చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. అయితే వానకాలం పంటల ఆరంభంలోనే కొన్ని ప్రాంతాల్లో ఎరువుల కొరత మొదలైంది. వర్షాలు పడితే కొరత మరింత తీవ్రతరమయ్యే అవకాశాలున్నాయి. ముఖ్యంగా అనేక చోట్ల డీఏపీ దొరకడం లేదు. సొసైటీలు, డీలర్లు డీఏపీ స్టాక్‌ లేదని చెబుతున్నారు. యూరియా, ఇతర కాంప్లెక్స్‌ ఎరువులు మాత్రం అందుబాటులో ఉన్నాయి. వాస్తవానికి వానకాల సీజన్‌ ఆరంభానికి ముందే దాదాపు 50శాతం విత్తన, ఎరువులు మార్కెట్‌లో అందుబాటులో ఉంచుతారు. ప్రైవేటు డీలర్లతో పాటు సొసైటీల వద్ద తగిన  విత్తనాలు, ఎరువులను రైతులకు అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అయితే రైతులు ఎక్కువగా వినియోగించే డీఏపీ మినహా మిగతా ఎరువులు అందుబాటులో ఉన్నాయి. రంగారెడ్డి, వికారాబాద్‌, మేడ్చల్‌ జిల్లాల్లో దాదాపు అన్ని చోట్లా ఇదే పరిస్థితి నెలకొంది. రంగారెడ్డి జిల్లాలో ఈ ఖరీఫ్‌ సీజన్‌లో 21వేలకుపైగా టన్నుల డీఏపీ అవసరముండగా అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటి వరకు 3,502 టన్నులు నిల్వ ఉన్నట్లు చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి అలా లేదు. కొన్ని చోట్ల మాత్రమే డీఏపీ లభ్యత ఉంది. ముఖ్యమైన కేంద్రాల్లో నోస్టాక్‌ అని చెబుతున్నారు. సొసైటీల్లోనూ అమ్మడం లేదు. ధరల విషయంలో స్పష్టత లేక డీఏపీ ఉత్పత్తి చేసే కంపెనీలు ఆలస్యంగా ప్రొడక్షన్‌ను ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది డీఏపీపై కేంద్రం సబ్సిడీ ప్రకటించింది. ఏ కంపెనీ డీఏపీ అయినా బస్తా రూ.1,350లకే విక్రయించాలని ఆదేశించింది. గత ఏడాది  డీఏపీ(50కిలోల) బస్తా ధర రూ.1,900 ఉండగా ఈ ఏడాది రూ. 550 తగ్గించి రూ.1,350గా నిర్ణయించారు. కానీ మార్కెట్‌లో పూర్తిస్థాయిలో నిల్వలు లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. కొన్ని కంపెనీలు ఉత్పత్తి చేయడం కంటే బయట నుంచి తీసుకువస్తే ఎక్కువ గిట్టుబాటు అవుతుందనే ఉద్దేశంతో ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి. ఇదే సమయంలో ఉక్రెయిన్‌-రష్యా యుద్ధ ప్రభావం కూడా దిగుమతులపై పడింది. ఈ కారణంగా డీఏపీ నిల్వలు తగినంతగా సమకూర్చుకోలేక పోయినట్లు చెబుతున్నారు. రెండు వారాల్లో డీఏపీ కొరత అధిగమించవచ్చని అంటున్నారు.


  • ఉమ్మడి జిల్లాకు 1,09,873 టన్నుల ఎరువులు అవసరం

ఉమ్మడి జిల్లాకు ఈ వానకాలంలో 1,09,873 టన్నుల ఎరువులు అవసరం అవుతాయని అంచనా వేయగా ఇందులో ఇప్పటి వరకు 30,006 మెట్రిక్‌ టన్నులు మాత్రమే జిల్లాలకు వచ్చాయి. ఈ మెత్తాన్ని ఇప్పటికే అన్ని మండలాల్లోని పీఏసీఎస్‌, డీలర్ల వద్దకు చేర్చినట్టు అధికారులు చెబుతున్నారు. ఇందులో డీఏపీ, కాంప్లెక్స్‌ ఎరువులు దండిగా ఉన్నాయి. డీఏపీ స్థానంలో కాంప్లెక్స్‌ ఎరువులు వాడుకోవచ్చని వ్యవసాఖ అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులకు సూచిస్తున్నారు. 


  • ఎరువుల కొనుగోళ్లు ఇలా..

ఎరువులు కొనేందుకు డీలర్ల వద్దకు ప్రతీ రైతు తప్పనిసరిగా పట్టాదారు పాస్‌ పుస్తకం ఒరిజినల్‌, జిరాక్స్‌, ఆధార్‌ జిరాక్స్‌ పత్రాలను తీసుకెళ్లాల్సి ఉంటుంది. వీటిని తీసుకెళితేనే సబ్సిడీ౅ ఎరువులు ఇస్తారు. రైతులు కొనుగోలు చేసిన ఎరువులకు, విత్తనాలకు తప్పనిసరిగా బిల్లులు తీసుకోవాలని అధికారులు పేర్కొంటున్నారు. గరిష్ట ధర, సబ్సిడీ వివరాలు ఎరువుల బస్తాపై స్పష్టంగా ఉన్నాయి. వీటిని గమనించి రైతు తీసుకోవాల్సి ఉంటుంది.


  • వానకాలంలో 2లక్షల ఎకరాల్లో సాగు

రంగారెడ్డి జిల్ల్లా వ్యాప్తంగా వానకాలంలో దాదాపు 2లక్షల హెక్టార్లలో వివిధ పంటలు సాగవుతాయని అధికారులు పేర్కొంటున్నారు. పత్తి, కంది పంటలను ప్రోత్సహించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా పత్తి, కంది పంటల సాగుపై రైతులకు అవగాహనకల్పించేందుకు కరపత్రాలు, పోస్టర్లతో పాటు బుక్‌లెట్లను ఇటీవల జిల్లా కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ ఆవిష్కరించారు. ఈ ఏడాది ఖరీ్‌ఫలో ఇచ్చే పంటలకు రుణపరిమితి(స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌) పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాదు... గతం కంటే భిన్నంగా ఏప్రిల్‌ నెలలోనే ఆయా పంటలకు సంబంధించిన రుణపరిమితిని ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు జిల్లాల్లో వ్యవసాయ పంట రుణాలకు సంబంధించిన రుణపరిమితి పెంచుతూ అధికారులు నిర్ణయాలు తీసుకున్నారు. ఏయే పంటకు ఎంతెంత రుణం ఇవ్వాలనేదానిపై బ్యాంకులకు ఆదేశాలు జారీ చేశారు.

Updated Date - 2022-06-12T07:00:28+05:30 IST