గ్రాంసీ దృక్కోణంలో దళిత ఉద్యమం

ABN , First Publish Date - 2020-09-04T06:24:57+05:30 IST

ఆంధ్రప్రాంతంలో 1980 దశకంలో కొన్ని పరిణామాలు చోటుచేసుకున్నాయి. వాటి పర్యవసానంగా ఆంధ్ర ప్రాంతంలో దళిత ఉద్యమం విస్తరించింది. దళిత మహాసభ పేరుతో...

గ్రాంసీ దృక్కోణంలో దళిత ఉద్యమం

ఇటాలియన్ మార్క్సిస్టు మేధావి ఆంటోనియో గ్రాంసీ (1891-–1937) ఆలోచనల వెలుగులో సమకాలీన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విశ్లేషణే డివివిఎస్ వర్మ రచన ‘ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ ప్రయోగాలు 1952–-2020’. ఇరవయ్యో శతాబ్దంలో విస్తరించిన పౌర సమాజానికి మార్క్స్ భావజాలాన్ని వర్తింపజేసి గ్రాంసీ హెజమనీ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఆధిపత్య వర్గాలు తమ అధికారానికి అనుకూలంగా ప్రజాసమ్మతిని పొందడాన్ని హెజమనీగా గ్రాంసీ నిర్వచించారు. ఏడు దశాబ్దాల ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఐదు దశలుగా ఆ ప్రజాసమ్మతి పొందిన మార్పులను ఆ సిద్ధాంత నేపథ్యంలో వర్మ ప్రతిభావంతంగా వివరించారు. 1985లో కారంచేడులో ఆధిపత్య వర్గాలకు చెందిన కుల దురహంకారులు దళితవాడపై సాగించిన మారణకాండ నేపథ్యంగా దళిత మహాసభ ఆవిర్భావం ఆ ఐదు దశలలో మూడోది. సమకాలీన చరిత్రలో ఆ ఉద్యమ సంస్థ నిర్వహించిన పాత్రపై కొత్త చూపుతో చేసిన నిశిత విశ్లేషణ ఇది.


ఆరు దశాబ్దాల ప్రత్యక్ష రాజకీయ అనుభవమున్న మేధావి, నిరంతరం ప్రజల హితం కోరుతూ కొత్త బాటలు వెదికే అన్వేషి డివివిఎస్ వర్మ.


దళిత మహాసభ ఒక ఉద్యమంగా జయప్రదం కాకపోయినా దాని ప్రభావం రాజకీయ రంగం మీద దళిత, బహుజన శక్తుల ప్రాధాన్యతని పెంచింది. దళిత మహాసభ ఉద్యమాలు చరిత్రలో భాగం అయ్యాయి. అవి ఆయా సమూహాల ఆలోచనలలో భాగంగా కొనసాగుతున్నాయి. మరో ప్రయత్నానికి అది పునాది అవుతుంది.


ఆంధ్రప్రాంతంలో 1980 దశకంలో కొన్ని పరిణామాలు చోటుచేసుకున్నాయి. వాటి పర్యవసానంగా ఆంధ్ర ప్రాంతంలో దళిత ఉద్యమం విస్తరించింది. దళిత మహాసభ పేరుతో అది సంస్థాగత రూపం పొందింది. కోస్తా జిల్లాలలో హరిత విప్లవం తర్వాత ఈ 15 సంవత్సరాల కాలంలో ధనిక రైతుల వ్యవసాయ ఆదాయం పెరిగింది. అది గ్రామీణ ప్రాంతంలో అంతరాలను మరింతగా పెంచింది. ఇది స్థానికంగా ఆధిపత్య కులాలకి, పేదలకి మధ్య వైరుధ్యాన్ని పెంచింది.


