దళితబంధు వెలుగులు

ABN , First Publish Date - 2022-08-19T05:48:45+05:30 IST

దళితబంధు పథకం ప్రారంభమై ఏడాది గడిచింది.

దళితబంధు వెలుగులు

- పైలట్‌ ప్రాజెక్టుగా హుజూరాబాద్‌ నియోజకవర్గం

- ఏడాదిలో 11,883 యూనిట్ల స్థాపన 

- మరో 91 యూనిట్లకు ప్రతిపాదన 

- 2,178 మందికి చేకూరాల్సిన లబ్ధి

- పథకం అమలు తీరుపై హర్షం

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

దళితబంధు పథకం ప్రారంభమై ఏడాది గడిచింది. రాష్ట్రంలో పైలట్‌ ప్రాజెక్టుగా హుజూరాబాద్‌ నియోజకవర్గంలో పరిపూర్ణస్థాయిలో దళిత కుటుంబాలన్నిటికి పదేసి లక్షల ఆర్థిక సహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం  నిర్ణయించింది  సీఎం కేసీఆర్‌ దళితబంధు పథకానికి హుజూరాబాద్‌లో శ్రీకారం చుట్టారు. 2021 ఆగస్టు 16న హుజూరాబాద్‌ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. హుజురాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గంలోని అన్ని దళిత కుటుంబాలకు పది లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించి వివిధ యూనిట్లను సమకూర్చి వారికి ఉపాధి మార్గం చూపించాలనుకున్నారు. జిల్లా యంత్రాంగాన్ని మొత్తం ఇక్కడే కేంద్రీకరించి ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహించారు. 

- ప్రాథమికంగా నియోజకవర్గంలో 20,929 దళితకుటుంబాలున్నాయని గుర్తించి సర్వే ప్రారంభించారు. అనంతరం 13,944 దళితకుటుంబాలకు ఈ పథకం కింద ఆర్థిక సహాయం అందించేందుకు అర్హత ఉన్నట్లుగా గుర్తించి అందుకు మంజూరు ఇచ్చారు.

- హుజురాబాద్‌ మున్సిపాలిటీలో 1,638, హుజురాబాద్‌ మండలంలో 2,669, ఇల్లందకుంట మండలంలో 2,102, జమ్మికుంట మున్సిపాలిటీలో 2,199, జమ్మికుంట మండలంలో 2322, వీణవంక మండలంలో 3,014  దళితకుటుంబాలకు యూనిట్లను మంజూరు చేశారు.

- నియోజకవర్గ పరిధిలోని కమలాపూర్‌ మండలానికి  చెందిన 3,698 మంది దళితకుటుంబాలకు యూనిట్లు మంజూరు చేశారు. 

- మొత్తంగా హజూరాబాద్‌ నియోజకవర్గంలో 15,464 దళితకుటుంబాలకు చెందిన వారికి పదేసి లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించి వారు కోరుకున్న యూనిట్లు స్థాపించుకునేందుకు ప్రభుత్వం చేయూతనివ్వాలని నిర్ణయించింది.

- ఇప్పటి వరకు జిల్లాలోని ఇల్లందకుంట మండలంలో 1,878 మందికి, హుజురాబాద్‌ మండలంలో 2,325, హుజురాబాద్‌ మున్సిపాలిటీలో 1,250, జమ్మికుంట మండలంలో 19,51 మందికి, జమ్మికుంట మున్సిపాలిటీలో 1,763 మందికి, వీణవంక మండలంలో 2,506 మందికి యూనిట్లు సమకూర్చారు. మరో 91 మందియూనిట్లకు కలెక్టర్‌కు ప్రతిపాదనలు పంపించారు. 2,178 యూనిట్లను ఇంకా స్థాపించాల్సి ఉన్నది. 

- ఈ పథకం కింద ప్రభుత్వ చేయూత పొందిన దళితుల్లో 2,263 మంది మినీ డెయిరీలను ఏర్పాటు చేసుకున్నారు. 

