పేదల సొంతింటి కల సాకారమెన్నడు?

ABN , First Publish Date - 2022-08-10T06:14:37+05:30 IST

రాష్ట్రంలో పేదలు 2011 జనాభా లెక్కల ప్రకారం సుమారు 80లక్షలమంది ఉన్నారు. వీరిలో దళితులు, ఆదివాసి, మైనార్టీ, మైదాన గిరిజనులు, బలహీనవర్గాలు, సన్న, చిన్నకారు రైతులు ఉన్నారు.

పేదల సొంతింటి కల సాకారమెన్నడు?

రాష్ట్రంలో పేదలు 2011 జనాభా లెక్కల ప్రకారం సుమారు 80లక్షలమంది ఉన్నారు. వీరిలో దళితులు, ఆదివాసి, మైనార్టీ, మైదాన గిరిజనులు, బలహీనవర్గాలు, సన్న, చిన్నకారు రైతులు ఉన్నారు. వీరు దశాబ్దాలుగా సొంత ఇంటి నిర్మాణం కోసం ఎదురుచూస్తున్నారు. పాలకులు మాత్రం పేదల ఇంటి నిర్మాణానికి ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. దీంతో పేదల సొంత ఇంటి కల కలగానే మిగిలింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మిస్తామని వాగ్దానం చేసింది. ‘ఇందిరమ్మ ఇల్లు ఇరుకుగా ఉంది, అల్లుడు, బిడ్డ వస్తే ఎక్కడ పడుకుంటార’ని సాక్షాత్తు రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ అన్నారు. కానీ దీన్ని నమ్మిన ప్రజలకు నిరాశే మిగిలింది. ఎనిమిదేళ్లు అవుతున్నా పేదలకు సొంత ఇంటి నిర్మాణం ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్న చందంగా తయారైంది.


2018 అసెంబ్లీ ఎన్నికల్లోపే ఇండ్ల నిర్మాణం పూర్తిచేసి కేటాయిస్తామని లేనిపక్షంలో ఓట్లే అడగమని స్వయంగా అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన కేసీఆర్, నేటికీ వాటిని పూర్తి చేయలేదు. రాష్ట్రవ్యాప్తంగా రూ.19వేల కోట్లతో 2,91,000 ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేయగా, రూ.10వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. నిధులు సక్రమంగా విడుదల చేయక పోవడంతో గుత్తెదారులు చేతులెత్తేశారు. దీంతో నిర్మాణ పనులు నత్తనడక నడుస్తున్నాయి. ఇండ్ల నిర్మాణం అక్కడక్కడ పూర్తి అయినప్పటికీ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభం కాకపోవడంతో కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు శిథిలావస్థకు చేరాయి. సూర్యా పేట, కొత్తగూడెం, జనగాం, నల్గొండ, యాదాద్రి భువనగిరి, నిజామాబాద్, వరంగల్, మహబూబాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో అనేక గ్రామాలలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మాణం పూర్తి అయినప్పటికీ, నేటికీ లబ్ధిదారులను గుర్తించకపోవడంతో ఆ ఇండ్ల తలుపులు, కిటికీలు మొత్తం చెదలు పట్టి విరిగిపోయాయి. వివిధ జిల్లాల్లో లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు తీసుకున్న అధికారులు వాటిని పరిశీలించి, విచారణ చేసి లిస్టులు తయారుచేసినా స్థానిక ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం మూలంగా నేటికీ లబ్ధిదారులకు ఇళ్లు మంజూరు చెయ్యలేదు. 


పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వకపోయినా, కనీసం సొంత జాగాలో ఇల్లు కట్టుకుంటే ఆర్థిక సాయం అందించే పథకం కూడా ప్రభుత్వం అమలు చేయడం లేదు. గత ప్రభుత్వ హయాంలో రాజీవ్ గృహకల్ప, ఇందిరమ్మ ఇండ్ల కింద నిర్మించిన వేలాది ఇండ్లు పూర్తిస్థాయిలో నిర్మాణంగాక కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మాణం చేసినా మొండిగోడలతో వృథాగా ఉంటున్నాయి. ప్రభుత్వం వెంటనే గతంలో నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లకు పెండింగ్ బకాయిలు విడుదల చేస్తే వేలాది కుటుంబాలకు ఊరట కలుగుతుంది. తమ ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఇల్లు లేని 22 లక్షల కుటుంబాలకు ఇంటి నిర్మాణానికి 5లక్షల 50 వేల రూపాయలు ఇస్తామని ప్రకటన చేసిన కేసీఆర్, ఆ హామీని తుంగలో తొక్కారు.


పేదలు, దళితులు, బలహీనవర్గాలు ఒకే ఇంట్లో రెండు, మూడు కుటుంబాలు ఉంటూ జీవనం కొనసాగిస్తున్నాయి. ఇటీవలి అకాల వర్షాల మూలంగా ఉన్న ఇరుకు ఇండ్లల్లో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీశారు. ఎప్పుడో నిర్మించిన కొన్ని ఇండ్లు తుఫాన్ మూలంగా కూలిపోయాయి. కూలిన ఇండ్ల స్థానంలో పేదలకు కొత్తవాటిని మంజూరు చేయడం లేదు. గతంలో ఇందిరమ్మ ఇండ్లను నిర్మించుకున్న వేలాది కుటుంబాలకు వాటి నిర్మాణంలో అవినీతి, అక్రమాలు జరిగాయనే పేరుతో బిల్లులు ఇవ్వకపోగా, హౌసింగ్ శాఖను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ప్రభుత్వం ఇకనైనా కళ్ళు తెరిచి పేదల ఇంటి నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి.


– మట్టిపెల్లి సైదులు

తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు

Updated Date - 2022-08-10T06:14:37+05:30 IST