కులవివక్షల సుడిలో దళిత సర్పంచ్‌లు

ABN , First Publish Date - 2022-06-30T06:43:37+05:30 IST

దళిత బహుజనవర్గాలకు ‘రాజ్యాధికారం’ దక్కాలనే నినాదాలు మనకు నిత్యానుభవమే. పాలకవర్గ పార్టీలు తమ ఎన్నికల ఎత్తుగడలకోసం..

కులవివక్షల సుడిలో దళిత సర్పంచ్‌లు

దళిత బహుజనవర్గాలకు ‘రాజ్యాధికారం’ దక్కాలనే నినాదాలు మనకు నిత్యానుభవమే. పాలకవర్గ పార్టీలు తమ ఎన్నికల ఎత్తుగడలకోసం దళిత ప్రముఖులను రాష్ట్రపతి, ముఖ్యమంత్రి, న్యాయమూర్తి పదవులలో నియమిస్తున్నాయి. అయితే సమాజంలో అట్టడుగు స్థాయిలో వివక్షలూ, దోపిడీ పెత్తనాలూ కొనసాగుతూనే ఉన్నాయి. రిజర్వేషన్ల పుణ్యమా అని, దళిత ఐఏయస్, ఐపియస్, తదితర అధికార వర్గమూ ఏర్పడింది కానీ, వారు పాలక వర్గాల సేవలో మునిగి, విశాల ప్రజానీకం వెతలను పట్టించుకొనే స్థితిలో లేరు. తమిళనాడులో 69శాతం రిజర్వేషన్లు ఇస్తున్నారని, అలా అన్ని రాష్ట్రాలలోనూ ఇవ్వాలని దళిత బహుజన ఉద్యమాలు చేసేవారే కానీ, పీడితుల, తాడితుల ఉద్ధరణకు అంకితమైన వారు అరుదు. పెరియార్ గడ్డపై సంభవిస్తున్న దారుణాలకు సంబంధించి 2019 నవంబర్‌లో బహిర్గతమైన మూడు వాస్తవాలను చూద్దాం.


మొదటిది కులవివక్ష విస్తృతి. రాజ్యాంగబద్ధ హక్కులు గ్రామ సర్పంచులకే దక్కకుండా కాలరాచివేస్తున్నారు. తమిళనాడులో ఇప్పటిదాకా సర్పంచ్‌లుగా ఎన్నికైన 4000మంది దళితుల్లో 1200మంది కులవివక్షను ఎదుర్కొంటున్నారని రంగస్వామి ఎలాంగో నిర్ధారించారు. సియస్ఐఆర్ సైంటిస్టు ఉద్యోగానికి రాజీనామా చేసి, కన్న ఊరు (చెన్నైకి కూతవేటు దూరంలో ఉన్న కూతంబాక్కం) ప్రజల కోరిక మేరకు సర్పంచ్‌గా గెలిచి, 1996–2006 మధ్య ఆ పదవీ బాధ్యతలు నిర్వర్తించిన దళిత బుద్ధిజీవి రంగస్వామి. తన అనుభవాలతో ఆయన ఒక ‘పంచాయత్ అకాడమీ’ని స్థాపించారు. ఆ సంస్థ ద్వారా ఇంతవరకు 700 మంది సర్పంచ్‌లకు గ్రామపాలనలో శిక్షణ ఇచ్చారు. ఈ క్రమంలో నిశిత పరిశీలనతో దళిత సర్పంచ్‌లు ఎదుర్కొంటున్న వివక్ష ఏ స్థాయిలో ఉందో ఆయన అవగతం చేసుకున్నారు.


రెండోది కుల వివక్ష వికృతాలు. తమిళనాడులోని దళిత సర్పంచ్‌లు 13 రకాల కులవివక్షను ఎదుర్కొంటున్నారని గాంధీగ్రామ్ విశ్వవిద్యాలయ మాజీ ప్రొఫెసరు జి. పళనితురై నిర్ధారించారు. గ్రామపాలనా నిర్వహణ గురించి ఏళ్ల తరబడి పరిశీలించి, ‘దళిత పంచాయత్ సర్పంచ్‌ల సమాఖ్య’ను స్థాపించి, వారికి యూనివర్సిటీలో ఆయన పలు శిక్షణ శిబిరాలు నిర్వహించారు. ఆ వికృతాలు ఎలా ఉన్నాయో చూడండి : పంచాయతీ కార్యాలయంలో కుర్చీలో కూర్చోనివ్వరు, జెండా ఆవిష్కరణ చేయనివ్వరు; రెవెన్యూ తదితర అధికారిక రికార్డు లివ్వరు; పంచాయతీ లెక్కలు చెప్పరు; వారి అభిప్రాయాలకు విలువనివ్వరు, నిర్ణయాధికారాలుండవు; సామాజిక న్యాయ సమస్యలను లేవనెత్తనివ్వరు; పై కులాలకు చెందిన ఉపాధ్యక్షులూ, ఇతరులదే పూర్తి అజమాయిషీ; గట్టిగా నిలబడిన సర్పంచ్‌లపై భౌతికదాడులు; గ్రామంలో పంచాయతీ గుమాస్తాలు, ప్రభుత్వ ఆఫీసులకు పనిపై వెళ్తే అక్కడి అధికారులూ ఖాతరుచేయరు; ఇన్ని జరిగినా, తమపార్టీ ఏం చెబితే అదిచేయాలి; అన్యాయాల పట్ల మౌనం వహించి తీరాలి. ఇవన్నీ సామాజిక జీవితంలో కాక, అధికార బాధ్యతల నిర్వహణలో తలెత్తే సమస్యలని పళనితురై చెప్పారు. ‘నేను రిటైరైన కొద్దికాలానికే అధికార పార్టీల జోక్యంతో విధి నిర్వహణలో ఎదురయ్యే సమస్యల నధిగమించేందుకై దళిత సర్పంచ్‌లకు శిక్షణ నిచ్చే కృషి ఆగిపోయింది. పెరియార్ పుట్టిన గడ్డపై జీవిస్తున్నామని చెప్పుకోటానికి సిగ్గుపడాలి’ అని ఆయన అన్నారు.


