పెరియార్ గడ్డపై దళిత సంహారం

ABN , First Publish Date - 2021-12-30T06:23:52+05:30 IST

అదొక భయానక హేమంతం! 1968 డిసెంబర్‌లో కీళవెన్మణి మారణకాండ గురించి నేను ప్రస్తావిస్తున్నాను. ఆ ఏడాది క్రిస్మస్ రాత్రి ఆ ఊరిలోని దళితులకు కాళరాత్రే అయింది. దళిత వ్యవసాయ కూలీ కుటుంబాల వారు...

పెరియార్ గడ్డపై దళిత సంహారం

అదొక భయానక హేమంతం! 1968 డిసెంబర్‌లో కీళవెన్మణి మారణకాండ గురించి నేను ప్రస్తావిస్తున్నాను. ఆ ఏడాది క్రిస్మస్ రాత్రి ఆ ఊరిలోని దళితులకు కాళరాత్రే అయింది. దళిత వ్యవసాయ కూలీ కుటుంబాల వారు 44 మంది (వీరిలో 20 మంది మహిళలు, 16 మంది పిల్లలు ఉన్నారు) సజీవదహనానికి గురయ్యారు. ఈ దారుణం ఎందుకు సంభవించింది? 


కూలిరేట్లు పెంచాలని కీళవెన్మణి వ్యవసాయ శ్రామికులు ఆందోళన చేస్తున్నారు. క్రిస్మస్ పండుగ రాత్రి 100మంది భూస్వాముల గూండాలు పోలీసు వ్యాన్లలో గ్రామంలో ప్రవేశించి దళిత వాడను దిగ్బంధం చేశారు. నిజానికి పోలీసులు అంతకుముందే ఈ దారుణ కృత్యానికి సన్నాహాలు చేసారు. అది ‘ఆత్మగౌరవ ఉద్యమ’ పార్టీ డిఎంకే ప్రప్రథమంగా అధికారానికి వచ్చిన కాలమది. అయితే దళిత పేదలకు ఎలాంటి న్యాయం లభించలేదు. 1970లో కీలవెన్మణి కేసులోని 25 మంది నేరస్థులలో 10మందికి క్రింది కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే మద్రాస్ హైకోర్టు 1975 కల్లా అందరినీ విడిచిపెట్టింది. ‘అగ్రకులస్తులు అంటరానివారి వాడలోకి వచ్చి ఇలా చేసారంటే నమ్మశక్యంగా లేద’ని ఆ ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది! 1980లో ప్రధాన నిందితుడిని నక్సలైట్లు హత్య చేసారు. ఈ సంఘటనకు సంబంధించిన కేసులనుంచి దళితులు బయటపడేందుకు బయటపడేందుకు అదే ఉన్నత న్యాయస్థానంలో 14 ఏళ్లు పట్టింది. దేశ సర్వోన్నత న్యాయస్థానంలోనూ పేదలకు అదే న్యాయం దక్కింది.


తమిళనాట ఆత్మ గౌరవ ఉద్యమాన్ని ప్రారంభించిన పెరియార్ రామస్వామి నాయకర్ (1879– 1973) పుట్టినరోజు సెప్టెంబరు 17ని ‘సామాజిక న్యాయ దినం’గా నిర్వహించాలని తమిళనాడు శాసనసభ నిర్ణయించింది. 1967 నుంచీ తమిళనాడులో రెండే పార్టీలు- డిఎంకె, అన్నా డిఎంకె- అధికారంలో ఉంటూ వస్తున్నాయి. ఈ రెండు పార్టీలూ పెరియార్ ఉద్యమవారసులే. అయినా ఆత్మగౌరవ ఉద్యమం పుట్టిల్లు అయిన తమిళనాడు నేటికీ కుల రాజకీయాలకు, కుల వివక్ష దారుణాలకు కేంద్రంగా ఉన్నది. 2016 నుంచి 2020 మధ్య దాకా తమిళనాడులో 300 మంది దళితులు హత్యకు గురయ్యారు. ఈ దారుణాలకు సంబంధించి కేవలం 13 కేసుల్లో మాత్రమే తీర్పులు వచ్చాయి.


ఆ దారుణాల విషయమై ఉభయ ద్రవిడ పార్టీలు, మీడియా మౌనం వహిస్తున్నాయి. ఉత్తర భారతావనిలో, ముఖ్యంగా జాట్ సామాజికుల ప్రాబల్యమున్న ప్రాంతాలలో తరచు సంభవించే ‘పరువు హత్యలు’ అందరికీ తెలిసిన విషయమే. తమిళనాడులో సైతం పరువు హత్యలు తక్కువేమీ కాదు. ఇంకా చెప్పాలంటే ఆ వార్తలు బయటకు రాకుండా చూస్తున్నారు. తమ కులానికి చెందిన యువతుల్ని దళిత యువకులు ప్రేమ వలలో పడేసి పెళ్లి చేసుకుంటున్నారని, వాటిని నిషేధించాలని అక్కడి వన్నియార్ కుల సంఘమూ, వారి పీఎంకే పార్టీ బాహాటంగా డిమాండు చేస్తున్నాయి. దళితులపై దాడులకూ పాల్పడుతున్నాయి. అయినా ఆ పార్టీతో ఉభయ ద్రవిడ పార్టీలూ ఎన్నికల పొత్తు పెట్టుకుంటూనే ఉన్నాయి. 


