Abn logo
Sep 23 2020 @ 00:56AM

దళిత సామాజిక సాహిత్య ఉద్యమకారుడు

Kaakateeya

దళితసాహిత్యానికి డా.బి.ఆర్‌.అంబేద్కర్‌ భావజాలమే తాత్త్విక పునాది అన్నది మరిచిపోనివాడు రత్నాకర్‌. సమాజంలో దళితులు, గిరిజనులు, బహుజనులు ఇలా ఒక్కొక్క పేరు పెట్టడం, అవసరాన్ని బట్టి వారిని కలిపి మాట్లాడ్డం లేదా విడదీసి మాట్లాడటం చేసే మేధావుల్ని 'వర్ణమాల'లో దుయ్యబటాడు రత్నాకర్. 


హిందీనుంచి తెలుగులోకి వచ్చిన అనువాదాల్ని గమనించేవారికి డా.జి.వి.రత్నాకర్‌ పేరు సుపరిచితమే. దళిత సాహిత్య అధ్యయనకారులకూ ఆయన పేరు కవిగా, పరిశోధకుడిగా, విమర్శకుడిగా తెలియకుండా ఉండదు. ‘కూకూ భూరిల కథ’, ‘రహస్యం’, ‘బండి నుండి మోటార్‌కు’, ‘నడిచేటి నావ కథ’ ఆయన అనువాద రచనల్లో కొన్ని. వీటితోపాటు ‘అంబేద్కర్‌ దినచర్య’, ‘రమాబాయ్‌ అంబేద్కర్‌ జీవిత చరిత్ర’, ‘మై భంగీహు’ (నేను అంటరానివాణ్ణి), ‘మా పల్లె సూర్యుడు’ (కవిత్వం) తదితర రచనలతో రత్నాకర్‌ భారతీయ దళిత సాహిత్యాన్ని తెలుగు సాహిత్యానికి పరిచయం చేశాడు.


రత్నాకర్‌ అద్భుతమైన భావుకత కలిగిన కవి. ఆయన రాసిన ‘మట్టిపలక’, ‘అట్లేటి అల’, ‘ముసిబాస', ‘వర్ణమాల’ కవితా సంపుటాలు కవిగా ఆయనకు తెలుగు సాహిత్యంలో సుస్థిర స్థానాన్ని సంపాదించి పెట్టాయి. ఆయన కవితలు ఆంగ్ల, హిందీ, ఉర్దూ, మరాఠీ భాషల్లోకి అనువాదమయ్యాయి. వృత్తి రీత్యా హిందీ అధ్యాపకుడైనా మాతృభాష తెలుగు కావడంతో తెలుగు పలుకుబడిని పలికించడంలో దిట్ట. ఆయన కవిత్వంలో ప్రకాశం జిల్లా అట్టడుగు ప్రజల గుండెఘోష మట్టి పరిమళాల్ని వెదజల్లేలా వినిపిస్తుంది. దళితసాహిత్యానికి డా.బి.ఆర్‌.అంబేద్కర్‌ భావజాలమే తాత్త్విక పునాది అన్నది మరిచిపోనివాడు రత్నాకర్‌. తన భాషను మర్చిపోకుండా ఉండడం; తానేది రాసినా, ఏది మాట్లాడినా తన ‘భావజాలాన్ని’ గుర్తెరగడం; సమకాలీన సమస్యల్ని గుర్తించి వాటికి తగిన పరిష్కారాల్ని కనుగొనే ప్రయత్నం చేయడం; ప్రత్యామ్నాయ సంస్కృతిని ఏర్పరుచుకోవడానికి ప్రేరణనివ్వడం; మూలాల్ని మర్చిపోవద్దనే చైతన్యం... ఇవన్నీ రత్నాకర్ లో ఉన్నాయి. సమాజంలో దళితులు, గిరిజనులు, బహుజనులు ఇలా ఒక్కొక్క పేరు పెట్టడం, అవసరాన్ని బట్టి వారిని కలిపి మాట్లాడ్డం లేదా విడిదీసి మాట్లాడటం చేసే మేధావుల్ని 'వర్ణమాల'లో దుయ్యబడతాడు రత్నాకర్. తాను రాసేది కవిత్వమైనా, మౌఖిక సంప్రదాయాన్ని వీడని కవి రత్నాకర్‌. కథ చెప్తున్నట్లు, దృశ్యం కదిలిస్తున్నట్లు, సొంత భాషలోనే ఆత్మీయంగా కవిత్వీకరించడం ఆయన శిల్పనైపుణ్యం. ‘‘ఆడే పాడే నా బిడ్డ అందమైన బిడ్డ/ బడి కొట్టాంకెల్లి అక్షరాలు దిద్ది/ కాలేజికెలతన్న నాబిడ్డ యాడయ్యా!’’ అంటూ కొనసాగే ‘మరణశాసనం’ కవితలో దళితవీరుల స్మరణను హృదయాల్ని ద్రవించేలా వర్ణించాడు కవి. ‘‘నేనెవురా!/ మడిసినండి/ కొర్రా దామరయ్యని/ దేశమంతా గగ్గోలెత్తిన/ వాకపల్లి గ్రామపెద్దని.../ నీతి న్యాయం/ ధర్యం, చట్టాలనే/ నాలుగు సింహాలకు/ అసలు రూపాలం మేమేననే పోలీసులు/ గ్రామ సింహాలై నా గూడేన్ని/ మనుషులు చింపిన ఇస్తరి చేశారండి’’ ('దేవుడి రాజ్యంలో...')- ఈ కవితలో వ్యంగ్యాన్ని చక్కని మౌఖిక సంప్రదాయంతో పలికించడం గమనించాలి.


