దర్జాగా దందా

ABN , First Publish Date - 2021-10-12T06:18:33+05:30 IST

జిల్లాలో ఆకర్షణీయమైన బహుమతుల పేరిట లక్కీ డ్రాలు, చిట్టీలు, రియల్‌ ఎస్టేట్‌లో స్కీంల పేరిట కొందరు అక్రమార్కులు స్కాములకు పాల్పడుతున్నారు. అమాయక గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఆశ చూపి తక్కువ డబ్బులకే ఎలకా్ట్రనిక్‌ వస్తువులు, వాహనా లు,

దర్జాగా దందా
కామారెడ్డిలో కొత్త బస్టాండ్‌ ముందు ఓ హోటల్‌ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న భాదితులు(ఫైల్‌)

జిల్లాలో ఆగని లక్కీడ్రా స్కీంల నిర్వహణ

చిట్టీలు, లక్కీ డ్రాలు, రియల్‌ ఎస్టేట్‌లలో స్కీంల పేరిట అక్రమార్కుల స్కామ్‌లు

పల్లె ప్రజలను దోచేస్తున్న నిర్వాహకులు

అనుమతుల్లేకుండా నిర్వహణ

ఒక్కో సభ్యుడి నుంచి భారీగా వసూలు

గ్రామాల్లో ఏజెంట్ల ద్వారా స్థానికులకు గాలం

వేలల్లో పోగవుతున్న సభ్యులు.. అందరికీ గిఫ్ట్‌లంటూ నమ్మబలుకుతున్నవైనం

పోలీసులు నిఘా పెడుతున్నా.. వాట్సప్‌ ద్వారా కొనసాగుతున్న తతంగం

కామారెడ్డిలో తరచూ వెలుగుచూస్తున్న అక్రమ స్కీంల వ్యవహారాలు

కామారెడ్డి, అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఆకర్షణీయమైన బహుమతుల  పేరిట లక్కీ డ్రాలు, చిట్టీలు, రియల్‌ ఎస్టేట్‌లో స్కీంల పేరిట కొందరు అక్రమార్కులు స్కాములకు పాల్పడుతున్నారు. అమాయక గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఆశ చూపి తక్కువ డబ్బులకే ఎలకా్ట్రనిక్‌ వస్తువులు, వాహనా లు, బంగారం, ప్లాట్లు, ఇళ్లు ఇస్తామని తక్కువ పెట్టుబడికి రెట్టింపు డబ్బులు ఇస్తామంటూ వల వేస్తున్నారు. వేలాది మంది ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి కోట్లాది రూపాయలతో ఉడాయిస్తున్న సంఘటనలు జిల్లాలో పరి పాటిగా మారింది. జిల్లాలోని పట్టణ పరిధితో పాటు మండల కేంద్రాల్లోనూ అనుమతులు లేకుండా లక్కీడ్రా స్కీంలను నిర్వహిస్తూ.. మోసాలకు పాల్పడుతున్న సంఘటనలు తరుచూ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. జిల్లా కేంద్రంలో ఓ ఎంటర్‌ ప్రైజెస్‌ అనే సంస్థ ఎలాంటి అనుమతి లేకుండా లక్కీడ్రా స్కీంను కొనసాగిస్తోంది. కాగా, దీనికి సంబంధించి ఎలకా్ట్రనిక్‌ వస్తువుల లోడును నిర్వాహకులు ఆదివారం రాత్రి ఓ కల్యాణ మండపంలో దింపుతుండగా టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడులు చేసి పట్టుకోవడమే నిదర్శనం.

సులభ వాయిదా పద్ధతి అంటూ..

