‘పురం’లో డేంజర్‌ బెల్‌

ABN , First Publish Date - 2022-01-22T05:20:03+05:30 IST

హిందూపురంలో కరోనా డేంజర్‌ బెల్‌ మోగిస్తుంది. రోజువారి కేసుల సంఖ్యలో పదుల నుంచి వందలకు చేరింది.

‘పురం’లో డేంజర్‌ బెల్‌

- రోజు రోజుకు పెరుగుతున్న పాజిటివ్‌ కేసులు 

- టీటీడీ కల్యాణమండపంలో కొవిడ్‌ కేర్‌ సెంటర్‌

హిందూపురం టౌన్, జనవరి 21: హిందూపురంలో కరోనా డేంజర్‌ బెల్‌ మోగిస్తుంది. రోజువారి కేసుల సంఖ్యలో పదుల నుంచి వందలకు చేరింది. గతంతో పోల్చితే కాస్త భిన్నంగా, అత్యధికంగా, వేగంగా వైరస్‌ వ్యాప్తి చెందుతుందనడంతో పట్టణంలో ఆందోళన నెలకొంది. మొదటి, సెకెండ్‌వేవ్‌లో వచ్చిన వేరియంట్లకంటే ప్రస్తుతం వేగంగా విస్తరిస్తున్నట్లు వైద్యులు అంచనా వేస్తున్నారు. థర్డ్‌వేవ్‌లో కొవిడ్‌ ఇంతటి విస్తృతికి (ఒమైక్రాన) కారణమని నిపుణులు అంచనావేస్తున్నారు. ఇది మాత్రమే అత్యంత వేగంగా వ్యాప్తిచెందే గుణాన్ని కలిగి ఉందని వైద్యులు పేర్కొంటున్నారు. హిందూపురంలో జనవరి 1న ఒక్క కేసుతో ప్రారంభమై శుక్రవారం నాటికి 119 అత్యధిక కేసులుగా నమోదైంది. హిందూపురం పట్టణంలో జనవరి 1న 1కేసు, 3న 1కేసు, ఈనెల7న 3కేసులు, 8న 6కేసులు, 9న 5కేసులు, 11న 12కేసులు, 12న 14కేసులు, 13న 12కేసులు, 15న 20కేసులు, 16, 18 తేదీల్లో 12కేసులు చొప్పున, 19న 41కేసులు, 20న 93కేసులు, 21న 119కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా హిందూపురం రూరల్‌ మండలంలో జనవరి 4నుంచి ఇప్పటి వరకు 43కేసులు నమోదయ్యాయి. వైరస్‌ సోకిన వారు అధిక శాతం ఇంటిలో ఉండే వైద్యం పొందుతున్నారు. ఇదిలా ఉంటే కొంతమంది సెకెండ్‌ డోస్‌ వేసుకున్నవారికి కూడా వైరస్‌ రావడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది ఇళ్లవద్ద ఉండి చికిత్స పొందుతున్నవారికి తహసీల్దార్‌ శ్రీనివాసులు, మునిసిపల్‌ కమిషనర్‌ వెంకటేశ్వర్‌రావు, డా. ఆనంద్‌బాబు వైరస్‌ సోకిన వారికి ధైర్యం చెబుతున్నారు. వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేస్తున్నారు. హోమ్‌ ఐసొలేషనలో ఉన్నవారు అధిక శాతం మంది వివిధ పనుల కోసం పట్టణంలోకి వస్తుండటంతో వైరస్‌ పెరిగే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. కొవిడ్‌ వచ్చిన వారు ఇంటి బయటికి రాకూడదని సూచిస్తున్నా పట్టించుకోలేదు. 

కొవిడ్‌ కేర్‌సెంటర్‌గా కల్యాణ మండపం 

హిందూపురంలో రోజు రోజుకు కొవిడ్‌ కేసులు పెరుగుతుండటంతో ఉన్నతాధికారుల ఆదేశాలతో తహసీల్దార్‌, మునిసిపల్‌ కమిషనర్‌లు ముందు జాగ్రత్తగా టీటీడీ కళ్యాణ మండపాన్ని కొవిడ్‌ కేర్‌ సెంటర్‌గా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇక్కడ శనివారం నుంచి అడ్మిట్‌లు ప్రారంభం అవుతాయన్నారు. అయితే స్వల్ప లక్షణాలున్నవారు హోమ్‌ ఐసొలేషనలో ఉండాలని, కొంత ఎక్కువగా ఉన్నవారికి టీటీడీ కళ్యాణమండపం, లక్షణాలు అత్యధికంగా ఉంటే ప్రభుత్వ ఆసుపత్రి కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో వైద్యం అందిస్తారన్నారు. 

పెనుకొండలో 117కు చేరిన కేసులు 

పెనుకొండ రూరల్‌, జనవరి 21: కరోన మహమ్మారి మూడోదశ రూపంలో తరుముకొస్తోంది. పెనుకొండ పట్టణ, గ్రామీణ ప్రాంతంలో వారం రోజుల్లో కేసుల సంఖ్య 117కు చేరింది. గురువారం నాటికి 63కేసులు నమోదుకాగా తాజాగా శుక్రవారం మరో 54కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు తెలిపారు. కరోన వ్యాప్తి రోజు రోజుకు విస్తరిస్తుండటంతో గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2022-01-22T05:20:03+05:30 IST