దళితుల పథకాలు పక్కాగా అమలు చేయాలి

ABN , First Publish Date - 2020-02-20T10:14:58+05:30 IST

దళితులకు ప్రభుత్వ పథకాలను పక్కాగా అమలు చేయడం ద్వారా వారిని అన్ని విధాలా అభివృద్ధి చేయాలని

దళితుల పథకాలు పక్కాగా అమలు చేయాలి

గుజరాతీపేట, ఫిబ్రవరి 19: దళితులకు ప్రభుత్వ పథకాలను పక్కాగా అమలు చేయడం ద్వారా వారిని అన్ని విధాలా అభివృద్ధి చేయాలని ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఎస్సీ కమిటీ ఛైర్మన్‌ గొల్ల బాబూరావు ఆదేశించారు. బుధవారం స్థానిక జడ్పీ సమావేశమందిరంలో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అలాగే విలేఖరులతో మాట్లాడుతూ.. సంక్షేమ, అభివృద్ధి పథకాలను సాహసోపేతంగా అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికే దక్కిందన్నారు.


అట్రాసిటీ కేసులు, ఎస్సీల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, బ్యాక్‌లాగ్‌ పోస్టుల ఖాళీలు, ఉద్యోగాల్లో రోస్టర్‌ అమలు తదితర కార్యక్రమాలను సమీక్షించేందుకు వచ్చామని చెప్పారు. ప్రతి అధికారి ఎస్సీలకు న్యాయం చేసేందుకు కృషి చేసే గురుతర బాధ్యతలను తీసుకోవా లని కోరారు. జిల్లాలో ఎస్సీల సమస్యలన్నింటినీ నివేదిక రూపంలో ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. ఐదుగురు ఉప ముఖ్యమంత్రులుగా నియమించిన ఘనత సీఎందే నన్నారు. బ్యాక్‌లాగ్‌ పోస్టులను భర్తీ చేస్తామన్నారు.


సంక్షేమ పథకాలను అమలులో జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని కోరారు. ఎస్సీల అభివృద్ధికి కేటాయించిన స్పెషల్‌ కాంపోనింట్‌ ప్లాన్‌ నిధులను సక్రమంగా ఖర్చు చేయాల న్నారు. నవశకం కార్యక్రమానికి స్థలాలు సేకరించేటప్పుడు ఎస్సీ భూములను మినహాయించాలని ఆదేశించారు. కార్యక్రమంలో మంత్రి ధర్మాన కృష్ణదాస్‌, కమిటీ సభ్యులు కంబాల జోగులు, కె.చిట్టిబాబు, వెన్నుమట్ల ఎలైజా, ఏ.జోగారావు, జి.సంధ్యారాణి, వై.శ్రీనివాసరెడ్డి, ఎస్పీ అమ్మిరెడ్డి, ఇన్‌చార్జి కలెక్టర్‌ డా. కె.శ్రీనివాసులు, డీఆర్వో దయానిధి, పలాస ఎమ్మెల్యే డా. సీదిరి అప్పలరాజు, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ మహాలక్ష్మి, సాంఘిక సంక్షేమ ఉపసంచాలకురాలు ఆదిత్య లక్ష్మి, డీఈవో చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-02-20T10:14:58+05:30 IST