కన్నీటి వాన..

ABN , First Publish Date - 2020-10-15T06:48:35+05:30 IST

తొలకరిలో మురిపించిన వాన, ఇప్పుడు అన్నదాతను ఏడిపిస్తోంది. కుండపోతగా కురుస్తూ అన్ని పంటలను సర్వనాశనం చేస్తోంది. అతివృష్టి ధాటికి 30శాతం

కన్నీటి వాన..

పొంగిపొర్లుతున్న వాగులు, చెరువులు

పలుచోట్ల జలదిగ్బంధంలో గ్రామాలు

లక్షల ఎకరాల్లో వివిధ పంటలకు నష్టం

నేలకొరిగిన వరి... వరదల్లో పత్తిచేలు

తెలంగాణను వదిలిన వాయు‘గండం’!

కర్ణాటక, మహారాష్ట్రల వైపు పయనం

అతివృష్టికి రాష్ట్రం అతలాకుతలం..

పెట్టుబడి కూడా చేతికి రాని పరిస్థితి

వరదల్లో పత్తిచేలు.. పత్తికాయల్లో మొలకలు

మిర్చి, కూరగాయల పంటలకూ నష్టం


నిన్నటిదాకా పచ్చగా కళకళలాడిన పంటలు వరదల్లో మునిగి.. జీవం కోల్పోయాయి!! చేతికొస్తున్న దశలో వరి పంట నేలకొరిగింది. మరికొన్ని చోట్ల వరద తీవ్రతకు పొలాల్లో ఇసుక మేటలు వేసింది. ఇంకొన్నిచోట్ల కోసిన వరి మెదలు, నిండా మునిగాయి. ఇంకొన్నిచోట్ల ఆరబోసిన ధాన్యమూ నీళ్లపాలైంది. పత్తిచేలలోకి నీరు చేరింది. పదన పట్టి తెల్లబంగారం నల్లగా మారిపోయింది. కాసిన పత్తి కాయల్లో విత్తులు మొలకెత్తుతున్నాయి. చక్కని పూతతో కీలకదశలో ఉన్న కంది పంటకు  పూత రాలుతోంది. మిగిలిన ఆ కొద్ది పూతకు పురుగు పడుతోంది.  మిర్చి, మినుములు, మొక్కజొన్న, కూరగాయల  పంటలదీ ఇదే పరిస్థితి. ఇవన్నీ చూసి రైతన్న గుండె చెరువైంది. 


(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

తొలకరిలో మురిపించిన వాన, ఇప్పుడు అన్నదాతను ఏడిపిస్తోంది. కుండపోతగా కురుస్తూ అన్ని పంటలను సర్వనాశనం చేస్తోంది. అతివృష్టి ధాటికి 30శాతం దిగుబడి కూడా అనుమానమేనని.. పెట్టిన పెట్టుబడి చేతికొచ్చే పరిస్థితి లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. సాఽధారణంగా పత్తి సాగుకు రూ.25వేల నుంచి రూ.30 వేల దాకా పెట్టుబడి కోసం ఖర్చవుతుంది. ఎకరాకు 12 నుంచి 15 క్వింటాళ్ల దాకా దిగుబడి వస్తే రైతులకు లాభాలు ఉంటాయి. అకాల వర్షాల కారణంగా ఎకరానికి 2-3 క్వింటాళ్ల దిగుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో 20వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. నాగర్‌కర్నూల్‌, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్‌ నియోజకవర్గాలలో దాదాపు 5 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగైతే చాలా చోట్ల తీవ్ర నష్టం జరిగింది. మహబూబ్‌నగర్‌ జిల్లాలో 1.20 లక్షల ఎకరాల్లో పత్తి సాగైతే,  80 వేల ఎకరాల పంటకు నష్టం వాటిల్లింది. జిల్లాలో  15 వేల ఎకరాల్లో వరి పంటకు నష్టం జరిగింది.


నారాయణపేట  జిల్లాలో 40 వేల ఎకరాల్లో పంటలకు నష్టం జరగ్గా రూ.2 కోట్లకు పైగానే ఆస్తి నష్టం సంభవించింది.  కరీంనగర్‌ జిల్లాలో 25,438 ఎకరాల్లో వరి, 5348 ఎకరాల్లో పత్తిపంట, 741 ఎకరాల్లో మినుము పంటకు నష్టం వాటిల్లింది. జగిత్యాల జిల్లాలో  20 వేల ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. సిరిసిల్ల జిల్లాలో 30 వేల ఎకరాల వరకు వరి, 20 వేల ఎకరాల వరకు పత్తి పంటలకు నష్టం వాటిల్లింది. ఖమ్మం జిల్లాలో 75,364ఎకరాలు, భద్రాద్రి జిల్లాలో 8,313ఎకరాల్లో వివిధ పంటలు దెబ్బతిన్నాయి.  ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 3వేల ఎకరాల్లో వరి, మరో  3వేల ఎకరాల్లో పత్తి పంటకు నష్టం వాటిల్లింది. వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో  9,417 ఎకరాల్లో వరి, 2,503 ఎకరాల్లో పత్తి ధ్వంసమైంది. 


