పీఆర్సీ పేరుతో వసూళ్ల దందా

ABN , First Publish Date - 2021-07-20T06:34:27+05:30 IST

ఉద్యోగ, ఉపాధ్యాయులకు పీఆర్సీ అమలులోకి రాగా, పేఫిక్సేషన్‌కు వసూళ్ల దందా ప్రారంభమైంది. ప్రధానంగా ఉపాధ్యాయుల నుంచి కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలు, ఎస్టీవోలు రూ.500 నుంచి రూ.1200 వరకు వసూలు చేస్తున్నారు.

పీఆర్సీ పేరుతో వసూళ్ల దందా

కాంప్లెక్స్‌ హెచ్‌ఎంలు, ఎస్టీవోల మిలాఖత్‌

ఒక్కొక్కరి నుంచి రూ.500 మొదలు రూ.1200 వరకు వసూలు

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి


(ఆంధ్రజ్యోతి ప్రతినిధి,నల్లగొండ) : ఉద్యోగ, ఉపాధ్యాయులకు పీఆర్సీ అమలులోకి రాగా, పేఫిక్సేషన్‌కు వసూళ్ల దందా ప్రారంభమైంది. ప్రధానంగా ఉపాధ్యాయుల నుంచి కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలు, ఎస్టీవోలు రూ.500 నుంచి రూ.1200 వరకు వసూలు చేస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే పీఆర్సీతో వేతనాలు పెరుగుతున్నాయి కదా ఆ మాత్రం ఇవ్వలేరా అని ఎదురుప్రశ్నిస్తున్నారు.


పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని చేసిన ఆందోళనల ఫలితంగా ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఎట్టకేలకు ప్రభుత్వం పీఆర్సీని ప్రకటించింది. జూన్‌ నెల నుంచి కొత్త పీఆర్సీ అమలుకు ఉత్తర్వులు జారీ చేసింది. దానికి అనుగుణంగా జూనియర్‌, సీనియర్‌ అసిస్టెంట్లు వారి శాఖకు చెందిన ఉద్యోగుల సర్వీసుకు మేరకు పే ఫిక్సేషన్‌ చేస్తారు. అయితే వేలాది మంది పనిచేస్తున్న ప్రభుత్వ విద్యా వ్యవస్థలో జూనియర్‌, సీనియర్‌ అసిస్టెంట్లు చాలావరకు లేరు. దీంతో ఆ పనులను కాంప్లెక్స్‌ హెచ్‌ఎంలే చేయాల్సి వస్తోంది. ఇదే అదునుగా భావించిన కాంప్లెక్స్‌ హెచ్‌ఎంలు, సబ్‌ట్రెజరీ అధికారులు వసూళ్ల పర్వానికి శ్రీకారం చుట్టారు. పెరిగిన వేతనాలు వర్తించాలంటే ఉపాధ్యాయులకు సంబంధించిన పేఫిక్సేషన్‌ కాపీలు, బిల్లులను నాలుగు సెట్ల జీరాక్స్‌ తీయాలి. వాటికి స్థానిక ఎంఈవో ప్రొసీడింగ్స్‌ జతచేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత బిల్లులను కాంప్లెక్స్‌ హెచ్‌ఎంలు సబ్‌ ట్రెజరీలో సమర్పించి ఆమోదం పొందేలా చూడాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ నిర్వహణకు ఒక్కో ప్రాంతంలో ఒక్కో ధరను ఖరారు చేశారు. 


రూ.500 నుంచి బేరం

పీఆర్సీకి సంబంధించిన పనులు పూర్తిచేసి సబ్‌ ట్రెజరీల్లో బిల్లుపాస్‌ అయ్యేలా చూసేందుకు ఒక్కో ప్రాంతంలో ఒక్కో రేటు ఖరారు చేశారు. రూ.500 నుంచి బేరం మొదలుపెడుతున్నారు. చందంపేట మండలంలో పీఆర్సీ ప్రొసీడింగ్స్‌ ఎలాంటి ఇబ్బం ది లేకుండా పూర్తిచేసి సబ్‌ట్రెజరీలో ఆమోదం పొందేందుకు ఒక్కో టీచర్‌ నుంచి రూ.1200 వసూలు చేస్తున్నట్టు తెలిసింది. అందులో ఎంఈ వో, కాంప్లెక్స్‌ హెచ్‌ఎం, ఎస్టీవోలకు వాటాలు కేటాయించారు. దేవరకొండలో రూ.600, గుర్రంపోడు లో ఒక్కో టీచర్‌ నుంచి రూ.500, నల్లగొండ మం డలంలోని దోమలపల్లి కాంప్లెక్స్‌లో రూ.500, తిప్ప ర్తి మండలం రాజాపేట కాంప్లెక్స్‌లో రూ.500, నాంపల్లి ఎస్టీవో పరిధిలో రూ.500 వసూలు చేస్తున్నట్టు తెలిసింది. మునుగోడు, చండూరు మండ లం పుల్లెంల కాంప్లెక్స్‌ పరిధిలో రూ.500, సూర్యాపేట జిల్లా మోతె, చివ్వెంల మండలాల్లో రూ.500 లు మొదలు రూ.600 వరకు వసూలు చేస్తున్న ట్టు సమాచారం. యాదాద్రి జిల్లా పోచంపల్లి మం డలంలో రూ.500 తీసుకుంటున్నట్టు తెలిసింది. కాంప్లెక్స్‌ పరిధిలో మానిటరింగ్‌, సమావేశాల నిర్వహణ ఇతరత్రా ఖర్చుల కోసం ప్రభుత్వం ఏటా రూ.43వేలు మంజూరు చేస్తోంది. ఈ ఏడాది ఇప్పటికే కాంప్లెక్స్‌ పరిధిలో నిర్వహణ ఖర్చుల కింద రూ.21వేలు జమయ్యాయి. వీరు స్థానికంగా ఉన్న సిబ్బందిని వినియోగించుకొని క్లరికల్‌ పనులు పూర్తి చేయించాల్సి ఉంటుంది. దీన్ని పక్కన పెట్టి కాంప్లెక్స్‌ హెచ్‌ఎంలు వసూళ్లకు దిగారు. కొన్ని మండలాల్లో ఉపాధ్యాయులే క్లరికల్‌ పనులు, ఎస్టీవో సంబంధిత అధికారులకు లంచాలు ముట్టజెప్పే బాధ్యతను తీసుకోవడం గమనార్హం.


ఎవరూ డబ్బులు చెల్లించవద్దు, ఫిర్యాదు చేస్తే చర్యలు : భిక్షపతి, నల్లగొండ జిల్లా విద్యాశాఖాధికారి

పీఆర్సీ ప్రొసీడింగ్స్‌ తీయడం, ఎస్టీవోల నుంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా బిల్లులు పాసయ్యేలా చూడటం కాంప్లెక్స్‌ హెచ్‌ఎంలు, సంబంధిత ఎంఈవోలదే బాధ్యత. ఏ ఉపాధ్యాయుడు కూడా పీఆర్సీ ప్రొ సీడింగ్స్‌ కోసం డబ్బు ఇవ్వాల్సిన పనిలేదు. ఎవరై నా డబ్బు డిమాండ్‌ చేస్తే నేరుగా నాకు ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదులను పరిశీలించి సంబంధిత అధికారులపై వెంటనే చర్యలు తీసుకుంటాం.


Updated Date - 2021-07-20T06:34:27+05:30 IST