బెజవాడలో దళిత యువకుడి లాక్‌పడెత్‌!

ABN , First Publish Date - 2020-10-02T08:26:38+05:30 IST

విజయవాడలో లాకప్‌ మరణం ఘటన చోటు చేసుకుంది. మద్యం అక్రమరవాణా నియంత్రణకు ఏర్పాటు చేసిన స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో పోలీసు స్టేషన్‌లో ఓ దళిత యువకుడు ప్రాణాలు కోల్పోయాడు...

బెజవాడలో దళిత యువకుడి లాక్‌పడెత్‌!

  • హైదరాబాద్‌ నుంచి వచ్చిన కార్గో పార్సిల్‌లో తెలంగాణ మద్యం సీసాలు
  • పార్సిల్‌పై ఫోన్‌ నంబరు అజయ్‌ది
  • ఎస్‌ఈబీ స్టేషన్‌లో ఇంటరాగేషన్‌
  • ఆనక రమేశ్‌ ఆస్పత్రికి తరలింపు
  • అక్కడే చనిపోయిన అజయ్‌

విజయవాడ, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): విజయవాడలో లాకప్‌ మరణం ఘటన చోటు చేసుకుంది. మద్యం అక్రమరవాణా నియంత్రణకు ఏర్పాటు చేసిన స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో పోలీసు స్టేషన్‌లో ఓ దళిత యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. అరెస్టుచేసి తీసుకొచ్చిన కాసేపటికే అతడి ఊపిరి ఆగిపోయింది. ఈ ఘటన గురువారం సాయంత్రం జరిగింది. కృష్ణలంక పెద్దివారి వీధికి చెందిన డి.అజయ్‌(26) కారు డ్రైవర్‌. తల్లి నాగమల్లేశ్వరమ్మతో కలిసి నివసిస్తున్నాడు. తల్లి సమీపాన ఉన్న చర్చిలో వాచ్‌మన్‌గా పనిచేస్తోంది. ఎస్‌ఈబీ పోలీసులు నెల క్రితం పండిట్‌ నెహ్రూ బస్‌స్టేషన్‌లో ఆర్టీసీ కార్గోలో వచ్చిన తెలంగాణ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. చేపల చెరువులో ఆహారంగా ఉపయోగించే ఫీడ్‌లో ఈ సీసాలను పెట్టి హైదరాబాద్‌ నుంచి విజయవాడకు పార్సిల్‌ చేశారు. గుప్తా అనే వ్యక్తి ఈ పార్శిల్‌ చేసినట్లు అధికారులు తెలిపారు. పటమట ఎక్సైజ్‌ పోలీ్‌సస్టేషన్‌లో కేసు నమోదు చేయించారు.


పార్సిల్‌ గుప్తా పేరుతో వచ్చినప్పటికీ ఫోన్‌ నంబరు అజయ్‌దని గుర్తించినట్లు సమాచారం. అప్పటి నుంచి అజయ్‌తోపాటు అతడి స్నేహితుడు సాయికిరణ్‌ పరారీలో ఉన్నారు. వారిని ఎస్‌ఈబీ పోలీసులు గురువారం మధ్యాహ్నం అరెస్టు చేసి విచారణకు తీసుకెళ్లారు. కాసేపటికి సమీపాన ఉన్న రమేశ్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కొద్దిసేపటికి అజయ్‌ ఆస్పత్రిలో ప్రాణాలు కోల్పోయాడు. విచారణ పేరుతో పోలీసులు చిత్రహింసలు పెట్టడంతో అతడు చనిపోయాడని బంధువులు, కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీనిపై కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేశారు. దళిత సంఘాల నేతలు ఆస్పత్రి వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. అయితే ఇది లాక్‌పడెత్‌ కాదని, అనారోగ్య కారణాలతో అజయ్‌ చనిపోయాడని పోలీసులు అంటున్నారు. అతడిని ప్రశ్నిస్తుండగా చెమటలు పట్టి ఫిట్స్‌ వచ్చాయని, ఆస్పత్రికి తరలించగా మృతిచెందాడని చెబుతున్నారు. ఘటన గురించి తెలియగానే హోం క్వారంటైన్‌లో ఉన్న ఎస్‌ఈబీ అదనపు ఎస్పీ మేకా సత్తిబాబు.. రమేశ్‌ ఆస్పత్రికి చేరుకున్నారు. దళిత నేతలతో రాత్రి వరకు సంప్రదింపులు జరిపారు. ఘటన తన చాంబర్‌లోనే జరిగిందని.. తానూ బాధ్యుడినవుతానని అన్నట్లుతెలిసింది. అజయ్‌ అనారోగ్యంతో చనిపోయాడని, ఒకవేళ పోలీసులు కొట్టడం వల్లే చనిపోతే పోస్టుమార్టం రిపోర్టు రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని సీపీ బత్తిన శ్రీనివాసులు చెప్పారు. ఉన్న ఒక్క ఆధారమైన కుమారుడు చనిపోవడంతో అజయ్‌ తల్లి విలపిస్తోంది.


Updated Date - 2020-10-02T08:26:38+05:30 IST