- 2,248 మంది త్రిచక్ర, నాలుగు చక్రాల వాహనాలను సమకూర్చుకొని ఉపాధి అవకాశాలు కల్పించుకున్నారు. 

- 2,050 మంది ట్రాక్టర్లు, ట్రాలీలు, 1885 మంది ప్యాసింజర్‌ వాహనాలు, 317 మంది క్లాత్‌స్టోర్స్‌, 389 మంది మినీ సూపర్‌బజార్లు ఏర్పాటు చేసుకున్నారు.

-  316 మంది ఎలక్ర్టానిక్‌ గూడ్స్‌ షాపులు, 348 మంది టెంట్‌ హౌజ్‌లు, డెకరేషన్‌ షాపులు ప్రారంభించుకున్నారు. 

- 269 మంది ఫొటో స్టూడియోలు, 268 మంది ఐరన్‌ హార్డ్‌వేర్‌ షాపులు, 824 మంది సెంట్రింగ్‌ యూనిట్లను, 60 మంది సిమెంట్‌ ఇటుకల తయారీ యూనిట్లను, 81 మంది డీటీపీ ఇంటర్‌నెట్‌ సేవా కేంద్రాలను, 39 మంది మెడికల్‌ షాపులు, పథాలాజికల్‌ ల్యాబ్‌లను ఏర్పాటు చేసుకున్నారు. 

- 36 మంది హోటల్‌ క్యాటరింగ్‌ సర్వీసులను ప్రారంభించారు. 

- 74 మంది లేడీస్‌ ఎంపోరియంలు, 108 మంది కిరాణ జనరల్‌ స్టోర్స్‌ను ఏర్పాటుకున్నారు. 

- 133 మంది పౌల్ర్టీ ఫారాలను ప్రారంభించారు.

- 414 మంది హార్వెస్టర్లను, 261 మంది ఎక్స్‌కావేటర్లను, 163 మంది వ్యాన్లను, 59 మంది వరి నాటు యంత్రాలను, 16 మంది మినీ బస్సులను సమకూర్చుకున్నారు. 

ఒకటి రెండు నెలల్లో లక్ష్యాన్ని చేరుకునే అవకాశం

మరో ఒకటిరెండు నెలల్లో నిర్ధేశించిన లక్ష్యం మేరకు అన్ని యూనిట్లు ప్రారంభమయ్యే అవకాశమున్నది. ఈ యూనిట్లు పొందినవారంతా వాటి ద్వారా ఆదాయం పొందేందుకు మరికొద్ది నెలల సమయం పడుతుందని భావిస్తున్నారు. ఇంతకాలం ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగులుగా కాలం గడుపుతూ ఉన్న యువత, ఇతర పనులు చేసుకునేవారు  ఇప్పుడు సొంత సంస్థలను స్థాపించుకొని యజమానులుగా మారారు. దళితబంధు పథకంతో తమ జీవితంలో వెలుగులు ప్రారంభమయ్యాయని వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

మిగతా నియోజకవర్గాల్లో..

జిల్లాలోని మిగతా నియోజకవర్గాల్లో 100 యూనిట్ల స్థాపనకు దళితులను ఎంపిక చేసి ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో ఇప్పటి వరకు చొప్పదండి నియోజకవర్గంలో 49 మందికి, కరీంనగర్‌ నియోజకవర్గంలో 99, మానకొండూర్‌ నియోజకవర్గంలో 60, మొత్తం 208 మందికి 10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించి వారు కోరుకున్న యూనిట్లను సమకూర్చారు. ఈ సంవత్సరం హుజురాబాద్‌ మినహా మిగతా అన్ని నియోజకవర్గాలలో 1,500 చొప్పున దళితకుటుంబాలను ఎంపిక చేసి వారికి లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ దిశగా లబ్ధిదారుల ఎంపిక చేపట్టాల్సి ఉన్నది. 


Updated Date - 2022-08-19T05:48:45+05:30 IST