మాజీ మంత్రి ప్లాట్‌లో దళిత యువతి మృతదేహం.. ఎన్నికల వేళ యూపీలో రాజుకున్న రాజకీయ వేడి

ABN , First Publish Date - 2022-02-11T22:38:36+05:30 IST

ఉత్తరప్రదేశ్ శాసనసభకు ఎన్నికలు జరగుతున్న వేళ అదృశ్యమైన దళిత యువతి..

మాజీ మంత్రి ప్లాట్‌లో దళిత యువతి మృతదేహం.. ఎన్నికల వేళ యూపీలో రాజుకున్న రాజకీయ వేడి

ఉన్నావో: ఉత్తరప్రదేశ్ శాసనసభకు ఎన్నికలు జరుగుతున్న వేళ అదృశ్యమైన దళిత యువతి మృతదేహం మాజీ మంత్రికి చెందిన స్థలంలో లభ్యం కావడం రాజకీయ వేడికి కారణమైంది. బీజేపీ, బీఎస్పీలు వెంటనే రంగంలోకి దిగాయి. సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్‌పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టాయి. శవపరీక్షలో ఆమెను గొంతు నులిమి చంపినట్టు వెల్లడైంది. అలాగే, ఆమె మెడ విరిచినట్టు తేలింది. 


బాధిత యువతి అదృశ్యమై దాదాపు రెండు నెలలు కావొస్తోంది. ఆమె తల్లి గాలించినా ఫలితం లేకుండా పోయింది. చివరికి గురువారం ఉన్నావోలో ఆమె మృతదేహాన్ని గుర్తించారు. తన కుమార్తె హత్య వెనక మాజీ మంత్రి ఫతే బహదూర్ సింగ్ కుమారుడి హస్తం ఉన్నట్టు బాధితురాలి తల్లి ఆరోపించారు. రాష్ట్ర మాజీ మంత్రి బహదూర్ సింగ్ కుమారుడు రాజోల్ సింగ్‌కు చెందిన ఓ ఆశ్రమంలో గురువారం 22 ఏళ్ల బాధిత యువతి మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని దుప్పటిలో చుట్టి ఓ సెప్టిక్ ట్యాంకులో పడేశారు. 


ఈ ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య.. అఖిలేశ్ యాదవ్‌పై దుమ్మెత్తిపోశారు. నిందితుడిని రక్షిస్తున్నారని ఆరోపించారు. బాధిత యువతి మృతదేహం ఎస్పీ నేత ప్లాట్‌లో లభ్యమైందని అన్నారు. ఆమె తల్లి మీ కారుకు అడ్డం పడి వేడుకున్నా మీరు కనికరించలేదంటూ ట్వీట్ చేశారు. ఎస్పీ నేతల నేరాలన్నింటినీ మీరు క్షమించేస్తారని, వారిపై ఈగ కూడా వాలనివ్వకుండా చూసుకుంటారంటూ ఎద్దేవా చేశారు.


ఈ ఘటనపై బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా తీవ్రంగా స్పందించారు. ఇది చాలా తీవ్రమైన విషయమని అన్నారు. దళిత యువతి అపహరణ, హత్యలో ఎస్పీ నేత హస్తం ఉందని బాధిత కుటుంబం అనుమానిస్తోందని అన్నారు. నిందితులపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి సత్వర న్యాయం అందించాలని డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-02-11T22:38:36+05:30 IST