దెబ్బతిన్న రోడ్లు.. మునిగిన పైర్లు

ABN , First Publish Date - 2022-08-09T06:50:02+05:30 IST

రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు సోమవారం గరిడేపల్లి మండలంలోని గడ్డిపల్లి గ్రామం వద్ద గరిడేపల్లి, దురాజ్‌పల్లి వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న గుంతలో ట్రాక్టర్‌, కూలీలతో వెళుతున్న ఓ వాహనం దిగబడింది.

దెబ్బతిన్న రోడ్లు.. మునిగిన పైర్లు
మోతెలోపాలేరు వాగు పొంగడంతో నీటమునిగిన ఉర్లుగొండలోని పైర్లు

ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌, ఆగస్టు 8: రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు సోమవారం గరిడేపల్లి మండలంలోని గడ్డిపల్లి గ్రామం వద్ద గరిడేపల్లి, దురాజ్‌పల్లి వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న గుంతలో ట్రాక్టర్‌, కూలీలతో వెళుతున్న ఓ వాహనం దిగబడింది. ఈ రోడ్డులో ప్రయాణానికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 

- మునగాల మండలం ముకుందాపురంలో ఆరు నెలల క్రితం నిర్మిం చిన సీసీ రోడ్డు నాసిరకంగా ఉందని ఆ గ్రామస్థులు తెలిపారు. దీనిపై అధికారులు పూర్తి విచారణ చేయించాలని ఆ గ్రామస్థులు కోరారు.  చిన్నపాటి వర్షం వచ్చినా ఐదో వార్డులో ఓ వీధి  పూర్తిగా బురదమయంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఆర్‌అండ్‌బీ ఏఈ శివకుమార్‌ మాట్లాడుతూ రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీ వ్యవస్థలు లేనందున రోడ్డుపై ఇళ్ల నుంచి వచ్చే మురుగు నీరు పారినందున రోడ్డులో గుంత ఏర్పడిందని, ఎక్స్‌కవేటర్‌సాయంతో నీటిని తొలగించి రోడ్డుపై ఉన్న గుంతను పూడ్చామన్నారు.  దురాజ్‌పల్లి, గరిడేపల్లి వెళ్లే రహదారి పనులను  త్వరలో పనులను  ప్రారంభిస్తామన్నారు. 

- అకాల వర్షంతో పాటు  పైనుంచి ఎస్సారెస్పీ కాల్వల ద్వారా వస్తున్న వరద నీటికి మోతె మండలంలోని చెరువులు, కుంటలు నిండి వస్తున్న వరదతో వరి పొలాలు మునిగాయి.  ఉర్లుగొండ, నర్సింహాపురం గ్రామాల మధ్యలో పాలేరు వాగు బ్రిడ్జికి వరద పెరగడంతో సమీపంలో నాట్లు వేసిన 400 ఎకరాలు పొలాలు మునిగాయి. నామవరం పెద్ద చెరువు అలుగు క్రింద 100 ఎకరాలు  నీటిలో మునిగాయి.  తమకు పరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు. 

- వర్షాలకు జిల్లాలో అధ్వానంగా మారిన రోడ్లకు మరమ్మతు చేయాలని   మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి కోరారు. చివ్వెంల మండలంలోని దంతాలపల్లి రోడ్డులో ఉన్న గాయంవారిగూడెం స్టేజీ వద్ద బురదమయంగా మారిన రోడ్డును ఆయన పరిశీలించారు. అదే సమయంలో స్కూటీపై వెళుతున్న ఓ యువతి రోడ్డు గోతిలో పడింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధ్వానంగా మారిన రోడ్లకు వెంటనే మరమ్మతు చేయనట్లయితే కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామన్నారు. కార్యక్రమంలో వీరన్ననాయక్‌, కృష్ణ, కలకొండ సంజీవ, శ్రీను, వాసు, నగేష్‌, రాములు, పాల్గొన్నారు.







Updated Date - 2022-08-09T06:50:02+05:30 IST