1985లో కారంచేడులో ఆధిపత్య కులానికి చెందిన భూస్వామ్య దురహంకార శక్తులు తమ బలగాలతో దళితుల వాడపై సామూహిక దాడి చేశారు. ఈ దాడిలో ఆరుగురు దళితులని వెంటాడి చంపారు. చాలామందిని తీవ్రంగా గాయపరిచారు. ఇద్దరు మహిళలను మానభంగం చేశారు. దళితులు అక్కడి నుంచి తప్పించుకుని మొదట చీరాల చర్చిలో తలదాచుకున్నారు. తరువాత వారు ఒక శిబిరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ శిబిరాన్ని నిర్వహించడానికి రాష్ట్రవ్యాప్తంగా దళిత సంఘాలతో పాటు దళితేతర సంఘాలు తోడ్పాటునిచ్చాయి. ఈ శిబిరానికి ప్రముఖ హక్కుల పోరాట నాయకుడు బొజ్జా తారకం, ప్రముఖ హేతువాది కత్తి పద్మారావులు చేరుకుని ఈ ఉద్యమానికి కొత్త విశ్వాసాన్ని కల్పించారు. వారే ఈ దళిత శిబిరానికి నాయకత్వంగా నిలిచారు. ఈ శిబిరం కేంద్రంగా కారంచేడు హత్యాకాండకు కారకులైన వారిపై కేసులు నమోదు చేసి శిక్షించాలని, బాధితులకు చీరాలలోనే నివాస వసతి కల్పించాలని, వారి ఉపాధికి ప్రత్యేకంగా భూ పంపిణీ చేయాలని కోరుతూ ఆందోళనలు సాగించారు. అయిదు లక్షల మందితో చలో హైదరాబాద్‌ సమీకరణతో ప్రభుత్వం దిగివచ్చి ఈ ఘటనపై న్యాయ విచారణకు ఆదేశించింది. కానీ ఇతర డిమాండ్లు అలాగే ఉండిపోయాయి. వీటి కోసం వేలాది మందిని సమీకరించి ఉద్యమించారు. ఈ ఉద్యమాలలో అంబేడ్కర్‌, జ్యోతిబా పూలే, మార్క్స్‌ భావజాల స్రవంతుల వారు హేతువాదులు, రాడికల్స్‌ అందరూ భాగస్వాములయ్యారు.


1986లో తెనాలిలో దళిత మహాసభ తొలి మహాసభ నిర్వహించారు. అక్కడ దళిత మహాసభ మేనిఫెస్టోని విడుదల చేశారు. ఈ మేనిఫెస్టోలో పై స్రవంతుల ప్రభావం కనిపిస్తుంది. ఈ భావజాల వ్యాప్తికి దళిత పత్రికలు కీలక పాత్ర పోషించాయి. దళిత శక్తి, నలుపు, ఎదురీత, ఈనాటి ఏకలవ్య, కుల నిర్మూలన వంటి పత్రికలు భారత చరిత్ర, సమాజం, రాజకీయాల మీద శక్తిమంతమైన చర్చలు సాగించాయి. మార్క్సిజం మీద, అంబేడ్కరిజం మీద సిద్ధాంత పరమైన చర్చ సాగించాయి. వర్గ, కుల సమస్యల మీద, భారతదేశంలో కులానికున్న ప్రత్యేక ప్రాధాన్యత మీద చర్చలు సాగించాయి.


దళిత మహాసభ చొరవతో మహాత్మాపూలే, పెరియార్‌, నారాయణ గురు, అంబేడ్కర్‌ రచనలకు తెలుగులో అనువాదాలను ప్రచురించారు. ఈ దళిత మేధావుల రచనలను చర్చకు పెట్టి వాటి ద్వారా కుల - వర్గ దృక్పథంతో చరిత్రని పునర్నిర్మించడానికి, సమాజాన్ని అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించారు. సాంస్కృతిక దళాలు బుర్రకథ, జముకుల కథలు తదితర రూపాలలో ప్రచారాన్ని నిర్వహించాయి. మొత్తం మీద దళిత మహాసభ తన ప్రారంభ దశలో బహుముఖ కార్యకలాపాల ద్వారా పీడిత వర్గాలలో కొత్త చైతన్యానికి పునాదులు వేసింది. ఆంధ్రప్రదేశ్‌లో దళిత- బహుజన హెజమనీకి, ఆధిపత్య పాలక వర్గాలకు ప్రత్యామ్నాయంగా రాజ్యాధికారం కోసం జరిగిన తొలి ప్రయత్నం ఇది. ఆంటోనీ గ్రాంసీ ఉప శ్రేణుల హెజమనీ మీద రూపొందించిన భావజాలానికి ఇక్కడ దళిత మహాసభ చేసిన ప్రయత్నాలకు కొన్ని పోలికలు ఉన్నాయి. దళిత మహాసభ నాయకులకు గ్రాంసీ భావజాల పరిచయం ఉన్నట్లు ఈ ఉద్యమాన్ని పరిశోధించినవారు ప్రస్తావించలేదు. అలాంటి ప్రస్తావన దళిత మహాసభ నాయకుల ప్రసంగాలలో ఉన్న దాఖలాలు కనిపించడం లేదు. అందుచేత ఈ ఉద్యమంలో కనిపించే గ్రాంసీ భావజాల పోలికలు సద్యోజనితమైనవి గానే భావించవచ్చు. అయితే పోలికలు ఉన్నందువల్ల ఈ ఉద్యమ విశ్లేషణకు గ్రాంసీ భావజాలం నిస్సందేహంగా ఉపకరిస్తుంది.


