వైఎస్‌తో కలిసి సోనియాను కలిశా.. టీడీపీకి రాజీనామా చేయమన్నారు

ABN , First Publish Date - 2020-06-10T22:35:15+05:30 IST

రాష్ట్ర కార్మికశాఖ మంత్రి దానం నాగేందర్‌ తెలంగాణ రాష్ట్ర డిమాండ్‌పై తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లు వెల్లడించారు. ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ ఎండీ వేమూరి రాధాకృష్ణ నిర్వహించే ‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే’లో తన మనోభావాలను అరమరికలు లేకుండా పంచుకున్నారు.

వైఎస్‌తో కలిసి సోనియాను కలిశా.. టీడీపీకి రాజీనామా చేయమన్నారు

వైఎస్ చనిపోయినప్పుడు మూడు నాలుగు రోజులు కోలుకోలేకపోయాను

జగన్ కార్యక్రమాన్ని నేను మొదటి నుంచి వ్యతిరేకించాను

ఇక వినడులే అని వదిలేశాం.. రఘువీరా కూడా చెప్పి చూశారు

దాదాగిరీ చేయకపోతే రాజకీయాల్లో ఉండలేం..

ఎంఐఎంపైనే గెలిచా.. కేసీఆర్‌ ‘దంచండి’ అంటే మేమూ అదే అంటాం

వ్యక్తిగతంగా నేను సమైక్యవాదినే

ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కేలో మంత్రి దానం నాగేందర్‌


రాష్ట్ర కార్మికశాఖ మంత్రి దానం నాగేందర్‌ తెలంగాణ రాష్ట్ర డిమాండ్‌పై తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లు వెల్లడించారు. ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ ఎండీ వేమూరి రాధాకృష్ణ నిర్వహించే ‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే’లో తన మనోభావాలను అరమరికలు లేకుండా పంచుకున్నారు. సమైక్య రాష్ట్రాన్నే కోరుకుంటున్నట్లు నిర్మొహమాటంగా చెప్పారు. రాష్ట్రాన్ని విభజించినా హైదరాబాద్‌ సహా ఇస్తే మాత్రం తమదారి తాము చూసుకుంటామని స్పష్టం చేశారు. 6-02-2012న ఏబీఎన్ ఛానెల్‌లో ప్రసారమయిన ఈ కార్యక్రమ వివరాలు...


ఆర్కే: ఈ మధ్య ‘కాల్పుల విరమణ’ పాటిస్తున్నట్టున్నారు..

దానం నాగేందర్: రాజకీయ పరిస్థితిని బట్టి మేం స్పందించాల్సిఉంటుంది. ప్రజలు ప్రశాంతంగా ఉంటే మాకేమీ పనిలేనట్టే. నేను మాత్రం హైదరాబాద్‌ ప్రజల రక్షకుడుగా ఉండాలనుకుంటా.


ఆర్కే: సీమాంధ్ర ప్రజల విషయంలో కూడా అలాగే అనుకుంటారా?

దానం నాగేందర్: అవును. ఎన్నో ఏళ్లకిందట పిల్లా పాపలతో వారిక్కడికొచ్చారు. పెట్టుబడులు పెట్టారు. 1969 ఉద్యమం తర్వాత 12 ఏళ్లు హైదరాబాద్‌లో ఉంటే నగరవాసులే అనుకున్నారు. అలాంటిది మూడు దశాబ్దాలుగా ఉంటున్నా వారిమీద జులుం చేస్తే ఎట్లా? అలాగైతే తెలంగాణ జిల్లాల నుంచి వచ్చినవారూ ఇక్క స్థానికేతరులే.


ఆర్కే: తెలంగాణవాదంపై కాంగ్రెస్‌లోనే భిన్న వైఖరులున్నాయి కదా..

దానం నాగేందర్: సరైన సమయంలో మేడమ్‌ సోనియా సరైన నిర్ణయం తీసుకుంటారు. అది 2014 కూడా కావొచ్చు!


ఆర్కే: హైదరాబాద్‌ కేంద్రపాలిత ప్రాంతంగా ఉండాలంటారా?

దానం నాగేందర్: ఢిల్లీలాగా కేంద్రపాలిత ప్రాంతంగా ఉండాలని నేను, ముఖేష్‌గౌడ్‌ కోరుకుంటాం. ఈ వాదన కూడా తేవద్దని అధిష్ఠానం చెప్పడంతో ఊరుకున్నాం.


