వర్గీకరణ చౌరస్తాలో దళితులు

ABN , First Publish Date - 2022-10-04T06:08:29+05:30 IST

అస్పృశ్య కులాల మధ్య హెచ్చుతగ్గులు శతాబ్దాలుగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలలో మాల, మాదిగలు, మహారాష్ట్రలో మహర్, మాంగ్‌లు, ఉత్తర భారతావనిలో చామర్లు, చామర్లేతరులు ఇందుకొక ఉదాహరణ...

వర్గీకరణ చౌరస్తాలో దళితులు

అస్పృశ్య కులాల మధ్య హెచ్చుతగ్గులు శతాబ్దాలుగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలలో మాల, మాదిగలు, మహారాష్ట్రలో మహర్, మాంగ్‌లు, ఉత్తర భారతావనిలో చామర్లు, చామర్లేతరులు ఇందుకొక ఉదాహరణ. మిగతా హిందూ సమాజం వీరందరినీ అంటరానివారుగా పరిగణిస్తున్నప్పటికీ, తమ సామాజిక సముదాయంలో అగ్రస్థానం కోసం వారిలో మొదటి నుంచీ తీవ్ర పోటీ ఉంది. రాజ్యాంగ పరిభాషలో ‘షెడ్యూల్డు కులాలు’గా పరిగణన పొందుతోన్న అంటరాని కులాలు మొత్తంగా 6748 ఉన్నట్టు మొదటి అంచనా. అయితే క్షేత్ర స్థాయి పరిశీలనల ద్వారా ఆ సంఖ్య 4635 అని నిర్ధారించారు.


భారత రాజ్యాంగ నిర్దిష్ట హామీలను దృష్టిలో ఉంచుకుని అస్పృశ్య కులాలన్నిటినీ ‘షెడ్యూల్డు కులాలు’ అనే ఏకైక సామాజికవర్గంగా పిలుస్తున్నారు. అస్పృశ్యులను ఇతర హిందువులతో సమానంగా చూడాలనే డిమాండ్‌తో తెలుగు ప్రాంతాలలో 1917లోనే ప్రారంభమైన ఆది ఆంధ్ర ఉద్యమం మాల-–మాదిగ వర్గాల మధ్య అంతర్గత జగడాలను నివారించలేకపోయింది. బ్రిటిష్ వారి పాలనలో ఉన్న ఆంధ్ర ప్రాంతంలో మాలలు మాదిగల కంటే అధిక సంఖ్యలో ఉండగా నిజాం నవాబు పాలనలోని తెలంగాణలో మాదిగలు మాలల కంటే అధిక సంఖ్యలో ఉన్నారు. క్రైస్తవ మిషనరీలు ఆంధ్ర ప్రాంతంలోని మాలలకు ఉచిత విద్యా సదుపాయాలు కల్పించారు. మద్రాసు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆంధ్ర మాలల సంక్షేమానికి తోడ్పాటు నందించింది. తెలంగాణలో ఇటువంటి సంక్షేమ, ప్రగతిశీల కార్యక్రమాలు కొరవడ్డాయి. ఫలితంగా తెలంగాణ మాదిగలు తమ ఆంధ్ర మాల సహోదరులకంటే వెనుకబడిపోయారు. మాలలు అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పార్టీలలో కొన్ని కీలక పదవులను స్వాయత్తం చేసుకోగలిగారు. విద్యాపరంగా మాదిగల కంటే మెరుగ్గా ఉండడంతో ప్రభుత్వ ఉద్యోగాలను వారే అధికంగా పొందగలిగారు. 


షెడ్యూల్డు కులాల మధ్య వ్యత్యాసాలు ఎన్నికల్లో అంబేడ్కర్ జయాపజయాలను సైతం ప్రభావితం చేశాయి. 1952 సార్వత్రక ఎన్నికలలో అంబేడ్కర్ తన సొంత ప్రైవేట్ కార్యదర్శి ఎఎస్ కజ్రోల్కర్ చేతుల్లో ఓడిపోయారు. చామర్, మోచెగా కూడా పిలవబడే ఛాంబహర్ ఉప కులానికి చెందిన కజ్రోల్కర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అంబేడ్కర్‌పై పోటీ చేసి గెలుపొందారు. షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ అభ్యర్థిగా సోలాపూర్ ఎస్సీ రిజర్‌్వ్డ నియోజకవర్గంలో పోటీ చేసి గెలుపొందిన పిఎన్ రాజ్‌భోజ్ కూడా ఛాంబహర్ ఉపకులస్తుడే. మాంగ్, ఛాంబహర్ల మద్దతు కొరవడిన కారణంగానే అంబేడ్కర్ ఎన్నికలలో ఓడిపోయారు. అస్పృశ్యకులాలు సమైక్యంగా ఉన్నట్టయితే అంబేడ్కర్‌ను ఏ శక్తి కూడా జయించగలిగేది కాదు. ఓటుబ్యాంకు రాజకీయాలు ఎస్సీలలో చీలికలకు దారితీస్తున్నాయి. 1990 దశకంలో నాటి అవిభక్త ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ పేరిట మాల, మాదిగల మధ్య చీలికలు సృష్టించారు. మంత్రి కడియం శ్రీహరి, మంద కృష్ణ మాదిగ సహకారాన్ని పొందారు. వర్గీకరణ అంశాన్ని లేవనెత్తిన వారు టిఎన్ సదాలక్ష్మి. 1994 ఆగస్టులో సికింద్రాబాద్ జింఖానా మైదానంలో జరిగిన ‘ఆది జాంబవ, అరుంధతి మహాసభ’లో ఆమె ఎస్సీ రిజర్వేషన్లను ఎబిసిడిలుగా వర్గీకరించాలని డిమాండ్ చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న నాటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర రెడ్డి సదాలక్ష్మి డిమాండ్‌ను సమర్థించలేదు. వర్గీకరణ మంచి చెడ్డలు, లాభనష్టాలను ఆయన తన ప్రసంగంలో వివరించారు. రిజర్వేషన్ల విధానంతో లబ్ధి పొందుతున్నవారి కంటే వెనుకబడిన ఎస్సీల అభ్యున్నతికి 1000 కోట్ల రూపాయలు మంజూరు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. 


ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు రాజ్యాంగ మౌలిక నిర్మాణంలో భాగమనీ, వాటిని ఏమాత్రం మార్చడానికి ప్రయత్నించినా అది అధికరణ 368ని ఉల్లంఘించడమే అవుతుందని చిన్నయ్య వెర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు స్పష్టం చేసింది. సామాజిక ఆర్థిక అనివార్యతల దృష్ట్యా కాకుండా రాజకీయ ఉద్దేశాలతోనే ఆ రిజర్వేషన్ల వర్గీకరణకు డిమాండ్ చేయడం జరిగింది. వర్గీకరణ అంటూ జరిగితే అది దేశవ్యాప్తంగా చామర్, చామర్ యేతర వర్గీకరణ ప్రాతిపదికన జరగాలి. 


షెడ్యూల్డు కులాల వారిని చీల్చే వ్యూహంలో చంద్రబాబు సఫలమయ్యారు. అయితే అదే సమయంలో ఆయన అనుసరించిన విధానాలు ప్రభుత్వ వ్యవస్థలోనూ, ప్రభుత్వరంగ సంస్థలలోనూ ఉద్యోగావకాశాలను గణనీయంగా కుదించివేశాయి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ఎర్రతివాచీ పరిచారు, ప్రైవేట్ రంగాన్ని ఇతోధికంగా ప్రోత్సహించారు, కాంట్రాక్ట్ ఉద్యోగులను నియమించే పద్ధతిని అమలుపరిచారు, ఆ నియామకాల్లో రిజర్వేషన్ల అమలును విస్మరించారు. ప్రభుత్వోద్యోగాలను తగ్గించి వేస్తూ అదే సమయంలో షెడ్యూల్డ్ కులాలవారిలో చీలికలు సృష్టించారన్నది గమనార్హం. కేంద్ర ప్రభుత్వం కూడా ప్రైవేటీకరణను ఇతోధికంగా ప్రోత్సహించిందన్న వాస్తవాన్ని మనం విస్మరించకూడదు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించడం సహేతుకమేనా? అటువంటి ప్రధాన పరిశ్రమలను ప్రైవేటీకరిస్తున్నప్పుడు రిజర్వేషన్ల విధానాన్ని అమలుపరిచేందుకు ఆస్కారముంటుందా? ప్రభుత్వ రంగం క్రమేణా క్షీణించిపోతోంది. ప్రైవేట్ ఉద్యోగాలలో రిజర్వేషన్లకు అవకాశముందా? లేదు. యుపిఎస్‌సి, కొన్ని రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లు మాత్రమే ఏటా కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్లు జారీ చేస్తున్నాయి. విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో అధ్యాపకులను కాంట్రాక్టు పద్ధతిపై నియమిస్తున్నారు.


సమస్త ఆర్థిక కార్యకలాపాలూ ప్రైవేట్ రంగంలో మాత్రమే జరిగే సంపూర్ణ పెట్టుబడిదారీ వ్యవస్థ దిశగా దేశం పురోగమిస్తోందన్న వాస్తవాన్ని ఎస్సీలు అర్థం చేసుకోవాలి. సకలరంగాలలోనూ రాజ్యాంగ నియమాలను స్థిరపరిచే సముదాత్త లక్ష్య సాధనకు వారు పోరాడాలి. భారత గణతంత్ర రాజ్య నిర్మాతలు అందించిన ‘ధర్మశాస్త్ర’ స్ఫూర్తి అంతకంతకూ క్షీణిస్తోందన్న సత్యాన్ని గుర్తించి రిజర్వేషన్ల ప్రయోజనాల విషయమై పరస్పరం తగవుపడకుండా తమ హక్కులను కాపాడుకునేందుకు ఎస్సీలు సమైక్యంగా ఉద్యమించాలి. అగ్రవర్ణ నాయకుల కొమ్ము కాయకుండా, తమ పేద సహోదరుల సంక్షేమానికి ఎస్సీ కులీనులు పాటుపడాలి. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అనేది రాజకీయ ప్రయోజనాలను లక్ష్యించుకున్న ప్రతిపాదన అని గ్రహించి, దానికనుగుణంగా తమ అభిప్రాయాలను పోరాట వ్యూహాలను మలచుకోవాలి.

డాక్టర్ ఆలూరి సుందర్ కుమార్ దాస్

విశ్రాంత ఐపిఎస్ అధికారి, ఆంధ్రప్రదేశ్

Updated Date - 2022-10-04T06:08:29+05:30 IST