గ్రాంసీ ఉప శ్రేణుల నిర్వచనాన్ని విస్తృతపరిచాడు. కార్మిక వర్గంతో సహా పలు రూపాలలో దోపిడీకి, అణచివేతకు గురవుతున్న సమూహాలన్నింటితో పాటు, భాషాపరంగా, ప్రాంతీయపరంగా అణచివేతకు గురవుతున్న తరగతుల అస్తిత్వవాద ఉద్యమాలు, వివక్షకు గురవుతున్న మహిళల సమూహాలను మైనారిటీలను ఉప శ్రేణుల పరిధిలో నిర్వచించాడు ప్రత్నామ్నాయ హెజమనీలో ఈ ఉప శ్రేణుల సంఘటన వహించే కీలక పాత్రను పేర్కొన్నాడు.


దళిత మహాసభ తన మేనిఫెస్టోలో దళిత పదానికి కూడా విశాలమైన నిర్వచనాన్ని ఇచ్చింది. ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనారిటీలు అందరూ దళితులేనని కుల వర్గ దోపిడీకి, అణచివేతకు గురైన వారి అందరి ఐక్య సంఘటనకు దళిత పదం ప్రాతినిధ్యం వహిస్తుందని ప్రకటించింది. ఇది పౌర సమాజంలో అత్యధిక సంఖ్యాకులుగా ఉన్న ఉప శ్రేణి కులాల సంఘటనగా ప్రకటించారు.


గ్రాంసీ భావజాలం ప్రకారం ఈ ఉప శ్రేణులకు నాయకత్వం వహించే వర్గం కేవలం తన వర్గ ప్రయోజనాలకే పరిమితం కాకూడదు. అది ఈ ఐక్య సంఘటనలోని అన్ని సమూహాల ఆకాంక్షలను తన ఆకాంక్షలుగా వ్యక్తం చేయడం ద్వారా దీని కోసం అవసరమైన మేరకు తన ప్రయోజనాలను కొన్నింటిని వదులుకోవడానికి, మార్చుకోవడానికి సిద్ధపడాలి. దీనికి ఒక ఉమ్మడి భావజాలాన్ని అందరూ దానిని తమ స్వంత భావజాలంగా భావించే రీతిలో రూపొందించాలి. దీని ద్వారా ఒక ఉమ్మడి సమ్మతిని సాధించాలి.


దళిత మహాసభ కూడా కుల వర్గ నిర్మూలనను అందరి ఆకాంక్షలనూ సాధించే ఉమ్మడి అంశంగా ప్రతిపాదించింది.

గ్రాంసీ ఉప శ్రేణుల ఐక్యత విడి విడి సంఘటన కాకుండా అది ఒక సమ్మేళనంగా ఒక చారిత్రక ముద్దగా రూపొందినప్పుడే ఈ ఉప శ్రేణులు సమాజంలో హెజమనీ సాధించే స్థితి వస్తుందని సూత్రీకరించాడు.

దీనిని దళిత మహాసభ సాధించలేకపోయింది. దళిత పదానికి విశాలమైన నిర్వచనం ఇచ్చినా అది ఎస్‌సిలకే పరిమితం అయ్యింది. ఎస్‌టిలు, బిసిలు తాము కూడా దళితులమేనని ప్రకటించుకున్న సందర్భాలు లేవు. నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ వారిని విడి విడి సమూహాలుగా ఉంచింది. అది దళిత పదం గొడుగులో ఒక చారిత్రక ముద్దగా రూపొందలేదు.


గ్రాంసీ ఇలాంటి చారిత్రక ముద్దను రూపొందించడానికి తమ సవర్గ మేధావులను రూపొందించుకోవలసిన ఆవశ్యకతను వివరించాడు. ఈ సవర్గ మేధావులు ఉప శ్రేణులను కలిపి ఉంచే చరిత్రను, సామాజిక, సాంస్కృతిక భావజాలాన్ని పెంపొందించడం మాత్రమే కాదు. వారితో సజీవ సంబంధాల ద్వారా ఈ ఐక్యతను ప్రోది చేసేవారు కావాలని సూచించాడు.