లక్కీడ్రా స్కీంలు నిర్వహించే వారు సులభ వాయిదా పద్ద్ధతులపై ఆకర్షణీయమైన వస్తువులను అందజేసే సదుపా యం కల్పిస్తామని నమ్మబలుకుతూ మహిళలను సభ్యులుగా చేర్పిస్తున్నారు. మా కంపెనీలో ప్రతినెలీ పొదుపు చేసి గృహ ఉపయోగ వస్తువులు పొం దాలని పేర్కొంటున్నారు. సభ్యులకు నెలకు కొందరి చొప్పున ప్రతీ సభ్యుడికి  కచ్చితంగా బహుమతులు అందిస్తామంటూ నమ్మక బలు కుతున్నారు. అంతేకాకుడాఓ అందమైన, ఆకర్షణీయమైన బ్రోచర్‌లను ముద్రించి పట్టణ కేంద్రాలతో పాటు గ్రామాల్లోనూ తిరుగుతూ వాటితో స్థానిక ప్రజలకు గాలం వేస్తున్నారు. ఈ స్కీంలో చేరిన సభ్యులను నమ్మించేందుకు నెలకోచోట లాటరీ తీస్తూ.. బ్రోచర్‌లో పేర్కొన్న విధంగా ఒక్కొక్కరికి, ఒకరిద్దరికి బహుమతులు ఇస్తూ మిగితా వారిని తమ వలలోకి లా గుతున్నారు. బ్రోచర్‌ల మీద వారి చిరునామా, కార్యాలయాల వంటి వివరాలు ఉండకుండా జాగ్రత్త పడుతున్నారు. జిల్లాలో నిర్వహించే ఈ స్కీంలకు ఏ శాఖ నుంచి కూడా అనుమతులు ఉండవు. అసలు ప్రభుత్వ శాఖల పరంగా ఈ స్కీంలకు ప్రోత్సాహకం సైతం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. కాని పుట్టగొడుగుల లక్కీడ్రా స్కీంలు వెలుస్తూనే ఉన్నాయి. మున్సిపల్‌, పంచాయతీ శాఖల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా మోసాలకు పాల్పడే లక్కీడ్రా స్కీంలపై పోలీసు శాఖ నిఘా పెట్టాల్సి ఉంది.

వేలాది రూపాయలు వసూళ్లు

‘మీకు తక్కువ టైంలో ఎక్కువ లాభాలను పొందాలని ఉందా? మీ అదృ ష్టాన్ని కేవలం రూ.వెయ్యి నుంచి రూ.2వేలను నెలనెలా చెల్లించి అద్భుతమైన బహుమతులు పొందాలనుందా?’ అంటూ  గ్రామాలలో వారి వారి ఏజెంట్ల ద్వారా స్థానికులను చేర్చుకుంటూ లక్కీడ్రా స్కీంను నిర్వహిస్తున్నారు. ఈస్కీం యొక్క కాలవ్యవధి కొన్ని నెలలుగా నిర్ణయించి మొదట్లో బాగానే బహుమతులు అందిస్తూ.. అమాయక ప్రజలను అన్నిరకాలుగా నమ్మబలికిస్తారు. సభ్యులను చేర్చుకుని సభ్యత్వ రుసుము వసూలు చేస్తారు. సభ్యులుగా చేరిన వారందరికీ డ్రాలో బహుమతులు వస్తాయని నమ్మబలికిస్తారు. ప్రతీనెలా రూ. వేలు వసూలు చేస్తూ.. డ్రాలో వెళ్లని వారికి ఏదో ఒక చిన్నబహుమతి ఇచ్చి పంపుతుంటారు. ఇలా లక్కీడ్రా నిర్వాహకులు ఏజెంట్ల ద్వారా సభ్యులను చేర్పిం చుకుంటున్నారు. ఈస్కీంలో కేవలం స్నేహితులు, బంధువులకు మాత్రమేనని పేర్కొంటూ నిరక్ష్యరాస్యులను ఇందులో చేర్పిస్తున్నారు. అనంతరం గొలుసుకట్టు తరహాలో స్నేహితులు, బంధువులను చేర్పించమని ఒత్తిడి చేస్తున్నారు. ఇలా చేర్పించిన ఓ ఎంటర్‌ప్రైజెస్‌కు చెందిన సంస్థ నిర్వాహకులు డ్రాలో వెళ్లిన బహుమతులు కాని, వారు చెల్లించిన డబ్బులు కాని ఇవ్వకపోవడంతో కామారెడ్డి పట్టణ కేంద్రంలో సదరు నిర్వాహకుడి హోటల్‌ వద్ద నిరసన వ్యక్తం చేసిన ఘటనలు ఇటీవల చోటు చేసుకున్నాయి. దీంతో పోలీసుల నిఘా పెరగడంతో ఆన్‌లైన్‌ ద్వారా లక్కీడ్రా నిర్వహిస్తున్నారు. అయితే ఏజెంట్ల ద్వారా గెలుపొందిన వారికి సమాచారం అందించి వస్తువులను అందజేస్తున్నారనే సమాచారం మేర కు ఆదివారం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడులు చేసి 38 వాషింగ్‌మిషన్‌లను పట్టుకున్నారు. ఈ స్కీంల వ్యవహారంలో ఎక్కువశాతం రాజకీయ నాయకులు, రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులు ఉంటున్నారని సమాచారం.