సృజనకారుడిగా కవిత్వంలో భాషని ప్రయోగించడానికి కవికి స్వేచ్ఛ ఉంటుంది. కానీ, పరిశోధన, విమర్శ వ్యాసాల్ని రాసేటప్పుడు శైలి పట్ల జాగ్రత్త వహించాలి. ఇది తెలిసిన పరిశోధకుడు రత్నాకర్‌. అందుకే కవిత్వభాషకీ, విమర్శ భాషకీ మధ్య వ్యత్యాసాన్ని పాటిస్తాడు. ఈ మధ్య 'గబ్బగీము' పేరుతో వ్యాసాల సంపుటి ఒకదాన్ని తీసుకొచ్చాడు. ‘గబ్బగీము’ అంటే కారుచీకటి అనే అర్థం ఉంది. దళిత జీవితాల్లోని కటిక చీకటి కోణాల్ని విశ్లేషించే వ్యాసాలే కావడం వల్ల ఈ పేరు సార్థకంగానే కనిపిస్తుంది.


భగవాన్‌ దాస్‌ రాసిన ‘మై భంగీహా’ని అనువాదం చేసి రత్నాకర్‌ తెలుగు సాహిత్యానికి గొప్ప రచనను పరిచయం చేశాడు. ఇప్పడు ఆయన జీవితాన్ని, రచనల్ని పరిచయం చేసి తెలుగు సమాజం ఆయన్ని శాశ్వతంగా గుర్తుంచుకునేలా చేశాడు. భగవాన్‌ దాస్‌ గారిని స్వయంగా కలిసిన అనుభవాల్ని కూడా ఈ వ్యాసంలో పొందుపర్చాడు. 


మరాఠీ భాషలో దయాపవార్‌ (1935–1-996) శక్తిమంతమైన దళిత రచయితల్లో ఒకడు. ఆయన జీవితాన్ని, రచనలను తెలుగువారికి పరిచయం చేశాడు. దయాపవార్‌ రాసిన ‘బలూత్‌’ (అచూత్‌) అనే ఆత్మకథను మరాఠీ సాహిత్యంలో తొలి ఆత్మకథగా చెప్తారు. ఈ వ్యాస సంపుటిలో స్వామి అచూతానంద్‌, పండిట్‌ నాగార్జున్‌, సావిత్రిబాయి ఫూలే, అజ్ఞేయ్‌, మౌలానా ఆజాద్‌, బహుదూర్‌ సింహ్‌, సుధామా పాండేయ్‌ ధూమిల్‌, కేదార్‌ నాథ్‌ అగ్రవాల్‌, ఫణీశ్వర్‌ నాథ్‌, రమాబాయి అంబేద్కర్‌, బహన్‌ మాయావతి, కత్తిపద్మారావుల జీవితాన్ని, సాహిత్యాన్ని పరిచయం చేసే వ్యాసాలున్నాయి. వీటితో పాటు మరాఠీ సాహిత్యంలో వికసించిన ఆత్మకథాత్మక ప్రక్రియ గురించి ఒక మంచి వ్యాసం ఉంది. శరణ్‌ కుమార్‌ లింబాలే ‘దళిత్‌ బ్రాహ్మణ్‌’, కొలకలూరి ఇనాక్‌ ‘అస్పృశ్యగంగ’ రచనల్లో గల దళిత చైతన్యాన్ని తులనాత్మకంగా విశ్లేషించారు. వ్యక్తుల్ని, రచనల్ని, భావజాలాల్ని ఆధారంగా చేసుకొని భారతదేశవ్యాప్తంగా హిందీ భాషలో ప్రాచుర్యంలో ఉన్న దళిత చైతన్యాన్ని గుర్తించడానికి, తెలుసుకోవడానికి ఈ వ్యాసాలు ఎంతగానో ఉపకరిస్తాయి. వీటి ద్వారా రత్నాకర్‌ తులనాత్మక అధ్యయనవేత్తగా పాఠకులకు మరింత‍‍ దగ్గరవుతాడు.


రాసేదానికీ, ఆచరణకీ సమన్వయాన్ని చూపే వ్యక్తిత్వాన్ని రత్నాకర్‌‍లో గమనించాను. అందుకే ఆయన రచనలంటే నాకిష్టం. అట్టడుగు వర్గాలవాళ్ళు తమ ప్రత్యేక అస్తిత్వాన్ని కాపాడుకుంటూనే కలిసి పనిచేయాలని ఆకాంక్షిస్తుంటాడు. అందుకు కావాల్సిన తాత్త్వికధారను ప్రసరించే రచనలను హిందీ నుండి తెలుగులోకి కూడా అనువదించి ప్రచురిస్తుంటాడు. వీటన్నింటినీ గమనించే డా. జి.వి.రత్నాకర్‌ ఒక సామాజిక సాహిత్య ఉద్యమకారుడు అనగలుగుతున్నాను.

ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు

తెలుగుశాఖ, సెంట్రల్‌ యూనివర్సిటీ

(డా.జి.వి.రత్నాకర్‌ నేడు బోయి భీమన్నపురస్కారాన్ని అందుకోబోతున్న సందర్భంగా)

Advertisement
Advertisement