డామిట్‌ కఽథ అడ్డం తిరిగింది!

ABN , First Publish Date - 2022-08-15T04:53:23+05:30 IST

దారిదోపిడీ కేసు అనేక మలుపులు తిరిగి పోలీసులకు చుక్కలు చూపెడుతోంది. మొదట రూ.లక్ష పోయినట్లుగా బాధితులు చెప్పడం.. ఆ తర్వాత మాట మార్చడంతో మిస్టరీగా మారింది. రెండు నెలల తర్వాత కథ అడ్డం తిరిగి పెద్ద మొత్తమే ఉన్నట్లు బయటపడుతోంది. ఈ కేసులో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించినట్లు అర్థమవుతోంది. చివరకు కేంద్రమంత్రి సిఫార్సుల తర్వాత పరుగులు తీయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

డామిట్‌ కఽథ అడ్డం తిరిగింది!
కారును పరిశీలిస్తున్న పోలీస్‌ అధికారులు(ఫైల్‌)

  దోర్నాల ఘాట్‌లో దారిదోపిడీ కేసులో పోయింది లక్ష కాదు.. రూ.3.50కోట్లు!

  కేంద్ర మంత్రి సిఫార్స్‌తో కదిలిన పోలీసు యంత్రాంగం

 అన్ని కోణాల్లోనూ విచారణ

 హవాలా నగదనే అనుమానం?


ఒంగోలు (క్రైం), ఆగస్టు 14 : దారిదోపిడీ కేసు అనేక మలుపులు తిరిగి పోలీసులకు చుక్కలు చూపెడుతోంది. మొదట రూ.లక్ష పోయినట్లుగా బాధితులు చెప్పడం.. ఆ తర్వాత మాట మార్చడంతో మిస్టరీగా మారింది. రెండు నెలల తర్వాత కథ అడ్డం తిరిగి పెద్ద మొత్తమే ఉన్నట్లు బయటపడుతోంది. ఈ కేసులో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించినట్లు అర్థమవుతోంది. చివరకు కేంద్రమంత్రి సిఫార్సుల తర్వాత పరుగులు తీయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు మూడు నెలల క్రితం దోర్నాల సమీపంలోని ఘాట్‌రోడ్డులో కారులో భారీగా నగదు తరలిస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు దారిదోపిడీకి పాల్పడ్డారు. హవాలా నగదు రూ.3కోట్లకు పైగా దోపిడీ జరిగినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. అప్పట్లో పోలీసులు దీనిపై తర్జనభర్జన పడ్డారు. రెండురోజుల తర్వాత రూ.లక్ష అపహరణకు గురైనట్లు కారుడ్రైవర్‌ వద్ద ఫిర్యాదు తీసుకొని కేసు నమోదు చేశారు. అయితే అప్పట్లో సంఘటనా స్థలాన్ని ఏఎస్పీ(క్రైం), మార్కాపురం డీఎస్పీ, వైపాలెం సీఐ, దోర్నాల ఎస్సై తదితరులు పరిశీలించారు.   సీసీఎస్‌ పోలీసులు సీరియ్‌సగా తీసుకొని విచారణ చేశారు.   కేసు నమోదు విషయంలో మాత్రం మీనమీషాలు లెక్కించారు. బాధితుడు పొంతన లేకుండా సమాధానం చెబుతున్నాడని ప్రచారం చేశారు. అంత హడావుడి చేసిన పోలీసులు రెండు నెలలుగా కేసును అసలు పట్టించుకోలేదు. దీంతో కేంద్రమంత్రి సిఫార్సు చేయడం, డీజీపీ సీరియస్‌ తీసుకోవడంతో జిల్లా పోలీసు యంత్రాగం కదిలింది. దర్యాప్తు ముమ్మరం చేసింది. 


కఽథ మొదటికి వచ్చింది...

ఈ ఏడాది మే 16వ తేదీ అర్ధరాత్రి దోర్నాల సమీపంలో కారును హైజాక్‌ చేశారు. డ్రైవర్‌కు గన్‌ గురిపెట్టి కారును దారి మళ్లించారు. అనంతరం అందులో ఉన్న నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. తర్వాత దోపిడీకి గురైన కారులో ఉన్న ఇరువురు వ్యక్తులు పోలీసులను ఆశ్రయించారు. అయితే వారు పొంతన లేకుండా సమాధానం చెబుతున్నారని కేసు నమోదులో దోర్నాల పోలీసులు జాప్యం చేశారు. చివరకు రూ.లక్ష అపహరణకు గురైనట్లు ఫిర్యాదు తీసుకున్నారు. రెండు నెలల తర్వాత గుజరాత్‌కు చెందిన దినేష్‌ నేరుగా రంగంలోకి దిగాడు. దోర్నాలలో దోపిడీకి గురైన సొత్తు లక్ష కాదు రూ.3.5కోట్లు అని అనడంతో పోలీసులు నివ్వెరపోయారు. అయితే కేంద్రమంత్రి సిఫార్సు ఉండటంతో విధిలేని పరిస్థితుల్లో ఇన్ని రోజులు పక్కనపెట్టిన దోపిడీ కేసు ఫైల్‌ను బయటకు తీశారు. అప్పట్లో లక్ష అపహరణ అని మాత్రమే కేసు నమోదు చేశారు. ప్రస్తుతం బాధితుడు దినేష్‌ రూ.3.50కోట్లు అని అనడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో కేసును మార్పు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. విచారణ ముమ్మరం చేశారు. 


మార్కాపురంలో మకాం వేసిన పోలీసు ఉన్నతాధికారులు

డీజీపీ ఆదేశాల మేరకు పోలీసు ఉన్నతాధికారులు  ప్రత్యేక దృష్టి సారించారు. అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు. ముఖ్యంగా సాంకేతిక సహకారంతో దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలో కొంతమంది అనుమానితులను పిలిపించి అత్యంత గోప్యంగా విచారించారు. కారులో ఉన్న ఇరువురిని మరలా పిలిపించి విచారణ తిరిగి ప్రారంభించారు. అనుమానితుల వాట్సాప్‌ కాల్‌ డేటాను సేకరిస్తున్నారు. కేసు పురోగతిలో ఉందని పోలీసు అధికారులు  చెప్తున్నారు. 


హవాలా డబ్బు అనే అనుమానం

గుజరాత్‌కు చెందిన దినేష్‌ కోల్‌కతాలో కొరియర్‌ వ్యాపారం చేస్తున్నాడు. కర్ణాటకలోని షిమోగాలో ఉన్న తన శాఖకు నగదు తరలిస్తుండగా దోపిడీకి గురైందని పోలీసులకు తెలిపారు. అయితే అంత మొత్తం నగదు తరలించడానికి అనుమతులు ఉన్నాయా.. అసలు ఆ నగదు ఎలా వచ్చింది అనే అంశం చర్చనీయంశంగా మారింది. అయితే నగదు దోపిడీకి గురైన కారులో డబ్బు అమర్చేందుకు ప్రత్యేకంగా ర్యాక్‌ తయారు చేయించి ఉండటం గమనార్హం. కారును ఇలా నగదును తరలించేందుకు వినియోగిస్తారని అనుమానం పోలీసులకు అప్పట్లోనే కలిగింది. ఇంత మొత్తం హవాలా నగదా అనే కోణంలో కూడా పరిశీలన చేస్తున్నారు.

Updated Date - 2022-08-15T04:53:23+05:30 IST