నష్టపోయేది అమాయక జనమే..

లక్కీడ్రా స్కీంలో ఎక్కువగా నష్టపోయేది అమాయక ప్రజలే. తక్కువ డబ్బు కు లాభసాటిగా ఉండే వస్తువులు బహుమతులుగా వస్తున్నాయంటే ఎవరికైనా ఆశ ఉంటుంది. ఈ అమాయక ప్రజల ఆశనే ఆసరాగా చేసుకుంటూ మోసగాళ్లు లక్కీడ్రా స్కీంల పేరిట ఈ అక్రమ దందాను కొనసాగిస్తున్నారు. లక్కీడ్రా స్కీం ల పేరిట మోసగాళ్ల చేత మోసపోవద్దంటూ పోలీసు శాఖ పదేపదే చెబుతు న్నా.. ప్రజల్లో మాత్రం మార్పు రావడం లేదని, ఏదో ఒక లక్కీడ్రా స్కీంలలో పెట్టుబడులు పెడుతూ మోసపోతూ తమ వద్దకు వస్తు న్నారని ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. కాగా, ఈ ఆదివారం పట్టుబడిన వాషింగ్‌మిషన్‌లకు సం బంధించిన ఎంటర్‌ప్రైజెస్‌ నిర్వాహకులే ఆకర్ష ణీయమైన బహుమతుల పేరిట లక్కీడ్రా స్కీంను నిర్వహిస్తూ వేలమంది సభ్యుల ను చేర్చుకుని రూ.లక్షలో డబ్బులు వసూలు చేసి డ్రా పేరిట మోసం చేయడంతో ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. తమ కష్టార్జితాన్ని వెంటనే చెల్లించాలని, లేదంటే తమకు అం దించాల్సిన బహుమతులు అందిం చాలని డిమాండ్‌ చేశారు. ఎన్నో ఎంటర్‌ప్రైజెస్‌లపై పోలీసులు దాడులు చేసినా.. నిర్వాహకుల్లో   ఎలాంటి మార్పు రావడం లేదని తెలుస్తుంది.

నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటాం

: సోమనాథం, డీఎస్పీ, కామారెడ్డి

కామారెడ్డిలో అక్రమంగా లక్కీ డ్రా స్కీములు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. లక్కీ డ్రా స్కీములను ప్రభుత్వం గతంలోనే నిషేధించింది. ఈ స్కీముల నిర్వహణలో ఎంతటి వారైనా ఉన్న వదలము. ఎవరైనా అక్రమంగా ఇలాంటి స్కీములను నిర్వహిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. మోసపూరిత స్కీములను నమ్మి ప్రజలు మోసపోవద్దు. 

Updated Date - 2021-10-12T06:18:33+05:30 IST