కేఆర్‌ఎంబీ పరిధిపై.. కేంద్రం తీరుతో రాష్ట్రానికి నష్టం

ABN , First Publish Date - 2021-04-13T09:53:39+05:30 IST

కృష్ణా నదిపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నిర్మించిన ప్రాజెక్టులన్నిటినీ నోటిఫై చేస్తూ పర్యవేక్షణాధికారాన్ని కేఆర్‌ఎంబీకి కట్టబెట్టేందుకు కేంద్రం సిద్ధమవుతోందని ‘ఇక సీమ ఎడారే’ శీర్షికన సోమవారం ‘ఆంధ్రజ్యోతి’

కేఆర్‌ఎంబీ పరిధిపై.. కేంద్రం తీరుతో రాష్ట్రానికి నష్టం

సాగునీటి సంఘాల డిమాండ్‌


అమరావతి, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నదిపై అనుమతులు లేకుండా నిర్మిస్తున్న పాలమూరు-రంగారెడ్డి, డిండి, కల్వకుర్తి, భక్తరామదాసు, మిషన్‌ భగీరథ తదితర 17 ప్రాజెక్టులను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) పర్యవేక్షణ పరిధిలోకి ఏకపక్షంగా చేర్చితే .. ఆంధ్రప్రదేశ్‌కు కృష్ణా జలాలు వచ్చే పరిస్థితే ఉండదని సాగునీటి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా కేంద్ర జలశక్తి, హోం శాఖలు నిర్ణయం తీసుకుని కేఆర్‌ఎంబీ పరిధిని ప్రకటించేస్తే.. రాష్ట్రానికి ఇక కృష్ణా జలాలే రావని స్పష్టం చేస్తున్నాయి.


అత్యంత సంక్లిష్టమైన, జటిలమైన ఈ సమస్యపై రాష్ట్రాభిప్రాయాన్ని తెలియజేసేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో జల వనరుల శాఖ బృందం సమావేశం కావాలని రాష్ట్ర సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య అధ్యక్షుడు ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు సూచించారు. కేంద్రం వైఖరిని తెలుసుకునేందుకు హోం, జలశక్తి శాఖలకు తక్షణమే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ లేఖ రాయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న  ప్రాజెక్టులు, నీటి కేటాయింపులు మినహా కొత్త ప్రాజెక్టుల జోలికి వెళ్లవద్దంటూ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయాలని కోరారు. కృష్ణా నదిపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు నిర్మించిన ప్రాజెక్టులను నోటిఫై చేస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంటే.. వెంటనే బిల్లు సిద్ధమై.. పార్లమెంటు ఆమోదం పొంది.. గెజిట్‌ విడుదలైపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఒకసారి గెజిట్‌ విడుదలైతే అక్రమ ప్రాజెక్టులన్నిటికీ నీటి కేటాయింపులు చేయాలని కృష్ణా జలాల ట్రైబ్యునల్‌పై తెలంగాణ ఒత్తిడి పెంచుతుందని అంటున్నారు. అదే జరిగితే దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు నీళ్లు రావడమే దుర్లభమవుతుందని హెచ్చరిస్తున్నారు. దీనికి తోడు గోదావరిపై పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తున్నందున.. కృష్ణా జలాల్లో 45 టీఎంసీల వాటా ఇవ్వాల్సిందేనని ఆ రాష్ట్రం పట్టుబడుతుందని అంటున్నారు.


ఏం జరుగుతోంది?.. ‘ఆంధ్రజ్యోతి’ కథనంపై సీఎం ఆరా 

కృష్ణా నదిపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నిర్మించిన ప్రాజెక్టులన్నిటినీ నోటిఫై చేస్తూ పర్యవేక్షణాధికారాన్ని కేఆర్‌ఎంబీకి కట్టబెట్టేందుకు కేంద్రం సిద్ధమవుతోందని ‘ఇక సీమ ఎడారే’ శీర్షికన సోమవారం ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన కథనంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి స్పందించారు. ఏం జరుగుతోందంటూ జల వనరుల శాఖ అధికారుల వద్ద ఆరా తీశారు. వారు కూడా ఢిల్లీలో ఏం జరుగుతోందో తెలుసుకునేందుకు ప్రయత్నించారు. గతంలో జరిగిన పలు సమావేశాల్లో తెలంగాణ సర్కారు అనుమతులు లేకుండా నిర్మిస్తున్న ప్రాజెక్టులను కొత్తవిగానే పరిగణించి జలశక్తి శాఖ డీపీఆర్‌లను కోరిందని వారు సీఎం దృష్టికి తీసుకెళ్లారు.

Updated Date - 2021-04-13T09:53:39+05:30 IST