ఆర్కే: మంత్రిగా కాక, వ్యక్తిగతంగా మీ అభిప్రాయమేమిటి?

దానం నాగేందర్: నేనైతే సమైక్య రాష్ట్రమే కోరుకుంటాను.


ఆర్కే: వైఎస్‌ది ‘దేవుడి పాలన’ అన్నారు... ఇపుడు పశ్చాత్తాపం లేదా?

దానం నాగేందర్: కొన్ని పొరపాట్లు నిజమే. కొందరు ఆయన స్నేహాన్ని దుర్వినియోగం చేశారు. అందుకిప్పుడు బదులు చెప్పుకోవలసి వస్తోంది.


ఆర్కే: మంత్రులు బాగున్నారు... ఐఎఎస్‌లను బలిపీఠం ఎక్కిస్తున్నారు. ఎల్వీ సుబ్రమణ్యం కూడా ‘నిందితుడ’య్యారు కదా?

దానం నాగేందర్: నాకూ అదే అనిపిస్తుంది. తప్పులకు అధికారులనే బాధ్యులను చేయడం మంచిది కాదు. ఎల్వీఎస్‌ అవినీతిపరుడు కాదనే నా అభిప్రాయం. మా శాఖలో కార్యదర్శిగా పనిచేసేటపుడు, ఆయన అన్నీ ‘రూల్‌’ ప్రకారమే చేసేవారు. ఓ సారి స్టాఫ్‌ నర్సుల సమస్యలమీద నేను హామీ ఇచ్చాను. కానీ, అది ఆర్థికశాఖతో ముడిపడి ఉందని, సీఎం అనుమతి అవసరమని ఆయన చెప్పారు. నేనెంత చెప్పినా ఫైల్‌లో తాను రాయదలచుకుందే రాశారు. దాంతో నేను పట్టుబట్టగా ఎల్వీగారిని సీఎం బదిలీ చేశారు. తర్వాత ‘అపార్థం చేసుకోకండ’ని చెప్పాను. వైఎస్‌ హయాంలో ఎప్పుడో ‘రొటీన్‌’గా సంతకం చేసి ఉంటారు. కానీ, అలాంటి వారిని రక్షించుకోవాలి. 


ఆర్కే: హైదరాబాద్‌లో దాదాగిరీ చేసినవారే, లీడర్లయ్యారు కదా..

దానం నాగేందర్: ఔను... దాదాగిరీ చేయకపోతే ఉండలేం. అసిఫ్‌నగర్‌లో 70శాతం ముస్లింలున్నా ఎంఐఎంమీద గెలిచాను. దాదాగిరీ తప్పదు.


ఆర్కే: మీరు రాజకీయాల్లోకి ఎలా వచ్చారు?

దానం నాగేందర్: ఖైరతాబాద్‌లో ఉన్నపుడు పి.జనార్దనరెడ్డి, పి.సుధాకర్‌ రెడ్డి, ఆనందకుమార్‌తో తిరిగేవాణ్ని. ఎన్‌ఎస్‌యూఐ నుంచి యూత్‌ కాంగ్రెస్‌లోకి వచ్చాను. రాజీవ్‌గాంధీ ఓసారి మా ఇంటికొచ్చారు. అలా సాన్నిహిత్యం ఏర్పడింది. 89లో టికెట్‌ కోసం ఢిల్లీ వెళ్లాను. రాజీవ్‌ చెప్పినా, చెన్నారెడ్డి మరొకరికి బి ఫారం ఇచ్చారు. అపుడు చెన్నారెడ్డి ఇంటి అద్దాలు పగులగొట్టాను. ఆ తర్వాత బీ ఫారం నాకే ఇచ్చారు. అలా కెరీర్‌ మొదలైంది.


ఆర్కే: గాంధీభవన్‌లో అద్దాలు పగిలినా.. 2004లో టికెట్‌ రాలేదుగా?

దానం నాగేందర్: అది దురదృష్టం. అప్పుడు కూడా డీఎస్‌ ఇంటి దగ్గర గొడవ చేశాను. అద్దాలు పగులగొట్టలేదు లెండి. డీఎస్‌ సర్దిచెప్పారు.


ఆర్కే: ఆ తర్వాత ముద్దులు కూడా పెట్టుకున్నారు కదా?

దానం నాగేందర్: అవును. నేను సారీ చెప్పాను. ఆయన ముద్దు పెట్టాడు.


ఆర్కే: ‘దేశం’లోకి వెళ్లమని రాజశేఖర రెడ్డే సలహా ఇచ్చారా?

