సత్యావిష్కరణే దానిష్‌ తపన

ABN , First Publish Date - 2021-07-21T08:43:17+05:30 IST

‘నా చిత్రాలన్నీ సామాన్య పౌరుల అతి సామాన్య జీవితాన్ని ప్రతిబింబించేవే’ అంటాడు దానిష్ సిద్దిఖీ. ఒకటా, రెండా? ఇలా వందలాది సజీవచిత్రాలు...

సత్యావిష్కరణే దానిష్‌ తపన

‘నా చిత్రాలన్నీ సామాన్య పౌరుల అతి సామాన్య జీవితాన్ని ప్రతిబింబించేవే’ అంటాడు దానిష్ సిద్దిఖీ. ఒకటా, రెండా? ఇలా వందలాది సజీవచిత్రాలు ఆయన కెమేరా కన్నులతో బంధించబడినవే. ప్రతి చిత్రం దేనికదే ప్రత్యేకం. రాయిటర్స్ సంస్థలో ఇండియా మల్టీమీడియా టీంకు హెడ్‌గా వ్యవహరించిన ఆయన దశాబ్ద కాలంగా మానవపోరాటం, సంఘర్షణలను నిర్వచించే అనేక ఛాయాచిత్రాలను తనదైన శైలిలో ప్రజల ముందుంచాడు. బాధితుల దుఃఖాన్ని అంతే వాస్తవికంగా కెమేరాలో బంధించే దానిష్ చిత్రాలు అనేకం ప్రపంచాన్ని ఆలోచనల్లో పడేసేవి. మయన్మార్ రోహింగ్యా శరణార్థుల సంక్షోభాన్ని డాక్యుమెంట్ చేసినందుకు 2018లో ఫీచర్ ఫోటోగ్రఫీకి పులిట్జర్ బహుమతి పొందిన బృందంలో ఆయన ఒకరు. ‘మయన్మార్ నుంచి పారిపోవడంలో రోహింగ్యా శరణార్థులు ఎదుర్కొన్న హింసను ప్రపంచాన్ని బహిర్గతం చేసిన షాకింగ్ ఛాయాచిత్రాలు’ అని పులిట్జర్ జడ్జింగ్ కమిటీ ఆ ఫోటోలను అభివర్ణించడంలోనే దానిష్ ప్రతిభను అంచనా వేయవచ్చు.


మయన్మార్, బంగ్లాదేశ్ మధ్య సముద్ర సరిహద్దుకు సమీపంలో, నాఫ్ నది ముఖద్వారం వద్ద ఉన్న షా పోరిర్ ద్వీపంలోని ఒక బీచ్‌లో నిరాశకు గురై కుప్పకూలిపోతున్న స్త్రీని దానిష్ సిద్దిఖీ తన కెమేరాతో ప్రపంచానికి చూపించాడు. శరణార్థులు గోనె బస్తాలు మోసుకుంటూ తీరం వెంబడి నడుస్తుండగా, చీకటి పొగమేఘం వారి వెనుకవైపు పైకి లేచినట్లు చూపించే మరోచిత్రం మన హృదయాలను స్పృశిస్తుంది. ఫోటోగ్రఫీ విభాగంలో అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ పులిట్జర్ బహుమతిని గెలుచుకోవడానికి దోహదపడిన ఈ 15 ఛాయాచిత్రాలు, రోహింగ్యా సంక్షోభం అప్పటి మారణహోమం తీవ్రత గురించి సిద్దిఖీ అందించిన చిత్ర రచనలు. 2011 నుంచి రాయిటర్స్ ఫోటో జర్నలిస్ట్‌గా దానిష్ సిద్దిఖీ ఎప్పుడూ హెడ్‌లైన్-మేకింగ్ ఈవెంట్‌ల ద్వారా ఎక్కువగా ప్రభావితమయ్యే అట్టడుగు ప్రజలపై దృష్టి పెట్టేవాడు. మానవ ప్రేరిత సంఘర్షణ నుంచి సత్యాన్ని ప్రతిబింబించే ఛాయాచిత్రాలను తీయడం ఆయన శైలి. అసాధారణ విషయాలను ఒకే ఒక్క ఛాయాచిత్రంతో చెప్పే నైపుణ్యంతో పాటు, దీర్ఘకాలిక సమస్యలను తన ఫోటోలతో ఆవిష్కరించడం ఆయన ప్రత్యేకత. 


