దళిత జడ్జి రామకృష్ణపై దేశద్రోహం కేసు అన్యాయం

ABN , First Publish Date - 2021-04-17T03:56:19+05:30 IST

దళిత జడ్జి రామకృష్ణపై దేశద్రోహం కేసు పెట్టడం అన్యాయమని దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు ఎస్‌.మల్లి పేర్కొన్నారు.

దళిత జడ్జి రామకృష్ణపై దేశద్రోహం కేసు అన్యాయం
: దళిత జడ్జి రామకృష్ణపై దేశ ద్రోహం కేసు ఎత్తివేయాలని ధర్నా చేస్తున్న దళిత నేతలు

అంబేద్కర్‌ విగ్రహం వద్ద దళితులు ధర్నా

కావలి, ఏప్రిల్‌ 16: దళిత జడ్జి రామకృష్ణపై దేశద్రోహం కేసు పెట్టడం అన్యాయమని దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు ఎస్‌.మల్లి పేర్కొన్నారు. జడ్జి రామకృష్ణపై పెట్టిన కేసును ఎత్తివేయాలంటూ కావలి ట్రంకురోడ్డులో ఉన్న అంబేద్కర్‌ విగ్రహం వద్ద దళిత సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో శుక్రవారం దళిత నేతలు ధర్నా చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇటీవల ఐక్యరాజ్య సమితి మానవహక్కుల కమిషన్‌లో ఆంధ్రప్రదేశ్‌లో  దళిత, గిరిజనులపై ఆకృత్యాలు ఏ దేశంలో జరగనన్ని జరిగాయని చెప్పారన్నారు. ఈ అంశంపై వారం రోజుల కిందట జరిగిన చర్చా కార్యక్రమంలో జడ్డి రామకృష్ణ పాల్గొన్నందుకు ఆయనపై వైసీపీ కార్యకర్తతో ఫిర్యాదు ఇప్పించి జగన్మోహన్‌రెడ్డిని విమర్శించాడని కేసు పెట్టించటం దారుణమన్నారు. గతంలో మంత్రి పెద్దిరెడ్డికి జడ్జి రామకృష్ణకు ఒక ఇంటి విషయంలో ఉన్న వివాదం కారణంగా అప్పట్లో ఆయనను సస్పెండ్‌ చేయించటమే కాక ఇప్పుడు ఇలాంటి తప్పుడు కేసులు పెట్టి వేధించటం సహించరాని విషయమన్నారు. బజారులో ఉన్న వ్యక్తిని కనీసం ఇంటికి కూడా పోనివ్వకుండా దేశ ద్రోహం కేసు పెట్టి జైలుకు పంపటం చట్టం అధికారపార్టీకి చుట్టంలాగా కనిసిస్తుందన్నారు. ఎస్సీ, ఎస్టీ చట్టాలు కూడా అగ్రకులాలే వాడుకుంటూ దళితులను అణిచివేస్తున్నారనేందుకు రామకృష్ణపై పెట్టిన దేశద్రోహం కేసే నిదర్శనమన్నారు. రామకృష్ణపై పెట్టిన దేశద్రోహం కేసును ఎత్తి వేయకపోతే దళిత సంఘాల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుందని చెప్పారు. కార్యక్రమంలో దళిత నేతలు జరుగుమల్లి విజయరత్నం, పీ.లక్ష్మయ్య, పీ.శ్రీను, జీ.తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-17T03:56:19+05:30 IST