సాగర్‌ ఎడమకాలువకు బుంగ

నాగార్జునసాగర్‌ ఎడమకాలువకు ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్‌గూడెం సమీపంలోని ఇన్‌ఫాల్‌ కేనాల్‌కు చిన్న బుంగ పడింది. దీంతో అధికారులు నీటిసరఫరాను నిలిపేశారు.  బుంగ పెద్దది కాకుండా ఎస్కేప్‌ లాకులు ఎత్తి నీటిని దిగువకు వదలడంతో ఆయకట్టులోని పంటలు నీటమునిగాయి. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. 


భూదాన్‌పోచంపల్లి సమీపంలోని కల్వర్టు కొత్తగూడెం నుంచి పోచంపల్లికి వెళుతున్న ఆర్టీసీ బస్సు వరదనీటిలో చిక్కుకుపోయింది. బస్సులోని 40మందిని డీఆర్‌ఎఫ్‌ బృందాలు, స్థానికులు రక్షించగా, పోచంపల్లికి చెందిన పెద్దమ్మల మైసమ్మ(42), భోగ వైష్ణవి వరదనీటిలో కొట్టుకుపోగా, పోచంపల్లి సమీపంలోని మూసీ కాలువలో  మృతదేహాలు లభించాయి.  భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి వద్ద భువనగిరి-చిట్యాల రహదారిపై మంగళవారం రాత్రి ఐదుగురు గల్లంతుకాగా, భరత్‌ అనే యువకుడు మృతి చెందాడు. మరో నలుగురు క్షేమంగా బయటపడ్డారు. మేడ్చల్‌ జిల్లా గగన్‌పహాడ్‌ వద్ద బెంగుళూరు జాతీయ రహదారిపై వాహనాలు కొట్టుకుపోయాయి. ఇక్కడ మూడు మృతదేహాలు లభ్యమయ్యాయి.  


అమ్మో.. పట్టుతప్పితే..!  బిడ్డ కోసం తండ్రి సాహసం

గుండాల, అక్టోబరు 14: పసికందుకు టీకా వేయించాలి. దవాఖానకు తీసుకెళ్లాలి. మరోదారి లేదు. ఉప్పొంగుతున్న మల్లన్నవాగు ఉధృతిలో అడుగు పెట్టాల్సిందే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలోని నర్సాపురం తండాకు చెందిన మాలోత్‌ బిక్షపతికి 45రోజుల క్రితం పండంటి మగబిడ్డ పుట్టాడు. టీకా వేయించేందుకు గుండాల పీహెచ్‌సీకి తీసుకెళ్లాలి. దీంతో కొడుకు కోసం తండ్రి ఇలా సాహసం చేయక తప్పలేదు. తాత్కాలిక వంతెన కొట్టుకపోవడంతో.. బిడ్డను చేతులపై ఎత్తుకుని పైపులపై, ఇనుప కమ్మెలపై అత్యంత ప్రమాదకర స్థితిలో వాగు దాటాడు.  



పాపం జీవాలు 

జడివానకు పలుచోట్ల జీవాలు మృతిచెందాయి. కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం తుజాల్‌పూర్‌లో చెట్లు కూలి ఓ గేదె మృతిచెందింది.   యాదాద్రి జిల్లా జిల్లావ్యాప్తంగా 42 సంఘటనల్లో 174 మూగ జీవాలు వరదపాటుకు మృత్యువాతపడ్డాయి.  సిద్దిపేట జిల్లా ములుగు మండలం జప్తిసింగర్‌ పల్లిలో ఓ పౌల్ర్టీఫాంలోకి వర్షపు నీళ్లు చేరడంతో రూ.3 లక్షల విలువ చేసే కోళ్లు చనిపోయాయి.  మేడ్చల్‌ జిల్లాలో 2050 పశువులు, కోళ్లు చనిపోయాయి.  



ఇళ్లు నేలమట్టం

కామారెడ్డి జిల్లాలో 94 ఇళ్లు పాక్షికంగా, మూడు ఇళ్లు పూర్తిగా కూలిపోయాయి. నాగర్‌కర్నూల్‌ జిల్లా వ్యాప్తంగా 103 ఇళ్లు వర్షానికి దెబ్బతిన్నట్లు అధికారులు ప్రాథమిక నివేదికను సిద్ధం చేశారు. మెదక్‌ జిల్లాలో సుమారు 350 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో  మూడు ఇళ్లు కూలిపోయాయి. మహబూబాబాద్‌ జిల్లాలో 5 ఇళ్లు కూలిపోయాయి.  మేడ్చల్‌ జిల్లాలో 61 ఇళ్లు పూర్తిగా ఽకూలిపోగా 960 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి.  వికారాబాద్‌ జిల్లాలో 209 ఇళ్లు పాక్షికంగా కూలిపోయాయి. 


