ప్రమాదకరంగా కల్వర్టులు

ABN , First Publish Date - 2020-10-31T06:15:45+05:30 IST

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ప్రధానరోడ్లు దెబ్బతిన్నాయి. కల్వర్టులు తెగిపోయి ప్రమాదకరంగా మారగా సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని వాహనదారులు

ప్రమాదకరంగా కల్వర్టులు

ఇటీవల కురిసిన వర్షాలకు కుంగి తెగిపోయిన కల్వర్టులు 

మరమ్మతులు శూన్యం

ఇబ్బందులు పడుతున్న వాహనదారులు

శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్న స్థానికులు 

పట్టించుకోని అధికారులు


శామీర్‌పేట రూరల్‌: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ప్రధానరోడ్లు దెబ్బతిన్నాయి. కల్వర్టులు తెగిపోయి ప్రమాదకరంగా మారగా సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని వాహనదారులు  తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాత్కాలిక మరమ్మతులు చేపట్టి చేతులు దులుపేసుకుంటున్నారని వాపోతున్నారు. శామీర్‌పేట మండలంలోని తుర్కపల్లి పారిశ్రామికవాడకు వెళ్లే బైపా్‌సరోడ్డులో ఉన్న కల్వర్టు వర్షానికి దెబ్బతిని సగం రోడ్డు మేర కుంగిపోయింది. దీంతో ప్రయాణికులు, వాహనదారులు ప్రమాదకరంగా మారిన రోడ్డు నుంచి వెళ్లాలంటే జంకుతున్నారు. కనీసం అక్కడ బారికేడ్లు, సూచికబోర్డులు కూడా పెట్టలేదు. దీంతో రాత్రి వేళల్లో ప్రమాదాల బారిన పడుతున్నారు. అలాగే తుర్కపల్లి నుంచి కొల్తూర్‌ వెళ్లే రోడ్డులో కల్వర్టు వద్ద పెద్ద గుంత పడింది. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని స్థానికులు వాపోతున్నారు. కొల్తూర్‌ నుంచి అనంతారం వెళ్లే రోడ్డులో మూలమలుపు వద్ద వర్షానికి రోడ్డు కింది భాగం మట్టి కొట్టుకుపోయి ప్రమాదకరంగా మారింది.


సేఫ్టీ దిమ్మెలు లేక రోడ్డు అంచు వెంబడి వెళ్తే కయ్యలో పడే అవకాశాలు ఉన్నాయి. అలియాబాద్‌ నుంచి మలక్‌పేట వెళ్లే దారిలో సెంట్‌జోసెఫ్‌ వద్ద రోడ్డు గుంతలు పడి ప్రమాదకరంగా మారింది. అప్పుడప్పుడు కంకర పోసి వదిలిపెడుతున్నారు. శాశ్వత మరమ్మతులు చేపట్టడం లేదని వాహనదారులు మండిపడుతున్నారు. జగ్గంగూడ నుంచి కొల్తూర్‌ వెళ్లే రోడ్డు మటం చెరువు వద్ద రోడ్డు తెగిపోయింది. కల్వర్టు కుంగిపోయింది. దీంతో ప్రజాప్రతినిధులు తాత్కాలికంగా ఆరోడ్డులో మట్టిపోసి వదిలేశారు. శాశ్వతంగా కల్వర్టును నిర్మించడానికి ఇప్పటివరకు ఎలాంటి ప్రతిపాదనలు సిద్ధం చేయలేదని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇటీవల కురిసిన వర్షాలకు పాడైపోయిన రోడ్లు, కల్వర్టులను బాగు చేయాలని కోరుతున్నారు. 


శాశ్వత నిర్మాణాలు చేపట్టాలి..

కురిసిన వర్షాలకు మఠం చెరువు వద్ద ఉన్న కల్వర్టు తెగిపోయింది. దీంతో తాత్కాలికంగా మట్టిపోసిన వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. అనంతారం వెళ్లే రోడ్డు మూలమలుపు ప్రమాదకరంగా మారింది. అక్కడ సేఫ్టీ దిమ్మెలు ఏర్పాటు చేసి కల్వర్టును నిర్మించాలి. మళ్లీ వర్షాలు కురుస్తే ఇబ్బందులు ఎదురవుతాయి. అధికారులు స్పందించి నిర్మాణాలు చేపట్టాలి. - కె.బాలకృష్ణ, కొల్తూర్‌ గ్రామస్థుడు

Updated Date - 2020-10-31T06:15:45+05:30 IST