దానం నాగేందర్: పార్టీలు వేరైనా దేవేందర్‌ గౌడ్‌తో సాన్నిహిత్యం ఉంది. ఆ పార్టీ వారు కొందరు ఒకరోజు కలిసి వెళ్లారు. ఆ రాత్రి నేనూ కలిసి వచ్చాను. తెల్లారికల్లా నన్ను అభ్యర్థిగా ప్రకటించేశారు (ఇండిపెండెంట్‌గా అయినా గెలిచేవాణ్నే). గెలిచిన తర్వాత గులాంనబీ ఆజాద్‌ ఢిల్లీ పిలిపించారు. వైఎస్‌తోపాటు మేడంను కలిశాను. టీడీపీకి రాజీనామా చేయమన్నారు. చేసేశాను.


ఆర్కే: కాంగ్రెస్‌ తరఫున ఆ తరువాత ఎందుకు ఓడారు? మిమ్మల్ని ఓడించడంలో కీలకపాత్ర ఎవరిది?

దానం నాగేందర్: కర్ణుడి చావుకు ఎన్నో అన్ని కారణాలు... పేరు చెప్పడం బాగుండదు కానీ, మంత్రి కావాలనుకున్న వారే అలా చేశారు.


ఆర్కే: లాఠీ పట్టుకునే నాగేందర్‌లో కూడా లౌక్యం ఉందన్నమాట..

దానం నాగేందర్: నేనూ మనిషినే. ‘కొడతాం..తంతాం’ అనేవాళ్ల మీద తిరగబడ్డాం. హైదరాబాద్‌లో పుట్టి పెరిగినవాళ్లం. మామీదే దౌర్జన్యం చేస్తే ఎందుకు ఊరకుండాల సార్‌!


ఆర్కే: హైదరాబాద్‌ వాళ్లమీద కరీంనగర్‌ వాళ్ల పెత్తనం ఏమిటంటారా?

దానం నాగేందర్: ఔను. కేసీఆర్‌ పుట్టుపూర్వోత్తరాల గురించి అడిగాం. ఇంత వరకు సరైన వివరణ ఇవ్వలేకపోయారు.


ఆర్కే: ఆజాద్‌, దిగ్విజయ్‌తో అంత చనువు ఎలా ఏర్పడింది?

దానం నాగేందర్: పెద్దలు వచ్చినపుడు వారిని బాగా చూసుకుంటా.


ఆర్కే: వైఎస్‌ మరణించినపుడు ఏమనిపించింది?

దానం నాగేందర్: మూడునాలుగు రోజులు కోలుకోలేకపోయాను. ఆయన నన్ను చాలా ప్రేమగా ‘నాగీ’ అని పిలవడం మరచిపోలేను.


ఆర్కే: వైఎస్‌ మీద అంత అభిమానం ఉన్న మీరు జగన్‌తో పోక.. కాంగ్రెస్‌తో ఉన్నారేమి?

దానం నాగేందర్: జగన్‌ తీసుకున్న కార్యక్రమాన్ని మొదటినుంచి నేను వ్యతిరేకించాను. కాకినాడ ఓదార్పు యాత్రలో ఉన్నపుడు ఫోన్‌ చేశాను ‘‘రాహుల్‌ గాంధీని ప్రధాని చేయడం మా నాన్న చిరకాల కోర్కె. అందుకోసం కృషి చేస్తా’’ అని సభలో చెప్పమన్నాను. వినలేదు. ఒకసారి రోశయ్యగారి తరఫున కూడా వెళ్లి చెప్పాను. అపుడు జగన్‌ ‘కొండా సురేఖను కేబినెట్‌లోకి తీసుకొమ్మ’ని డిమాండ్‌ పెట్టాడు. ఇక వినడులే అని వదిలేశాం. రఘువీరా కూడా నాలాగా ప్రయత్నించి ఊరుకున్నాడు. 


ఆర్కే: వీహెచ్‌ ఒక్కరే వైఎస్‌పై చివరివరకు పోరాడారు కదా?

దానం నాగేందర్: హనుమంతరావు మా బంధువు. ‘రాజ్యసభ సీటుకు వైఎస్‌ అ డ్డుపడతాడేమో’ అన్నారు. నేను వైఎస్‌ను కలిస్తే అడ్డుకోనన్నారు.


ఆర్కే: మిమ్మల్ని అనుసరించి ఉండేవారికెలా సాయం చేస్తారు?