దళిత మహాసభ కూడా తన రచయితల విభాగాన్ని ఏర్పాటు చేసింది. వారు చరిత్ర, సామాజిక ఉద్యమాల పైన, ప్రచార సాహిత్యంపైనా చాలా కృషి చేశారు. ఎంతో వైవిధ్యం గల సాహిత్య సృష్టి చేశారు. అయితే ఈ ఉప శ్రేణులు ఎవరికి వారు తమ కులపరమైన అస్తిత్వ వాదానికి పరిమితం అయ్యారు. ఇవి విడి విడి అస్తిత్వ వాద సాహితీ ఉద్యమాలు గానే ఉండిపోయాయి.


గ్రాంసీ ఈ ఉపశ్రేణుల భావజాలాన్ని ఒక సాంస్కృతిక ఉద్యమంగా సాగించి భావ విప్లవాన్ని సాధించాలని ప్రతిపాదించాడు. ప్రజలను నిత్యజీవితంలో నడిపించేది వారికి అందుబాటులో ఉన్న లోకజ్ఞానం అనీ దానిని విచక్షణా జ్ఞానంగా మార్చడం ఈ భావ విప్లవ లక్ష్యంగా ప్రకటించారు. దళిత మహాసభ ప్రత్యేక సాంస్కృతిక రంగాన్ని ఏర్పాటు చేసినా అది ఉమ్మడి భావజాలాన్ని ప్రచారం చేసేదిగా సామాన్య ప్రజల లోకజ్ఞానాన్ని, విచక్షణా జ్ఞానంగా మార్చే ఉమ్మడి భావ విప్లవాన్ని సాధించే దిశగా అడుగులు పడలేదు.


గ్రాంసీ ఈ రాజకీయ సైద్ధాంతిక, సామాజిక సాంస్కృతిక ఉద్యమం కింది నుంచి నిర్మాణం కావాలని అప్పుడే అది విజయం సాధించే స్థితికి చేరుకుంటుఉందని విశ్లేషించారు.

బహుజన సమాజ్‌ పార్టీ రూపంలో 1994 ఎన్నికలలో పై నుంచి ఏర్పాటు చేసిన ఉప శ్రేణి కులాల రాజకీయ సంఘటన ప్రయోగం జయప్రదం కాలేదు. అది అట్టడుగు స్థాయిలో దళిత బహుజనుల ఉమ్మడి చైతన్యం నుంచి పుట్టింది కాదు. 1988లో దళిత మహాసభ రెండోసారి జరిగింది. ప్రారంభంలో దీని కార్యకలాపాలు ప్రధానంగా సామాజిక, సాంస్కృతిక రంగానికే పరిమితంగా ఉన్నాయి. ఈ సభలో నాయకత్వంలో వచ్చిన విభేదాలతో దళిత మహాసభ చీలిపోయింది. 1991లో పద్మారావు గ్రూపు విజయవాడలో, బొజ్జా తారకం గ్రూపు ఒంగోలులో వేరు వేరుగా సభలు నిర్వహించారు. ఇవే దళిత మహాసభ చివరి సమావేశాలు అయ్యాయి. ఆ తర్వాత దళిత ఉద్యమం అంతర్గత కుల వైరుధ్యంతో మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితిగా, మాల మహానాడుగా చీలిపోయింది. దీనితో దళిత మహాసభ తన అస్తిత్వాన్ని కోల్పోయింది. దళిత, బహుజన హెజమనీ ఆలోచనగానే మిగిలిపోయింది.


దళిత మహాసభ ఒక ఉద్యమంగా జయప్రదం కాకపోయినా దాని ప్రభావం రాజకీయ రంగం మీద ఈ శక్తుల ప్రాధాన్యతని పెంచింది. దళిత మహాసభ ఉద్యమాలు చరిత్రలో భాగం అయ్యాయి. అవి ఆయా సమూహాల ఆలోచనలలో భాగంగా కొనసాగుతున్నాయి. మరో ప్రయత్నానికి అది పునాది అవుతుంది.

(‘ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ ప్రయోగాలు’ పుస్తకంలో 

ఒక భాగానికి ఇది సంక్షిప్త రూపం)

Updated Date - 2020-09-04T06:24:57+05:30 IST