పార్టీని దెబ్బతీస్తున్నాడు!

ABN , First Publish Date - 2022-01-21T05:25:05+05:30 IST

సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు పనితీరు పార్టీకి నష్టం చేకూర్చుతుందని వైసీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎన్‌జీపాడు ఎంపీపీ భర్త కృష్ణారెడ్డి ముఖ్యమంత్రి జగన్‌కు ఫిర్యాదు చేశారు. గురువారం మధ్యాహ్నం తాడేపల్లిలో సీఎంను కృష్ణారెడ్డి కలిశారు. జిల్లా మంత్రి బాలినేనితో పాటు ఆయన సీఎం వద్దకు వెళ్లారు. గతంలో జగన్‌తోపాటు పాదయాత్రలో పాల్గొన్న కృష్ణారెడ్డి ఇటీవల తనకు అపాయింట్‌మెంట్‌ కావాలని సీఎంకు దరఖాస్తు పెట్టుకున్నారు. ఆ మేరకు ఆయన అవకాశం రాగా గురువారం కలిశారు

పార్టీని దెబ్బతీస్తున్నాడు!
సీఎంను కలిసిన వైసీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి


ఎస్‌ఎన్‌పాడు ఎమ్మెల్యేపై సీఎంకు ఫిర్యాదు చేసిన ఆ పార్టీ నేత 

సీఎం సూచనతో వివరాలు తెలుసుకున్న ధనుంజయరెడ్డి

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు పనితీరు పార్టీకి నష్టం చేకూర్చుతుందని వైసీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎన్‌జీపాడు ఎంపీపీ భర్త కృష్ణారెడ్డి ముఖ్యమంత్రి జగన్‌కు ఫిర్యాదు చేశారు. గురువారం మధ్యాహ్నం తాడేపల్లిలో సీఎంను కృష్ణారెడ్డి కలిశారు. జిల్లా మంత్రి బాలినేనితో పాటు ఆయన సీఎం వద్దకు వెళ్లారు. గతంలో జగన్‌తోపాటు పాదయాత్రలో పాల్గొన్న కృష్ణారెడ్డి ఇటీవల తనకు అపాయింట్‌మెంట్‌ కావాలని సీఎంకు దరఖాస్తు పెట్టుకున్నారు. ఆ మేరకు ఆయన అవకాశం రాగా గురువారం కలిశారు. కొద్దినిమిషాల తర్వాత  బాలినేని పక్కకు వెళ్లగా కృష్ణారెడ్డి ఎమ్మెల్యే సుధాకర్‌బాబుపై ఫిర్యాదు చేసినట్లు సమాచారం. మండలంలో అభివృద్ధికి ఏ మాత్రం సహకరించకపోగా నాయకులు, కార్యకర్తల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారని చెప్పినట్లు తెలిసింది. అంతేకాక నియోజకవర్గంలో  ఎమ్మెల్యే అవినీతి వ్యవహారాలు పెరిగిపోయాయని తెలిపినట్లు  సమాచారం. ఆ సమయంలో సీఎం జగన్‌ ఐఏఎస్‌ అధికారి ధనుంజయరెడ్డిని పిలిచి కృష్ణారెడ్డి చెప్పేవి వినండి అని ఆదేశించినట్లు తెలిసింది. అనంతరం ధనుంజయరెడ్డితో పలు అంశాలను ప్రస్తావిస్తూ పార్టీ పరిస్థితి మరింత దిగజారకముందే అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపినట్లు సమాచారం. ఆ సందర్భంగా కొంత సమాచారాన్ని ఆధారాలతో ఆయనకు ఇచ్చినట్లు తెలిసింది. తదనంతరం ఆయన గతంలో పార్టీ కోసం కష్టపడిన తనకు కూడా పదవి ఇవ్వాలని కోరారు. అయితే సీఎం నీ భార్య ఎంపీపీ అయ్యారు కదా అని అన్నట్లు సమాచారం. ఈ విషయమై కృష్ణారెడ్డిని ప్రశ్నించగా తాను మండల అభివృద్ధికి చేయూతనివ్వాలని మాత్రమే సీఎంను కోరానని తెలిపారు. ఎమ్మెల్యేతో ఇబ్బందులు ఉన్నమాట నిజమైనా తానేమీ ప్రస్తావించలేదని, పార్టీలోని నాయకులు అందరూ పనితీరుపై సీఎం వద్ద సమాచారం ఉందని వ్యాఖ్యానించారు. కాగా బుధవారం తన శాఖల సమీక్ష సందర్భంగా మంత్రి బాలినేని సీఎంని కలిశారు. తిరిగి గురువారం మధ్యాహ్నం కూడా ఆయన సీఎంను కలవటం కొంతసేపు ఏకాతంగా మాట్లాడటం విశేషం. పర్చూరు, ఎస్‌ఎన్‌పాడు, దర్శి, గిద్దలూరు తదితర నియోజకవర్గాల్లో పార్టీ వ్యవహారాలు, నాయకుల మధ్య విభేదాలు వారి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం. 



Updated Date - 2022-01-21T05:25:05+05:30 IST