బరువు తగ్గడానికి నిషేధిత పిల్ మింగిన డ్యాన్సర్.. కొన్ని గంటలకే...
ABN , First Publish Date - 2020-02-10T01:59:27+05:30 IST
బరువు తగ్గి స్లిమ్‌గా కనిపించాలని ఓ లేడీ డ్యాన్సర్ పడిన తాపత్రయం చివరకు ఆమె ప్రాణాల మీదకు తెచ్చింది. నిషేధిత డ్రగ్ అని తెలిసినా...
బరువు తగ్గి స్లిమ్‌గా కనిపించాలని ఓ లేడీ డ్యాన్సర్ పడిన తాపత్రయం చివరకు ఆమె ప్రాణాల మీదకు తెచ్చింది. నిషేధిత డ్రగ్ అని తెలిసినా కూడా ఆమె వాడే సాహసం చేయడమే ఇందుకు కారణం. థానేకు చెందిన మేఘన దేవ్‌గడ్కర్(22) వృత్తిరీత్యా డ్యాన్సర్. శరీరాకృతి విషయంలో ఆమె ఎన్నో జాగ్రత్తలు పాటించేది. బొద్దుగా ఉన్న ఆమె రోజూ జిమ్‌కు వెళ్లి బరువు తగ్గేందుకు కసరత్తులు చేసేది. అయినప్పటికీ సంతృప్తి చెందని మేఘన స్లిమ్ అవడానికి నిషేధిత పిల్‌ను మింగింది. సోమవారం సాయంత్రం జిమ్‌లో వర్కవుట్స్ చేసే ముందు ఈ పిల్‌ను వేసుకున్న మేఘన కొద్ది గంటల్లోనే ప్రాణాలు కోల్పోయింది.
ఫర్టిలైజర్స్, రంగులు, పేలుడు పదార్థాల తయారీలో వినియోగించే కెమికల్‌తో ఆ పిల్ తయారైందని.. ఆ పిల్ వేసుకుంటే శరీర ఉష్ణోగ్రత అమాంతం పెరుగుతుందని.. శరీరంలోని కొవ్వును కరిగించే క్రమంలో శరీర ఉష్ణోగ్రత విపరీతంగా పెరుగుతుందని.. ఆ పరిస్థితిలో మనిషి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని వైద్యులు తెలిపారు. అందుకే ఆ పిల్‌ను నిషేధించారని పేర్కొన్నారు. ఆ పిల్ వేసుకున్న కొద్ది గంటల్లోనే వాంతులు, శరీర ఉష్ణోగ్రత పెరగడం, చెమటలు పట్టడం, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయని, మేఘన కూడా ఆ విధంగానే ప్రాణాలు కోల్పోయిందని వివరించారు. మేఘనకు ఆ పిల్ ఎక్కడ నుంచి వచ్చిందన్న దానిపై ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు విచారణ జరుపుతున్నారు. ఆ డ్రగ్ పేరు మార్చి ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నట్లుగా గుర్తించారు. అయితే.. మేఘన ఆన్‌లైన్‌లోనే ఆర్డర్ ఇచ్చిందా లేక ఏదైనా మెడికల్ షాప్‌లో అనధికారికంగా విక్రయిస్తే కొనుక్కుందా అన్న విషయం తెలియాల్సి ఉంది.