మంచిర్యాల జిల్లా జోరుగా నకిలీ పత్తి విత్తనాల దందా

ABN , First Publish Date - 2022-04-26T04:07:14+05:30 IST

వానాకాలంలో పత్తి సీజన్‌ సమీపిస్తున్న తరుణంలో నకిలీ విత్తనాల ఆగమనం ఆందోళన రేకెత్తి స్తోంది. అమాయకపు రైతులే లక్ష్యంగా స్మగ్లర్లు పెద్ద మొత్తంలో నిషేదిత పత్తి విత్తనాలు సరఫరా చేస్తున్నారు.

మంచిర్యాల జిల్లా జోరుగా నకిలీ పత్తి విత్తనాల దందా
తాండూరులో ఫర్టిలైజర్‌ షాపును సీజ్‌ చేస్తున్న అధికారులు (ఫైల్‌)

- జిల్లా వ్యాప్తంగా కోట్ల రూపాయల వ్యాపారం

- వివిధ రాష్ట్రాల నుంచి జిల్లాకు చేరుతున్న సరుకు

- సీజన్‌ ప్రారంభానికి ముందే దిగుమతి 

మంచిర్యాల, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): వానాకాలంలో పత్తి సీజన్‌ సమీపిస్తున్న తరుణంలో నకిలీ విత్తనాల ఆగమనం ఆందోళన రేకెత్తి స్తోంది. అమాయకపు రైతులే లక్ష్యంగా స్మగ్లర్లు పెద్ద మొత్తంలో నిషేదిత పత్తి విత్తనాలు సరఫరా చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా యేటా కోట్ల రూపాయల నకిలీ దందా జోరుగా సాగుతోంది. గత ఏడాది వానాకాలంలో రైతులు జిల్లాలో లక్ష, 72వేల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. ధర సైతం పత్తికి భారీగా ఉండడంతో ఈ ఏడాది సాగు విస్తీర్ణం సుమా రు 2లక్షల పైచిలుకు ఎకరాల్లో ఉంటుందని అధికారులు అంచనా వేస్తు న్నారు. పత్తి సాగు విస్తీర్ణం పెరుగుతున్నందన అక్రమార్కులు రైతులకు నకిలీ విత్తనాలు అంటగట్టే ప్రయత్నాన్ని మూడు నెలల ముందునుంచే ప్రారంభించారు. పోలీసుల కల్లు గప్పి వివిధ రాష్ట్రాల నుంచి స్మగ్లర్లు గుట్టు చప్పుడు కాకుండా పెద్ద మొత్తంలో నకిలీ సరుకును జిల్లాకు తర లిస్తున్నారు. విడి విత్తనాలు, బట్ట సంచుల్లో ప్యాక్‌ చేసిన నకిలీ విత్తనాల ను నేరుగా రైతులకు అంటగడుతున్నారు. జిల్లాలోని కొందరు డీలర్లతో సత్సంబంధాలు నెరుపుతున్న ముఠా సభ్యులు తక్కువ ధరకు వారికి సరఫరా చేస్తున్నారు. లైసెన్స్‌డ్‌ డీలర్ల కంటే బయటి వ్యక్తుల వద్ద విత్తనాలు చవకగా లభిస్తుండడంతో రైతులు వాటిని కొనేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. పైగా నకిలీ విత్తనాలు అసలు వాటిని పోలి ఉండడంతో రైతులు మొగ్గు చూపుతున్నారు. నకిలీ పత్తి విత్తనాల సరఫరాను నియంత్రించేందుకు పోలీసులు దాడులు చేస్తున్నా అక్రమ దందా కొనసాగుతుండడం గమనార్హం. నకిలీ విత్తనాల దుష్ప్రభా వం, వాటి వల్ల కలిగే నష్టాలపై వ్యవసాయ, పోలీసులు శాఖలు సంయుక్తంగా సమావేశాలు ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

- వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి..

ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, కర్ణాటకల నుంచి నకిలీ విత్తనాలను అక్రమార్కులు జిల్లాకు చేర్చుతున్నారు. వానాకాలం సీజన్‌కు రెండు నెలల ముందుగానే నకిలీ పత్తి విత్తనాలను అక్రమంగా పలుచోట్ల నిల్వ చేస్తు న్నారు. ఇతర రాష్ట్రాల నుంచి నకిలీ సరుకు పెద్ద మొత్తంలో దిగుమతి అవుతున్నట్లు పోలీసుల విచారణలో వెలుగు చూసింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, కర్నూలు, ప్రకాశం, నంద్యాల నుంచి పెద్ద మొత్తంలో సరఫరా అవుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆయా ప్రాంతాలకు చెందిన పలువురు వ్యక్తులు నకిలీ పత్తి విత్తనాలను తయారు చేసి, అక్కడి నుంచి అక్రమంగా జిల్లాలోని రైతులకు విక్రయిస్తున్నారు. వీరంతా ఆంరఽధ నుంచి వచ్చి వ్యవసాయం పేరుతో జిల్లాలోని మందమర్రి, బెల్లంపల్లి ప్రాంతాలలో నివాసం ఉంటారు. ఇక్కడి భూములను కౌలుకు తీసుకొని నామ మాత్రంగా వ్యయసాయం చేస్తారు. ఈ క్రమంలో ఇక్కడి విత్తన డీలర్లు, రైతులతో పరిచయాలు పెంచు కుంటారు. వారికి అనుకూలంగా ఉన్న వారితో ముఠాలను ఏర్పాటు చేసుకొని నకిలీ పత్తి విత్తనాలను రవాణా చేస్తారు. గతంలో జిల్లా వ్యాప్తంగా అక్కడక్కడ పోలీసులు జరిపిన దాడుల్లో ఆంధ్ర ప్రాంతానికి చెందిన పలువురు వ్యక్తులు పట్టుబడడమే దీనికి నిదర్శనం. 

