డ్యాన్సులు వేసేంత ఈజీ కాదు రాజకీయమంటే ..?

ABN , First Publish Date - 2021-09-29T06:23:31+05:30 IST

రాజకీయమంటే సినిమాల్లో డ్యాన్సులు వేసినంత ఈజీ కాదన్న విషయాన్ని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ గుర్తించుకోవాలని చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు హెచ్చరించారు.

డ్యాన్సులు వేసేంత ఈజీ కాదు రాజకీయమంటే ..?
మీడియాతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు

ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు


చిత్తూరు, సెప్టెంబరు 28: రాజకీయమంటే సినిమాల్లో డ్యాన్సులు వేసినంత ఈజీ కాదన్న విషయాన్ని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ గుర్తించుకోవాలని చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు హెచ్చరించారు. మంగళవారం చిత్తూరు లక్ష్మీనగర్‌కాలనీలోని వైసీపీ కార్యాలయంలో జనసేనానిపై ఫైర్‌ అయ్యారు. సినిమాలు చేసుకునే పవన్‌.. రాజకీయ పరిపక్వత లేకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సినీ పరిశ్రమపై తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. పోటీచేసిన రెండు నియోజకవర్గాల్లోనూ ప్రజలు ఆయన్ను తిరస్కరించారన్న విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. 175 నియోజకవర్గాల్లో నిలబడిన జనసేన అభ్యర్థుల పేర్లు కూడా తెలియని ఆయన.. సీఎం జగన్‌పై విమర్శలు చేయడం తగదన్నారు. కులాల మధ్య చిచ్చుపెట్టేలా వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. గత ఎన్నికల్లో ఒక్క సీటు గెలిచిన జనసేన పార్టీ ఈసారి అది కూడా గెలవదన్నారు. పవన్‌లాగా రాజకీయాల్లోకి రావడానికి బిచ్చం ఎత్తుకునే పరిస్థితి జగన్‌కు లేదన్నారు. పవన్‌ ఒక సన్యాసి అని.. ఇతరులను విమర్శించడంలో విశేషం ఏముంటుందన్నారు. సినిమా ఫంక్షన్లలో రాజకీయాలు మాట్లాడటాన్ని బట్టి చూస్తే పిచ్చోడి చేతిలో రాయి అన్న చందంగా ఉందన్నారు. జనం లేని జనసేనకు ఆయన అధ్యక్షుడిగా ఉంటున్నారని, ప్యాకేజీల కోసం బీజేపీకి తొత్తుగా.. రోజుకో మాట మాట్లాడుతున్న ఆయన ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని హితవు పలికారు. ఈ సమావేశంలో వైసీపీ నేత ఓఎం రామదాస్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-09-29T06:23:31+05:30 IST