దళితబంధు.. కసరత్తు షురూ

ABN , First Publish Date - 2022-01-24T05:00:24+05:30 IST

అనుకున్నట్లుగానే రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం జిల్లా కలెక్టర్లతో శనివారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి దిశా నిర్దేశం చేసింది.

దళితబంధు.. కసరత్తు షురూ
దళిత అభివృద్ధి శాఖ కార్యాలయం

జిల్లాలో 300ల కుటుంబాలు లబ్ధి పొందే అవకాశం
ఫిబ్రవరి 5లోగా లబ్ధిదారుల ఎంపిక పూర్తి
ఎమ్మెల్యేలకు సవాలుగా మారనున్న ఎంపిక ప్రక్రియ
తొలి విడతలో దళితబస్తీ లబ్ధిదారులకు అవకాశం లేనట్లే

ఆదిలాబాద్‌, జనవరి23 (ఆంధ్రజ్యోతి) : అనుకున్నట్లుగానే రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం జిల్లా కలెక్టర్లతో శనివారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి దిశా నిర్దేశం చేసింది. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించింది. మరో రెండు మూడు రోజుల్లో పూర్తి స్థాయి విధి విధానాలు ఖరారయ్యే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలో 30వేల 565 దళిత కుటుంబాలు ఉండగా వీడి పరిధిలో లక్షా 12వేల 932 మంది జనాభా ఉన్నారు. ఇప్పటికే దళితబస్తీ పథకం కింద 1853 దళిత కుటుంబాలకు ఒక్కొక్కరికీ 3 ఎకరాల చొప్పున 4718 ఎకరాలను ప్రభుత్వం పంపిణీ చేసింది. దీనికి గాను రూ.207 కోట్ల 81లక్షల నిధుల మంజూరు చేసింది. తొలి విడతలో నియోజకవర్గానికి వం ద కుటుంబాల చొప్పున ఎంపిక చేసే అవకాశం కనిపి స్తోంది. ఆదిలాబాద్‌, బోథ్‌ నియోజక వర్గాలలో 200 కుటుంబాలు, ఖానాపూర్‌ నియోజక వర్గంలో ఉన్న ఉట్నూ ర్‌, ఇంద్రవెల్లి మండలాలు, ఆసిఫాబాద్‌ నియోజకవర్గంలో ఉన్న నార్నూర్‌, గాదిగూడ మండలాల్లో 50 కుటుంబాల చొప్పున మొత్తం వంద కుటుంబాలకు ఎంపిక చేయనున్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా సుమారుగా 300ల కుటుంబాలకు దళితబంధు పథకం వర్తించే అవకాశం కనిపిసోంది. అయితే రా జకీయ జోక్యంతో అసలైన అర్హులకు ఎంతవరకు ప్ర యోజనం ఉం టుందోనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మార్చి 7లోగా గ్రౌండింగ్‌...
ఫిబ్రవరి 5వతేదీలోగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసి మార్చి 7లోగా యూనిట్లను గ్రౌండింగ్‌ చేయాలని ప్రభుత్వం జిల్లా అధికారులను ఆదేశించింది. లబ్ధిదారులకు పథకం అమలుపై అవగాహన కల్పించాలని సూచించింది. ఇందులో ట్రాక్టర్స్‌, ఆటోరిక్షాలు, హార్వెస్టర్స్‌, డెయిరీ ఫాం, కోళ్లఫాం, మేకల యూనిట్లను ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. లాభసాటి అయ్యే యూనిట్లను మాత్రమే ఎంపిక చేసుకునేలా అధికారులు సలహాలు, సూచనలు అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. దళితబంధు పథకానికిఎంపికైన లబ్ధిదారులకు రూ.9లక్షల 90వేలతో యూనిట్‌ను ఏర్పాటు చేసుకునే విధంగా నిధులను మంజూరు చేస్తారు. మిగతా రూ.10వేలతో ప్రభుత్వమే రక్షణ నిధిని ఏర్పాటు చేస్తుంది. ఏదైనా ఆపద సమయంలో లబ్ధిదారులను ఆదుకునేందుకు ఈ నిధి ద్వారా సహాయం పొందే అవకాశం ఉంటుంది. అలాగే నలుగురైదుగురు లబ్ధిదారులు కలిసి ఒకే చోట భారీ మొత్తంలో యూనిట్లను ఏర్పాటు చేసుకునే అవకాశం కూడా ప్రభుత్వం కల్పించింది.
ఎంపిక చేయడం ఎలా..
దళితబంధు పథకానికి లబ్ధిదారులను ఎంపిక చేసే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యేలకు అప్పగించింది. దీంతో ఎమ్మెల్యేలు ఎంపిక ప్రక్రియను ఎలా చేపడదామన్న ఆలోచనలో పడ్డారు. ఒక్కో నియోజకవర్గంలో వంద కుటుంబాలను ఎంపిక చేయాల్సి ఉంటుంది. జిల్లాలో 468 గ్రామ పంచాయతీలున్నాయి. కానీ గ్రామానికి ఒక లబ్ధిదారుడినైనా ఎంపిక చేసే అవకాశం లేదు. ప్రభుత్వం రూ.10లక్షల నిధులను ఎలాంటి షరతులు లేకుండా మంజూరు చేయడంతో ఎక్కువ మంది లబ్ధిదారులు రైతుబంధు పథకంపై ఆసక్తి చూపుతున్నారు. అయితే ఎవరిని కాదన్న ఎమ్మెల్యేలకు వ్యతిరేకత, ఇతర ఇబ్బందులువచ్చి పడే అవకాశం కనిపిస్తోంది. ఒక్కో గ్రామంలో వందలాది దళిత కుటుంబాలు ఉన్నాయి. ఇందులో ఒకరికి మాత్రమే అవకాశం కల్పిస్తే మిగతా వారితో ఇబ్బందులు తప్పవన్న భావనతో ఎమ్మెల్యేలు ఉన్నారు. వ్యతిరేకత వ్యక్తమైతే పరిస్థితులు ఏమిటన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీకి చెందిన వారికే పథకం అందితే ఇతర పార్టీల నుంచి ఆరోపణలు, విమర్శలు తప్పేలా లేవంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో లబ్ధిదారుల ఎంపిక ఎమ్మెల్యేలకు సవాలుగానే మారనుంది.
ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే ఎంపిక..
- శంకర్‌ (ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ, ఆదిలాబాద్‌)

ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే దళితబంధు పథకానికి అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేస్తాం. ఎమ్మెల్యేలు సూచించిన లబ్ధిదారులకే పథకం అందేలా చర్యలు తీసుకుంటాం. పూర్తి స్థాయిలో విధి విధానాలు రావాల్సి ఉంది. అప్పట్లోగా ఎమ్మెల్యేల లబ్ధిదారుల జాబితా పూర్తవుతుంది. ఎలాంటి షరతులు లేకుండా దళిత కుటుంబాలన్నింటికీ దళితబంధు పథకాన్ని వర్తిస్తుంది. ఇప్పటికే దళితబస్తీ కింద 3 ఎకరాల భూమిని పొందిన వారికి  రుణమంజూరుపై ఎలాంటి స్పష్టమైన ఆదేశాలు లేవు.

Updated Date - 2022-01-24T05:00:24+05:30 IST