దానిష్ అంటే ఉర్దూభాషలో జ్ఞానం అని అర్థం. పేరుకు తగ్గట్టు అతడు జ్ఞానవంతుడే. న్యూఢిల్లీలో అఖ్తర్ సిద్దిఖీ, అయేషా దంపతులకు 1980 మే 19న జన్మించిన అహ్మద్ దానిష్ సిద్దిఖి, దక్షిణ ఢిల్లీలోని ఫాదర్ యాజ్ఞేల్ పాఠశాలలో చదివాడు. జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలో ఎకనామిక్స్ పట్టా పొందినప్పటికీ, ఆయన ఆసక్తి మాత్రం ఎప్పుడూ జర్నలిజం మీదే ఉండేది. దీంతో జామియాలోని అన్వర్ జమాల్ కిద్వాయి మాస్ కమ్యూనికేషన్ రీసెర్చ్ సెంటర్ లో చేరి, డిగ్రీ పూర్తి చేశాడు. మొదట హిందుస్తాన్ టైమ్స్‌ వార్తాపత్రిక, టెలివిజన్ న్యూస్ కరస్పాండెంట్‌గా తన వృత్తిని ప్రారంభించిన ఆయన ఫోటో జర్నలిజానికి మారి 2010 లో రాయిటర్స్‌ సంస్థలో ఇంటర్న్‌గా చేరాడు. దక్షిణాసియా దేశాలు, యూరోప్, మధ్య ఆసియా, చైనా, హాంకాంగ్ వంటి దేశాలలో సంస్థ తరపున పర్యటించి అనేక వార్తాచిత్రాలను అందించాడు. 2015 ఏప్రిల్‌లో దాదాపు తొమ్మిది వేల మంది ప్రజలను బలిగొన్న నేపాల్ భూకంప బీభత్సాన్ని ఫొటోల రూపంలో దానిష్ ప్రపంచానికి అందించాడు. 2016లో ఐసిస్ కబంధ హస్తాల నుంచి మోసుల్ నగరాన్ని విడిపించేందుకు ఇరాకీ భద్రతా దళాలు నిర్వహించిన యుద్ధాన్ని దానిష్ అత్యంత సాహసోపేతంగా ప్రపంచానికి చూపించడంలో సఫలీకృతుడయ్యాడు. ఇది ఆయన వృత్తిగత జీవితంలోనే అత్యంత సాహసోపేత ఘట్టం అనవచ్చు. యాంటీ–ఎక్స్‌ట్రడిషన్ లా సవరణ బిల్లు ఉద్యమంగా వ్యవహరించే హాంకాంగ్ నిరసనలను (2019–20), ఉత్తర కొరియాలో మాస్ గేమ్స్, స్విట్జర్లాండ్‌లో శరణార్థుల జీవన పరిస్థితులను తన కెమేరా లెన్స్‌లో ఎంతో సమర్థవంతంగా బంధించిన ఆయన, ఇంగ్లాండ్‌లో ముస్లిం మతమార్పిడులపై ఫోటో సిరీస్‌ను కూడా నిర్మించాడు.


