డేంజర్‌ బెల్స్‌

ABN , First Publish Date - 2022-01-19T05:52:45+05:30 IST

కరోనా థర్డ్‌ వేవ్‌ వేగంగా వ్యాపిస్తున్నది. ఓమైక్రాన్‌తోపాటు పాత వేరియంట్లు సోకి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

డేంజర్‌ బెల్స్‌

 - కరోనా బారిన 258 మంది

- రెట్టింపయిన పాజిటివ్‌ కేసులు

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

కరోనా థర్డ్‌ వేవ్‌ వేగంగా వ్యాపిస్తున్నది. ఓమైక్రాన్‌తోపాటు పాత వేరియంట్లు సోకి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సంక్రాంతి పండగ తర్వాత పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. పండగ, జాతరలు,  ప్రజలు ఏమాత్రం జాగ్రత్తలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో మళ్లీ కరోనా కోరలు చాస్తున్నది. జిల్లాలో మంగళవారం ఒకేరోజు 258 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. ఈ నెల 16న 110, 17న 117 మందికి పాజిటివ్‌ వచ్చింది. ఒక రోజు వ్యవధిలోనే 18న కేసులు రెట్టింపయ్యాయి. 

- 11.8కి చేరిన పాజిటివిటీ రేటు

మంగళవారం 2,184 మంది పరీక్షలు చేయించుకోగా 258 మందికి వైరస్‌ సోకినట్లు నిర్ధారించారు. జిల్లా సగటు పాజిటివిటి రేటు 11.8 గా నమోదవుతున్నది. జిల్లాలో 18 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉండగా 11 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో కరోనా కేసులు నమోదయ్యాయి. కరీంనగర్‌లోని ఆరు అర్బన్‌ హెల్త్‌ సెంటర్ల పరిధిలోనూ పెద్దమొత్తంలో కరోనా పాజిటివ్‌ కేసులు వస్తున్నాయి. 

- మంగళవారం కరీంనగర్‌లో 566 మందికి ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షలు నిర్వహించగా 71 మందికి వ్యాధి నిర్ధారణ అయింది. పాజిటివిటి రేటు 12.5 గా ఉంది. 

- గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, హుజూరాబాద్‌ ఏరియా ఆసుపత్రి, జమ్మికుంట కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో 1109 మందికి ర్యాపిడ్‌ టెస్టులు నిర్వహించగా 66 మంది వైరస్‌ బారిన పడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో పాజిటివిటీ రేటు 5.95 గా నమోదవుతున్నది.

- జిల్లా ఆసుపత్రి, చల్మెడ, ప్రతిమ ప్రైవేట్‌ వైద్య కళాశాలలు, విజయ డయాగ్నోస్టిక్‌ సెంటర్‌లో నిర్వహిస్తున్న ఆర్టీపీసీఆర్‌ పరీక్షల్లో పాజిటివిటీ రేటు ఈ నెల 18న 23.7 శాతంగా ఉన్నది. 509 మంది ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేయించుకోగా 121 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. మొత్తంగా జిల్లాలో పాజిటివిటీ రేటు 11.8కి పెరిగింది. 

- బాధితుల సంఖ్య పెరిగే అవకాశం

వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఈ నెలాఖరు వరకు బాధితుల సంఖ్య పెద్దఎత్తున పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఒమైక్రాన్‌ సోకినా పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని, ఇంటి వద్ద ఉంటూ ప్రభుత్వం సరఫరా చేస్తున్న కిట్‌లోని మందులు వాడుతూ స్వస్థత పొందవచ్చని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఆక్సిజన్‌ అవసరం పడినవారు, ఇతర వ్యాధులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నవారు  మాత్రమే ఆసుపత్రుల్లో చేరితే సరిపోతుందని వైద్య నిపుణులు అంటున్నారు. కేసుల వ్యాప్తి తీవ్రంగా ఉన్నా మరణాలు నమోదు కాకపోవడంతో ఊరట కలిగిస్తోంది. జిల్లా ఆసుపత్రితోపాటు ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో కూడా ఇన్‌ పేషెంట్లుగా చేరుతున్న వారి సంఖ్య నామమాత్రంగానే ఉంది. 

- నిబంధనలు పాటిస్తేనే..

ప్రజలు సమూహాలుగా ఉండవద్దని, సభలు, సమావేశాలు, జాతరలు, ఇతర ఫంక్షన్లకు హాజరు కావడాన్ని తగ్గించుకొని భౌతిక దూరం పాటిస్తూ విధిగా మాస్కులను ధరిస్తే వ్యాధి వ్యాప్తిని అరికట్టవచ్చని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. అయినా ప్రజలు ఈ విషయాలను ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ఉంటున్న కారణంగానే వ్యాధి వ్యాప్తి రోజు రోజుకు పెరిగిపోతున్నది. జిల్లాలో వ్యాక్సినేషన్‌  కూడా వేగవంతంగా జరుగుతున్నది. మొదటి డోస్‌ వ్యాక్సినేషన్‌ ఇప్పటికే 102.3 శాతానికి చేరుకున్నది. రెండోడోస్‌ 93.9 శాతం మందికి ఇచ్చారు. 15 నుంచి 18 సంవత్సరాలలోపు వయస్సు ఉన్న పిల్లలు 33,798 మంది ఉండగా 66.3 శాతం మందికి వ్యాక్సినేషన్‌ చేశారు. త్వరలోనే ఈ వయస్సు పిల్లందరికి వంద శాతం వ్యాక్సినేషన్‌ పూర్తి చేసేందుకు వైద్య, ఆరోగ్యశాఖ కృషి చేస్తున్నది. ప్రజలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంతోనే కరోనా వ్యాప్తిని అరికట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. 

Updated Date - 2022-01-19T05:52:45+05:30 IST