డేంజర్.. దేవదత్
ABN , First Publish Date - 2020-09-22T09:44:19+05:30 IST
ఆర్‌సీబీ ఓపెనర్ దేవదత్ పడిక్కళ్ బ్యాటింగ్ తీరు చూస్తే అతనాడుతోంది తొలి మ్యాచ్ అంటే ఎవరూ నమ్మరేమో..
దుబాయ్:ఆర్‌సీబీ ఓపెనర్ దేవదత్ పడిక్కళ్ బ్యాటింగ్ తీరు చూస్తే అతనాడుతోంది తొలి మ్యాచ్ అంటే ఎవరూ నమ్మరేమో.. నిజానికి దేవదత్ పుట్టకముందే తనకు కొడుకు పుడితే కచ్చితంగా క్రికెటర్‌ను చేస్తానని అతడి తల్లి అనుకుందట.. ఆమె ఆకాంక్షకు అనుగుణంగానే అతను క్రికెటరయ్యాడు. దాదాపు 6 అడుగుల ఈ కర్ణాటక యువ స్టార్.. క్రీజులో ఉన్నంత సేపు తన స్ట్రోక్ ప్లేతో రైజర్స్ బౌలర్లను చెడుగుడు ఆడేశాడు.
రెండో ఓవర్‌లోనే రెండు ఫోర్లు బాదిన ఈ లెఫ్ట్ హ్యాండర్ ఆ తర్వాత నటరాజన్ ఓవర్లో మూడు ఫోర్లతో చెలరేగాడు. ఆఫ్ సైడ్.. ఆన్ సైడ్ షాట్లతో పాటు చక్కటి డ్రైవ్స్‌తో బౌండరీల వరద పారించాడు. మరో ఎండ్‌లో విధ్వంసకర ఆటగాడు ఫించ్ ఉన్నప్పటికీ అతడిని నామమాత్రం చేస్తూ తనే బాధ్యత తీసుకున్నాడు. ఈ క్రమంలో అతను 36 బంతుల్లోనే అర్ధసెంచరీని పూర్తి చేస్తూ.. భారత్ భవిష్యత్ తార అనిపించుకున్నాడు.