కశ్మీర్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించిన అనంతరం అక్కడ దాదాపు ఏడాదిన్నర పాటు ఇంటర్నెట్ సేవలను రద్దు చేసిన నేపథ్యంలో దానిష్ తీసిన చిత్రాలు అనేక కోణాలను బయటపెట్టాయి. 2020 ఫిబ్రవరిలో వాయువ్య ఢిల్లీలో చెలరేగిన మతఘర్షణలను యథాతథంగా తన కెమేరాతో ప్రపంచానికి చూపడంతో మితవాద కార్యకార్తల ఆగ్రహానికి గురి కావలసి వచ్చింది. అదే సందర్భంలో ఒక ముస్లిం వ్యక్తిపై క్రూరంగా జరిగిన దాడికి సంబంధించి తీసిన ఒక ఫోటో రాయిటర్స్ నిర్వచించిన ఉత్తమ ఛాయాచిత్రాలలో ఒకటిగా ఎంపికయింది. కొవిడ్–19 మొదటి వేవ్‌లో వలసజీవుల దయనీయ దృశ్యాలు, 2020–21లో కొవిడ్ మృతుల ఫొటోలు ప్రభుత్వాన్ని సహజంగానే ఇరకాటంలోకి నెట్టేశాయి. కొవిడ్‌తో భారతదేశం అల్లాడుతుంటే కుంభమేళాలో లక్షలాది మంది భక్తులు నిబంధనలు పాటించకుండా పాల్గొన్న దృశ్యాలను తీసి ప్రపంచం ముందుంచాడు. తను కవర్ చేసే అంశాల గురించి లోతుగా అధ్యయనం చేసి వార్తల్లో ఉండే విషయాలు, వ్యక్తులపై ఎల్లప్పుడూ దృష్టి సారించడం దానిష్ ప్రత్యేకత. బ్రేకింగ్ స్టోరీలో మానవీయ కోణాన్ని ఆవిష్కరించడమే తనకు ఎక్కువ ఆనందాన్ని ఇస్తుందని అనేవాడాయన. తాను వెళ్లలేని ప్రాంతం నుంచి తీసిన వార్తాచిత్రాన్ని చూసి అక్కడి స్థితిని అనుభూతి చెందాలని కోరుకునే సామాన్యుడి కోసం తాను ఫోటోలు తీస్తానని వినమ్రంగా చేప్పేవాడు. 2020లో పౌరసత్వం సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన ప్రదర్శనలలో పోలీసులు చూస్తుండగానే ఒక టీనేజ్ మితవాద కార్యకర్త నిరసనకారులపై పిస్టల్ గురిపెట్టడాన్ని దానిష్ ఫోటో తీయగా దానిని ‘మోస్ట్ డిఫైనింగ్ ఫొటో ఆఫ్ ది టైమ్స్‌’గా రాయిటర్స్ సంస్థ అభివర్ణించింది. ఢిల్లీ-–ఉత్తరప్రదేశ్ సరిహద్దు ప్రాంతంలోని ఘజియాబాద్‌లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన జరిగే ప్రదేశానికి రైతులు దుప్పట్లు, చాదర్లు రవాణా చేసే చిత్రాలు సంచలనంగా మారాయి. కొవిడ్ సెకండ్ వేవ్‌లో ఢిల్లీలోని లోక్‌నాయక్ జయప్రకాశ్ ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక అల్లాడుతున్న రోగుల దయనీయస్థితిని చూపే ఫొటో అందరినీ ఆలోచనలో కదిలించివేసింది. ఢిల్లీలో మూకుమ్మడి శవదహనాలను నిర్వహిస్తున్న స్మశానవాటికను దానిష్ తన కెమేరాలో బంధించాడు. తన సొంత పట్టణంలో ఇటువంటి హృదయవిదారక సంఘటనలకు తాను సాక్షిగా ఉంటానని కలలో కూడా ఊహించలేదని ఆయన బాధపడ్డాడు. 


నేషనల్ జియోగ్రాఫిక్ మ్యాగజైన్, న్యూయార్క్ టైమ్స్, ది గార్డియన్, ది వాషింగ్టన్ పోస్ట్, వాల్ స్ట్రీట్ జర్నల్, టైమ్ మ్యాగజైన్, ఫోర్బ్స్ వంటి అంతర్జాతీయ పత్రికలలో దానిష్ చాయచిత్రాలు ప్రచురితమవడం ఆయన ప్రతిభకు తార్కాణం. ఒక నిబద్ధతగల ఫొటో జర్నలిస్టుగా ఎంతటి సవాళ్ళనైనా ఎదుర్కొనేందుకు ఆయన సిద్ధంగా ఉండేవాడు. ప్రభుత్వాలు పట్టించుకోని అతి సామాన్యప్రజల దైన్య పరిస్థితులను దానిష్ నిర్భయంగా ప్రపంచం ముందుంచాడు. భారతదేశంలోని వాస్తవ పరిస్థితులను ప్రజలకు, ప్రపంచానికి తెలియజేయడంలో ఏ బెదిరింపులకు లొంగకుండా దానిష్ తన కర్తవ్యాన్ని నిర్వర్తించాడు. అఫ్ఘానిస్థాన్‌లో దుర్భర పరిస్థితులను కవరేజి చేయడానికి వెళ్ళిన దానిష్ అక్కడ, అఫ్ఘాన్ భద్రతాదళాలకు, తాలిబాన్‌లకు మధ్య జరిగిన కాల్పులలో మరణించాడు. ఆయన మరణం కొందరికి ఖేదం కావచ్చు, మరికొందరికి మోదం కావచ్చు. కాని, సత్యాన్ని ప్రపంచం ముందుంచడానికి పడ్డ తాపత్రయానికి ఆయన ఛాయాచిత్రాలే సజీవసాక్షాలు.

జయప్రకాశ్ అంకం

అసిస్టెంట్ ప్రొఫెసర్


Updated Date - 2021-07-21T08:43:17+05:30 IST