దానం నాగేందర్: పదివేలమంది దాకా ఉంటారు. చాలా నిబద్ధతతో, నమ్మకంతో ఉంటారు. కొందరికి ఉద్యోగాల కల్పన, కొందరికి ఆర్థిక సాయం చేస్తాను. ఖర్చు బాగానే ఉంటుంది.


ఆర్కే: ఇంతమందిని పోషించడానికి మీకు ఆర్థిక వనరులేమిటి?

దానం నాగేందర్: కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ ఉంది. వ్యవసాయం ఉంది. వ్యాపారాల్లో భాగస్వామ్యం ఉంది.


ఆర్కే: జగన్‌ కాంగ్రెస్‌లో ఉంటే ఇలా జరిగేదా?

దానం నాగేందర్: అంతా ఆయన దురదృష్టం... స్వయంకృతాపరాధం. కాంగ్రెస్‌లో ఉన్నా సురేష్‌ కల్మాడీకి ఏం జరిగింది? రాజాకు ఏం జరిగింది? జగన్‌ విషయమైనా అంతే...


ఆర్కే: సోనియా, రాహుల్‌మీద జగన్‌ నిత్యం మీడియా దాడులు చేస్తున్నా మీరెవరూ స్పందించరు... భయమా?

దానం నాగేందర్: సోనియామీద, రాహుల్‌ మీద దాడిచేస్తే ఊరుకోలేదు, ఊరుకునేదీ లేదు. అతడు అవినీతి పరుడా? కాదా అని కోర్టులు చూసుకుంటాయి.


ఆర్కే: బాబును అవినీతి పరుడన్నారు కదా?

దానం నాగేందర్: ఆయనను అలా అన్నా తప్పే. అదీ కోర్టులే చూసుకుంటాయి.


ఆర్కే: మంత్రిగా టీఆర్‌ఎస్‌ వాళ్లమీదకు లాఠీలతో వెళ్లడం సరైనదేనా?

దానం నాగేందర్: వాళ్లు పట్టుకుంటే, మేం పట్టుకోకూడదా? కేసీఆర్‌ ‘దంచండి’ అంటే మేమూ అదే అంటాం. మా జోలికి రానంత వరకు సరే, వస్తే మేమూ ‘స్వాగతిస్తాం’... వెనుకాడది లేదు.


ఆర్కే: భూముల విషయంలో ‘దానం’మీదా ఆరోపణలున్నాయి...

దానం నాగేందర్: గతంలో ఎవరైనా మాట వినకపోతే, ‘తన్నండి’ అనేవాళ్లం. అది 2004 వరకు జరిగింది. 2007-08 తరువాత మా తరఫున ఎలాంటి ‘వివాదం’ లేదు. నేను, ముఖేష్‌ ప్రభుత్వంలో ఉన్నాం కనుక, పాతవాటికి స్వస్తి చెప్పాలని గట్టిగా నిర్ణయించుకున్నాం.


ఆర్కే: పోలీస్‌ భూములకు సంబంధించి మిమ్మల్ని వారు కలిశారు...

రోడ్‌ నంబర్‌-12లోనిది పోలీసుల స్థలం కాదు. వారివద్ద కాగితాలేమీ లేవు. ఊరకే బోర్డు పెట్టుకున్నారు. ఆ స్థలం పార్టీ ఆఫీసు కు కావాలనుకున్నాం. స్వార్థం ఉంటే, అక్రమానికి పాల్పడేవాడిని.


ఆర్కే: హైదరాబాద్‌లో ‘పోరీల’తో పటాయించలేదా..

దానం నాగేందర్: అది ఒకప్పుడు ..ఆ రోజుల్లో. అయినా హైదరాబాద్‌ అప్పటిలా లేదు. పబ్‌లు, వ్యాపార సంస్కృతి పెరిగిపోయాయి. ఒక తండ్రిగా మా ఇద్దరమ్మాయిల విషయంలో భయం పుడుతుంది. దీనిపై ఏదో ఒకరోజు నేనే ఒక నిర్ణయం తీసుకుంటా.


ఆర్కే: మీ కోర్కెలు..

దానం నాగేందర్: ప్రశాంతంగా.. సంతోషంగా గడపడం. నా భార్యకు నేను ఎంతో రుణపడి ఉంటా. ఆమెకు ఎంతో ఓపిక. ఇల్లు, సంసారం, పూజ.. ఇంతే ఆమె లోకం.

Updated Date - 2020-06-10T22:35:15+05:30 IST