జనాభా నిష్పత్తి ప్రకారం నిధులు కేటాయించాలి

ABN , First Publish Date - 2021-02-27T06:00:22+05:30 IST

నీతి అయోగ్‌ మార్గదర్శకాల ప్రకారం జనాభా నిష్పత్తి ప్రకారం నిధులు కేటాయించి ఖర్చు చేయాలని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌ తెలిపారు.

జనాభా నిష్పత్తి ప్రకారం నిధులు కేటాయించాలి
అంబేడ్కర్‌ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న ఎమ్మెల్సీ మాణిక్యవరప్రసాద్‌, దేవకుమార్‌, వినయ్‌కుమార్‌ తదితరులు

గుంటూరు, ఫిబ్రవరి 26: నీతి అయోగ్‌ మార్గదర్శకాల ప్రకారం జనాభా నిష్పత్తి ప్రకారం నిధులు కేటాయించి ఖర్చు చేయాలని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌ తెలిపారు. ఎస్సీ, ఎస్టీల సామాజిక ఆర్థికాభివృద్ధి అనే అంశంపై  అరండల్‌పేటలోని ఓ హోటల్‌లో శుక్రవారం దళిత బహుజన రీసోర్స్‌ సెంటర్‌ రాష్ట్ర కార్యదర్శి అల్లడి దేవకుమార్‌ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర సదస్సులో డొక్కా ప్రసంగించారు. కేంద్ర బడ్జెట్‌లో దళిత, గిరిజనులకు నిధులు కేటాయింపులు లేవన్నారు. దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరుగుతున్నా వాటి పంపిణీకి అనుగుణమైన విధానాల రూపకల్పన చేయకపోవటంతో ప్రజలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జూమ్‌కాల్‌ ద్వారా ప్రముఖ జర్నలిస్టు మల్లేపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ ప్లానింగ్‌ కమిషన్‌ మనుగడలో లేకపోవటం బలహీనవర్గాల ఆకాంక్షలు బడ్జెట్‌లో ప్రతిబింబించటం లేదన్నారు. డీబీఎఫ్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు కొరివి వినయ్‌కుమార్‌ మాట్లాడుతూ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ద్వారా సామాజిక ప్రజాస్వామ్యం వస్తుందని ఆశించిన డాక్టర్‌ అంబేడ్కర్‌ ఆలోచనలకు విరుద్ధంగా ప్రస్తుత ప్రభుత్వ విధానాలు కొనసాగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సమావేశంలో వివిధ సంఘాల నాయకులు కాకి ప్రసాద్‌, గురునాథం, మేడిద బాబురావు, మురికిపూడి దేవపాల్‌, ఈరి రాజశేఖర్‌, కృష్ణమోహన్‌, మల్లెల చిన్నప్ప, కోటేశ్వరరావు, పిల్లి రమాదేవి, జ్యోతి, చుక్కా శామ్యూల్‌ అనీల్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-02-27T06:00:22+05:30 IST