‘దళితబంధు’లో ‘గులాబీ’

ABN , First Publish Date - 2022-06-25T05:42:32+05:30 IST

‘దళితబంధు’లో ‘గులాబీ’

‘దళితబంధు’లో ‘గులాబీ’
ఓసిటీలో గురువారం దళితబంధు లబ్ధిదారులకు పంపిణీ చేసిన వాహనాలు

వివాదాస్పదంగా మారుతున్న లబ్ధిదారుల ఎంపిక

టీఆర్‌ఎస్‌ వారినే ఎంపిక చేస్తున్నట్టు ఆరోపణలు

ఆర్థికంగా ఉన్నవారికి చోటు కల్పించడంపై నిరసన ధ్వనులు

నిబంధనలు, అర్హతలు గాలికొదిలిన అధికారులు

న్యాయం చేయాలంటున్న నిరుపేద దళితులు


వరంగల్‌ సిటీ, జూన్‌ 24: నిరుపేద దళిత కుటుంబాల్లో ఆర్థిక పరిపుష్టిని పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకం  పక్కదారి పడుతోందనే  ఆరోపణలు వినిపిస్తున్నాయి.  ఈ పథకంలో ఒక్కో లబ్దిదారుడికి రూ. 10 లక్షలు కేటాయించారు.  స్వయం ఉపాధి కోసం ఈ డబ్బులను  ఉపయోగించుకోవాల్సి ఉంటుంది.  దళిత బంధు తొలి విడతలో వరంగల్‌ జిల్లాకు 300యూనిట్లు మంజూరు అయ్యాయి. ఈ జిల్లాలో రెండు పూర్తి నియోజకవర్గాలు ఉండగా నియోజక వర్గానికో వంద యూనిట్లు మంజూరయ్యాయి. లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు జిల్లా, మండల స్థాయిల్లో కమిటీలు ఏర్పాటు చేశారు.   ఈ కమిటీల సభ్యులు స్థానిక ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరిపి లబ్ధిదారులను ఎంపిక చేశారు. అయితే ఎమ్మెల్యేలు తమ పార్టీ కార్యకర్తలను లబ్ధిదారులుగా ఎంపిక చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పేద దళితులను ఎంపిక చేయాల్సిందిపోయి, ప్రజాప్రతిధులు, వారి అనుయాయులు, కార్పొరేటర్లు, రియల్టర్లు, ఫైనాన్షియర్లను లబ్ధిదారులు ఎంపిక చేయడాన్ని దళిత వర్గాలు తప్పుబడుతున్నాయి.  స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు,  రియల్టర్లు, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, నేతల అనుయాయులను లబ్ధిదారులుగా ఎంపిక చేసి, యూనిట్లను అందజేయడం చర్చనీయాంశమైంది.  


అనర్హులనకే అందలం...

దళిత బంధు పథకం లబ్ధిదారుల ఎంపిక పూర్తిగా  ఎమ్మెల్యేల చేతుల్లోనే ఉండటం గమనార్హం.  జిల్లా, మండల స్థాయి కమిటీలు ఉన్నా అవి నామమాత్రమనే విమర్శలు ఉన్నాయి. మునిసిపాలిటీల్లో కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, గ్రామ పంచాయతీల్లో సర్పంచులు, వార్డు మెంబర్లు, అధికార పార్టీకి చెందిన ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఎంపిక ప్రక్రియలో పాల్గొంటున్నట్టు తెలుస్తోంది. అయితే లబ్ధిదారుల ఎంపిక మాత్రం స్థానిక ప్రజా ప్రతినిధి నిర్ణయించే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందనే ఆరోపణలున్నాయి. అందిన దరఖాస్తుల్లో లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు స్థానిక ఎమ్మెల్యేలతో సంప్రదింపుల తర్వాతే జాబితాలను సిద్ధం చేశామని అధికారులు చెబుతున్నారు.  దళిత బంధు పథకం లబ్ధిదారుల్లో అధిక శాతం టీఆర్‌ఎస్‌ కార్యకర్తలే కనిపిస్తున్నారని పేద దళితులు మండిపడుతున్నారు. ప్రజాప్రతినిధులు, వారి అనుయాయులకు ఇప్పించుకోడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.  


పంపిణీ 

వరంగల్‌ తూర్పు నియోజకవర్గంలో తొలి విడత దళిత బంధు పంపిణీ కార్యక్రమం శుక్రవారం జరిగింది. తొలి విడతలో 100 యూనిట్లు మంజూరు కాగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌, ఎంపీ పసునూటి దయాకర్‌ చేతుల మీదుగా  37 యూనిట్లలో వివిధ వాహనాలను, 63 యూనిట్లలో వివిధ రకాల షాపుల కోసం లబ్ధిదారులకు అందజేశారు. నర్సంపేట నియోజవర్గంలో గత నెల 28న లబ్ధిదారులకు స్కీంలో మంజూరైన వాహనాలను ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి  పంపిణీ చేశారు. వరంగల్‌ జిల్లా పరిధిలోని వర్థన్నపేట నియోజకవర్గంలో ఇంకా పంపిణీ జరుగలేదు. పరకాల నియోజకవర్గ పరిధిలో గత నెలలో వివిధ రకాల వాహనాలను ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి పంపిణీ చేశారు. 