విధి నిర్వహణలో ఎదురయ్యే అవరోధాలు, అవమానాలను నివారించుకునేందుకై దళిత సర్పంచ్‌లకు రంగస్వామి ఎలాంగో ‘కొన్ని ఎత్తుగడలు’ సూచించారు. అవి: పై కులాల పెద్దలను కలిసి, వారి ‘ఆమోదాన్ని’ పొందేందుకు ప్రయత్నించడం; ఘర్షణాత్మక వైఖరితో కాక, సామరస్యంగా వ్యవహరించడం; కుర్చీలో కూర్చోనివ్వక పోతే, క్రింద కూర్చోవడం; పంచాయతీ ఆఫీసులోకి రానివ్వకపోతే ఇంటినుంచే పనిచేయడం; భేషజాలు పూర్తిగా వదిలేయడం. ‘ఇలా ఆరునెలలు ఓపిగ్గా పనిచేస్తే, చాలామంది మారుతారు; మేం శిక్షణ ఇచ్చిన కొందరు అలా చేసారుకూడా’ అని రంగస్వామి తెలిపారు. తమిళనాడు పాలక వర్గాల వైఖరి దృష్ట్యా ఆయన సూచనలు బహుశా సబబైనవేమో! ఏమైనా ఆయన చెప్పినది ‘ఆత్మగౌరవ ఉద్యమ’ రాష్ట్రానికి సిగ్గు చేటే కదా!


మూడోది పెరియారిస్టు పార్టీల, ప్రభుత్వాల ఆచరణ. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన దళిత సర్పంచ్‌ల పట్ల కులవివక్షకు పరాకాష్ఠ ‘మేలవలవు’ గ్రామ మారణకాండ ఉదంతం. 1996లో డిఎంకే నాలుగోసారి అధికారంలోకి వచ్చింది. వచ్చిన ఏడాదికే, 1997 జూన్ 30న మేలవలపు సర్పంచ్ మురుగేశన్, అతని తమ్ముడు, ఉపసర్పంచి, మరో నలుగురు – అందరూ దళితులే– హత్యకు గురయ్యారు. మేలవలపు గ్రామ పంచాయత్‌ను దళితులకు రిజర్వ్ చేయడం అదే మొదటిసారి. అయినా దళితులు ‘ఎవ్వరూ’ పోటీచేయరాదని తేవర్లు మొదలైన బహుజన కులాల వారు తీవ్ర అభ్యంతరం తెలిపారు. దళితులపై దాడులు చేశారు. గృహదహనాలు మొదలైన దురాగతాలకు పాల్పడ్డారు. వాటన్నిటినీ ఎదుర్కొని గెలిచిన బృందమది. తమకు ఎదురవుతున్న అడ్డంకులను చెప్పి, తగులబెట్టిన ఇళ్లకు పరిహారం కోరటానికి మదురై వెళ్లి, జిల్లా కలెక్టర్ ఇచ్చిన హామీలకే తబ్బిబ్బై, తిరిగొస్తుండగా వారు దారుణ హత్యాకాండకు గురయ్యారు. ప్రయాణిస్తున్న బస్సును ఆపి, వారిని బయటకు లాగి బాహాటంగా నరికేసారు! (విసికె తిరుమవలన్ అనే వ్యక్తి మదురైలోని అంబేడ్కర్ నగర్‌లో ఆ ఏడుగురికి ఒక స్మారక చిహ్నాన్ని నిర్మించాడు). హంతకముఠాలోని 44 మందిపై విచారణ తర్వాత, 17మందికి యావజ్జీవ శిక్షలు మాత్రమే వేశారు. ఆ తీర్పుని, ముఖ్యంగా 24మంది విడుదలను ప్రభుత్వాలు సవాలు చేయలేదు. చేయకపోగా, శిక్షపడిన ముగ్గురిని 2008లో డిఎంకే, 13 మందిని 2019లో అన్నా డిఎంకే ‘జైల్లో సత్ప్రవర్తనకు మెచ్చి’, అన్నాదురై, ఎంజీఆర్‌ల జయంతుల సాకుతో విడుదల చేశారు! డబ్బు, కులం, సారా, ఇత్యాది ప్రలోభాలతో పాటు అధికార దుర్వినియోగంతో జరిపే ఎన్నికల తంతునే అతి పెద్ద ప్రజాస్వామ్యంగా చెలామణీచేసి, నిరంకుశత్వాన్ని నెరపుతున్న వ్యవస్థ మనది. నడిమి కులాల నయా భూస్వామ్య వర్గాల, పెత్తందార్ల, దళారీ పెట్టుబడిదారుల దోపిడీని, కులవివక్షనూ ప్రశ్నించే గొంతులు దాదాపు లేవు. 


యం. జయలక్ష్మి

Updated Date - 2022-06-30T06:43:37+05:30 IST