సిక్కోలులో డేంజర్‌ బెల్స్‌!

ABN , First Publish Date - 2020-06-04T09:18:30+05:30 IST

జిల్లాలో కరోనా మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తోందా? లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా జిల్లాకు చేరుకున్న వలస ..

సిక్కోలులో డేంజర్‌ బెల్స్‌!

వలస జీవులకు కరోనా కలవరం

జిల్లాలో 151కి చేరిన పాజిటివ్స్‌

తాజాగా మూడు కేసులు నమోదు


(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి):జిల్లాలో కరోనా మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తోందా? లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా జిల్లాకు చేరుకున్న వలస జీవుల్లో అధికంగా ‘కరోనా పాజిటివ్‌’ నమోదవుతోంది. ఇప్పటివరకూ 151 పాజిటివ్‌ కేసులు నమోదవడంతో జిల్లావాసుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వలసజీవులు కావడంతో.. ఇప్పటికే వారంతా క్వారంటైన్‌, పునరావాస కేంద్రాల్లో ఉన్నారని... ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని యంత్రాంగం చెబుతోంది. జిల్లాకు వేలాది సంఖ్యలో వలసజీవులు తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు ఎక్కడికక్కడ వారిని కట్టడి చేసి.. క్వారంటైన్‌, పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. వారికి చురుగ్గా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకూ 54,800 మందికి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 151 మందికి ‘పాజిటివ్‌’ లక్షణాలు బయటపడ్డాయి. తాజాగా బుధవారం ముగ్గురికి ప్రాథమిక పరీక్షల్లో పాజిటివ్‌ లక్షణాలు కనిపించాయి.


శ్రీకాకుళం, గార, జలుమూరు మండలాల్లోని కార్వంటైన్‌ కేంద్రాల్లో ఉన్న ఒక్కొక్కరికి పాజిటివ్‌ లక్షణాలు బయటపడ్డాయని వైద్యాధికారి ఒకరు తెలిపారు.  ‘పాజిటివ్‌’ లక్షణాలు ఉన్న వారందరికీ రాగోలులోని జెమ్స్‌, శ్రీకాకుళంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చికిత్సలు అందజేస్తున్నారు. ఇప్పటివరకు 24 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు.  శ్రీకాకుళం, పాతపట్నానికి చెందిన ఏడుగురికి మ్రాతమే ‘పాజిటివ్‌’ రాగా, మిగిలిన కేసులన్నీ వలసజీవులే కావడం గమనార్హం. ఇతర ప్రాంతాల నుంచి జిల్లాకు చేరుకుంటున్న వలసజీవులను ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా క్వారంటైన్‌, సహాయక కేంద్రాలకు తరలిస్తున్నామని అధికారులు పేర్కొంటున్నారు. వారిలోనే అధికంగా ‘పాజిటివ్‌’ లక్షణాలు నమోదవుతున్నాయని.. వెంటనే వారికి చికిత్స అందజేస్తున్నామని తెలిపారు. దీనివల్ల స్థానిక ప్రజలకు వైరస్‌ సోకే అవకాశం లేదని స్పష్టం చేస్తున్నారు.   


స్వేచ్ఛా విహారం హానికరం...

జిల్లాలో లాక్‌డౌన్‌ సడలింపులను కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన సడలింపులతో స్వేచ్ఛగా విహరిస్తున్నారు. మాస్క్‌లు విధిగా ధరించాలి.. శానిటైజర్లు వాడాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నా, అవేమీ పట్టడంలేదు. ఆటోలు, ప్రైవేటే వాహనాల్లో పరిమిత సంఖ్యలోనే ప్రయాణించాలనే నిబంధనలు గాలికొదిలేస్తున్నారు. షాపింగ్‌మాల్స్‌, పెద్ద వ్యాపార సముదాయాల వద్ద భౌతిక దూరం పాటించిన పాపాన పోలేదు. అలాగే మరికొన్ని వ్యాపార సంస్థలు శానిటైజర్లు కూడా ఏర్పాటు చేయడం లేదు. ప్రభుత్వ నిర్ణయం మేరకు జిల్లాలో ఎక్కడా లాక్‌డౌన్‌ అమలవుతున్న పరిస్థితులు లేవు. రాత్రి వేళ సైతం వాహనాలు దూసుకుపోతున్నాయి. కర్ఫ్యూ ఎక్కడా కానరావడం లేదు. ఈనెల 8వ తేదీ నుంచి మరిన్ని సడలింపులు వర్తించనున్నాయి. ఈ నేపథ్యంలో ఇదే పరిస్థితి కొనసాగితే వైరస్‌ ముప్పు తప్పదని అధికారులు హెచ్చరిస్తున్నారు.  ఎవరికి వారు స్వీయ నియంత్రణ పాటించి.. కరోనా కట్టడిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిస్తున్నారు. 

Updated Date - 2020-06-04T09:18:30+05:30 IST