కార్పొరేటర్ల ఎంపిక..

వరంగల్‌ తూర్పు నియోజవకర్గ పరిధిలో ఇద్దరు కార్పొరేటర్లను దళిత బంధు లబ్ధిదారులుగా ఎంపిక చేయడం చర్చనీయాంశమైంది. అలాగే టీఆర్‌ఎస్‌ కార్యకర్తలుగా చలామణి అవుతున్న ఇద్దరు ఫైనాన్షియర్లు, ఓ కార్పొరేటర్‌ ప్రధాన అనుచరుడు లబ్ధిదారుల జాబితాలో చోటు దక్కించుకోవడం విమర్శలకు తావిస్తోంది. నర్సంపేటతోపాటు పాక్షికంగా ఉన్న పరకాల, వర్ధన్నపేట  నియోజవర్గాల్లో సైతం టీఆర్‌ఎస్‌ కార్యకర్తలే అధికంగా లబ్ధిదారుల జాబితాలో ఉన్నారని చెబుతున్నారు. 


బాహాటంగానే  ప్రచారం...

దళిత బంధు పథకాన్ని టీఆర్‌ఎస్‌ కార్యకర్తలకే ఇస్తామని స్థానిక ప్రజాప్రతినిధులు బాహాటంగానే చెబుతూ వచ్చారు. తమ కోసం పనిచేస్తున్న కార్యకర్తలకు లబ్ధి చేకూరుస్తామని వివిధ సందర్భాల్లో నేరుగానే చెప్పారు. టీఆర్‌ఎస్‌ కార్యకర్తలైన దళితులకు దళిత బంధు ఇస్తే తప్పేంటని ప్రజాప్రతినిధులు చాలా సందర్భాల్లో ఇతర పార్టీ నేతలను నిలదీసిన సంఘటనలూ ఉన్నాయి.


అరకొర సమాచారమే...

దళిత బంధు విధి విధానాలు, పంపిణీ చేసిన యూనిట్ల వివరాల కోసం ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ సురేష్‌ను సంప్రదించగా ఆయన అరకొర వివరాలే ఇచ్చారు. పూర్తి స్థాయిలో వివరాలు ఇచ్చేందుకు ఆయన సుముఖత వ్యక్తం చేయడం లేదు. ఫోన్‌లో సంప్రదిస్తే ఫోన్‌ లిఫ్ట్‌ చేయడం లేదు.  


హైకోర్టును ఆశ్రయించాం... : మాదాసు రాజు, శాకరాసికుంట, వరంగల్‌

దళిత బంధు పథకాన్ని టీఆర్‌ఎస్‌ నాయకులే పంచుకున్నారు. పేదనైన నేను దరఖాస్తు చేసుకుంటే నాకు రాలేదు.  కలెక్టర్‌ కార్యాలయంలో ప్రజావాణిలో ఫిర్యాదు కడా చేశాను. కలెక్టర్‌ కార్యాలయంలో అడిగితే న్యాయపరంగా వెళ్లమని చెప్పారు. దళిత బంధు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలకేనా అంటూ  హైకోర్టులో కేసు వేశాను. జిల్లా నుంచి ఎనిమిది మంది పేద దళితులం ఈ పథకం టీఆర్‌ఎస్‌ కార్యకర్తలకే ఇవ్వడంపై హైకోర్టును ఆశ్రయించాం. 


పేద దళితులకే స్కీం అందాలి... : ఈర్ల కుమార్‌ మాదిగ, ఎంఎ్‌సపీ నాయకుడు, వరంగల్‌

దళిత బంధు పథకం నిరుపేద దళితుల కోసం ఏర్పాటు చేసింది. నిరుపేద దళిత వర్గాలకే అది అందాలి. డబ్బున్న టీఆర్‌ఎస్‌  కార్యకర్తలకు, రియల్టర్లకు, ప్రజా ప్రతినిధుల అనుయాయులకు పథకాన్ని మంజూరు చేసి అబాసుపాలు చేయద్దు. ప్ర భుత్వ నిష్పక్షపాతంగా ఎంపిక చేయాలి. ఎమ్మెల్యేల చుట్టూ ఉన్న కార్యకర్తలకే ఈ పథకాన్ని వర్తించజేయొద్దు. రాష్ట్రంలోని ప్రతీ దళితకుటుంబానికి దళిత బంధును అందజేయాలి. 

Updated Date - 2022-06-25T05:42:32+05:30 IST