- పోలీసుల దాడుల్లో..

పోలీసుల దాడుల్లో అధికంగా పట్టుబడుతున్న వాటిలో హెచ్‌టీ కాటన్‌ (హెర్బిసైడ్‌ టాలరెన్స్‌) అధికంగా ఉంటున్నాయి. ఇవి జన్యు మార్పిడి చేసిన పత్తి విత్తనాలుగా వ్యవసాయ అధికారులు, పోలీసులు పేర్కొం టున్నారు. ఈ విత్తనాలు గ్లైఫోసెట్‌ అనే కలుపు మందును తట్టుకుం టాయి. ఈ కలుపు మందు పత్తి పంటను కాకుండా మిగతా అన్ని కలుపు మొక్కలను నాశనం చేస్తుంది. అయితే గ్లైఫోసెట్‌ మందు పర్యావరణానికి హాని కలిగిస్తున్నందున ప్రభుత్వం నిషేధించింది. హెచ్‌టీ కాటన్‌తో పర్యావరణంతోపాటు ప్రాణులపై పడే ప్రభావం అధికంగా ఉన్నప్పటికీ చవకగా లభిస్తున్నందున రైతులు సాగు చేసేందుకు మొగ్గు చూపుతు న్నట్లు తెలుస్తోంది. దీన్ని ఆసరాగా చేసుకున్న ముఠా సభ్యులు పెద్ద మొత్తంలో నిశేషిత విత్తనాలను రవాణా చేస్తున్నారు.

- ఆగని అక్రమ రవాణా..

నకిలీ విత్తనాలు జిల్లాకు చేరుకుంటుండటంతో పోలీసులు దాడులు ప్రారంభించినప్పటికీ అక్రమ రవాణా ఆగడం లేదు. పోలీసుల కళ్లు గప్పి నకిలీ సరుకును జిల్లాకు చేరుస్తున్నారు. గత ఏడాది సీజన్‌కు ముందు జూన్‌ నెలలో పోలీసుల దాడుల్లో పెద్ద మొత్తంలో నకిలీ పత్తి విత్తనాలు పట్టుబడ్డాయి. అప్పటికి నాలుగు నెలల ముందుగానే జిల్లాకు నకిలీ సరుకు చేరుతుండడంపై ధృష్టిసారించిన పోలీసులు పెద్ద మొత్తంలో విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా నకిలీ విత్తనాల సరఫరాలో మొత్తం ఎనిమిది కేసులు నమోదయ్యాయి. ఈ విషయంపై 28 మందిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేశారు. వారి నుంచి 58.60 లక్షల రూపాయల విలువ గల 3,020 కిలోల నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. తాజాగా ఈ నెల 21న జిల్లాలోని కన్నెపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 50 కిలోల నకిలీ పత్తి విత్తనాలు పట్టుపడ్డాయి. అదే రోజు తాండూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 7 కిలోలను పట్టుకున్నారు. భీమిని పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని రాజారం, చిన్నగుడిపేట 61 కిలోలు పట్టుబ డడం గమనార్హం. కాగా 22న తాండూరు మండల కేంద్రంలోని శ్రీలక్ష్మీ ఫర్టిలైజర్‌ షాపులో గడువు ముగిసిన కాంపోస్ట్‌ ఎరువులు లభించినందున వ్యవసాయ అధికారులు సీజ్‌ చేశారు. 

పీడీ యాక్టు నమోదు చేస్తాం..

- అఖిల్‌ మహాజన్‌, మంచిర్యాల డీసీపీ 

ఫర్టిలైజర్‌ షాపుల్లో నకిలీ విత్తనాలు, గైసిల్‌ గడ్డిమందు విక్రయాలు జరిపే వారితోపాటు సరుకు అక్రమ రవాణాకు పాల్పడే వారిపై పీడీ యాక్టు నమోదు చేస్తాం. ప్రభుత్వ సూచనలు, నిబంధనలకు అనుగుణం గా డీలర్లు విక్రయాలు సాగించాలి. నిషేధిత విత్తనాలు వాడే రైతులపైనా చర్యలు తీసుకుంటాం. నకిలీ విత్తనాలు విక్రయించే ముఠా సభ్యుల సమా చారం తెలిస్తే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలి. కలెక్టర్‌ సూచనల మేరకు ప్రత్యేక టీంలు ఏర్పాటు చేశాం. గతంలో అక్రమ రవాణాకు పాల్పడ్డ వారిపై ప్రత్యేక ధృష్టి సారించాం. 

Updated Date - 2022-04-26T04:07:14+05:30 IST