రికార్డు స్థాయిలో మూసీ  

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నాగార్జునసాగర్‌ తర్వాత రెండో పెద్దదైన మూసీ ప్రాజెక్టుకు బుధవారం రికార్డు స్థాయిలో వరద పోటెత్తింది. 1983 సంవత్సరంలో వచ్చిన 2.5 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఇప్పటి వరకూ ఈ ప్రాజెక్టుకు రికార్డు ఇన్‌ఫ్లోగా ఉంది. బుధవారం తెల్లవారుజామున ఒక్కసారిగా లక్షా 83వేల క్యూసెక్కుల వరద వచ్చింది. ఇది క్రమంగా పెరిగి బుధవారం ఉదయానికి రెండు లక్షల క్యూసెక్కులు దాటింది. అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్టు 11 క్రస్టుగేట్లు, రెండు రెగ్యులేటరీ గేట్లను 15అడుగుల మేర ఎత్తి 1,61,199 క్యూసెక్కుల నీటిని దిగువ మూసీకి విడుదల చేశారు. ప్రాజెక్టు నీటిమట్టం 647అడుగులకు చేరింది. దీంతో సూర్యాపేట జిల్లాలో మూసీకట్టకు నాలుగు అడుగుల మేర గండి పెట్టి నీటిని దిగువకు వదిలారు. మంత్రి జగదీ్‌షరెడ్డి ప్రాజెక్టును సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. 


లోతట్టు ప్రాంతాలు జలమయం

ఖమ్మం జిల్లాలో మున్నేరు 19 అడుగుల వద్ద ప్రవహిస్తోంది. తమ్మిలేరు, కట్టలేరు, ఆకేరు కూడా ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పలుచోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.  మున్నేరు చప్టాపై నుంచి ప్రవహిస్తోంది. సత్తుపల్లి మండలంలోని బేతుపల్లి ఎడమకాలవకు గండిపడడంతో వరిపొలాల్లోకి ఇసుక మేటలు వేశాయి.  ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్‌గూడెం సమీపంలోని నాగార్జునసాగర్‌ ఎడమకాలువకు బుంగ పడింది.  మహబూబాబాద్‌ జిల్లాలో తొర్రూరు-గుర్తూర్‌ మధ్య ఈగుదల వాగు ఉధృతంగా పొంగి ప్రవహిస్తుండడంతో తొర్రూరు- నర్సంపేట మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. హైదరాబాద్‌- విజయవాడ రహదారిపై కొత్తగూడెంవద్ద బ్రిడ్జి కోతకు గురికావడంతో ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. మంత్రి జగదీ్‌షరెడ్డి సూర్యాపేటకు వెళుతూ ట్రాఫిక్‌లో గంటపాటు చిక్కుకుపోయారు. యాదాద్రి జిల్లాలో 119 ట్రాన్స్‌ఫార్మర్లు, 33 కేవీ లైన్లలో 5, 11 కేవీ లైన్లలో 421, ఎల్‌టీ లైన్లలో 129 విద్యుత్‌ స్తంభాలు నేలకూలాయి. సింగూరు ప్రాజెక్టు పూర్తిగా నిండటంతో  ఐదు గేట్లు తెరిచి నీటిని దిగువకు విడుదల చేశారు.  


మట్టి మిద్దె కూలి.. 

మాయదారి వాన నిండు ప్రాణాలను బలిగొంటోంది.  హైదరాబాద్‌ మినహా రాష్ట్రవ్యాప్తంగా వేర్వేరు చోట్ల బుధవారం 22మంది మృతిచెందారు. నాగర్‌కర్నూల్‌ రూరల్‌ మండలం కుమ్మెరలో మట్టి మిద్దె కూలి ఇంట్లోని ముగ్గురు మృతిచెందారు. మృతులు కొండా హన్మంతురెడ్డి (70), ఆయన భార్య అనసూయమ్మ (55), మనుమడు హర్షవర్దన్‌ రెడ్డి (12). కామారెడ్డిలో ట్రాన్స్‌ఫార్మర్‌ మరమ్మతు చేసేందుకు వెళ్లిన ముత్యం (50) అనే వ్యక్తి విద్యుదాఘాతంతో ప్రాణాలు విడిచాడు. గాంఽధారి మండలంలో ఈతకు వెళ్లి శ్రీనివాస్‌ (28) అనే యువకుడు మృతి చెందాడు. జనగామ జిల్లా చెన్నూరులో జూనియర్‌ లైన్‌మన్‌ గొల్లపల్లి మధు (23) విద్యుదాఘాతంతో మృతి చెందాడు. వరదలతో యాదాద్రి భువనగిరి జిల్లాలో వేర్వేరు చోట్ల వాగులు దాటుతూ నలుగురు మృత్యువాతపడ్డారు.

Updated Date - 2020-10-15T06:48:35+05:30 IST