జాట్‌ల ఖాప్ పంచాయతీలు తెలిసినంతగా తమిళనాడు కట్ట పంచాయతీలు మనకి తెలియవు. లవ్ జిహాద్ గురించి తెలిసినంతగా దళిత యువకులను వన్నియార్లు బాహాటంగా వేటాడి సాగించే హింసలు, హత్యలు తెలియవు. తమిళనాట పోలీసు వ్యవస్థ చాలా ఆధునికం, సమర్థమైనదీ అని పేరుంది. నిజమే, 300 మంది దళితులు హత్యకు గురైతే, అనేక కేసుల్లో ఎఫ్‌ఐఆర్‌లు కూడా నమోదుకాకుండా, నేరస్థులకు శిక్షలు పడకుండా చూడటంలో వారు కడు సమర్థులు. శ్రీలంక తమిళులపై ఈగ వాలినా పతాక శీర్షికలుంటాయి. కానీ ‘ఆ’ వార్తలు రాకుండా ‘ఆత్మ గౌరవ ఉద్యమం’ పరువు నిలబెట్టటంలో చురుగ్గా ఉండే మీడియా తమిళనాట ఉంది.


2014–16 సంవత్సరాల మధ్య 356 పరువుహత్యలు జరిగినట్టు, రాష్ట్రాల వారీగా, గ్రాఫిక్స్‌తో 2018లో ఒక జాతీయ దినపత్రికలో వచ్చిన కథనంలో తమిళనాడు ప్రస్తావనే లేదు. అలాగే 2017–19 మధ్య 145 పరువుహత్యలు జరిగినట్టు గత ఆగస్టులో కేంద్ర మంత్రి ఒకరు పార్లమెంటులో వెల్లడించిన వివరాల్లో తమిళనాడు ప్రస్తావన లేదు. తమిళ మీడియా అంత ‘సమర్థం’గా ఉంది మరి. 2012–17 సంవత్సరాల మధ్య ఒక్క తమిళనాడులో 187 పరువు హత్యలు అని ఒక ఎన్జీవో అంచనా. ఇలాటి కేసులకోసం ప్రత్యేక కాల్ సెంటర్లు తెరవాలని 2018లో సుప్రీంకోర్టు ఆదేశించినా అది మొక్కుబడిగా మిగిలిపోయింది. కాగా తాము దేశవ్యాప్తంగా 500 అలాంటి సెంటర్లను నడుపుతున్నామని ఎన్జీవో ‘లవ్ కమాండోస్’ చెప్పింది; 2017లో కాదల్ అరన్ (kadhal Aran) పేరిట ఒక సహాయ ‘యాప్’ తమిళనాట అన్ని జిల్లాల్లో వాలంటీర్లతో - ప్రారంభించబడింది. ఇది, అక్కడి సమస్య తీవ్రతని ఎత్తిచూపుతున్నది. 


తాము సగోత్రీకుల పెళ్లిళ్లను వద్దంటున్నామని జాట్‌లు చెప్తున్నారు. ఆత్మగౌరవ తమిళనాడులో పరిస్థితి సూటిగా ఉంది. దళిత యువకులు వన్నియార్ యువతులను పెళ్లిచేసుకోవటాన్ని నిషేధించాలనే డిమాండు పెట్టినపార్టీ పిఎంకెతో ఎన్నికల పొత్తు పెట్టుకోవడానికి రెండు ఆత్మగౌరవ పార్టీలూ రెడీగా ఉన్నాయి. ప్రస్తుతం ఆ పార్టీ అన్నాడిఎంకే, బిజేపీలతో ఉంది. ‘గత రెండేళ్లలోనే 100 పరువు హత్యలు జరిగాయని, అయితే పోలీసులు కప్పిపుచ్చుతున్నారని’ ఒక దళిత మేధావుల వేదిక ప్రకటించింది. వారు రెండురోజుల ‘నిజనిర్ధారణ’ పర్యటన తర్వాత ఒక నివేదికను విడుదల చేసారు.


‘కొంగు వెల్లాల గౌండర్ల’నే ఓబీసీ కులానికి చెందిన విద్యావంతుడయిన యువరాజ్ యువకుల గుంపుతో ఒక మాఫియా బృందాన్ని ఏర్పరిచి, తమకులంలో కులాంతర పెళ్లిళ్లకు వ్యతిరేకంగా బాహాటంగా ఉద్యమాన్ని నిర్వహిస్తున్నాడని ప్రత్యేకించి దళిత వ్యతిరేక గూండాగిరీ చేస్తున్నాడని ఆ నివేదికలో ఆరోపించారు. అలా వ్యవహరిస్తున్న మరో బృందం వన్నియార్లు. తమ కులం యువతులను ‘ఆకర్షించిన’ దళిత యువకులను శిక్షించాలని, అలాటి యువకుల కాళ్లూ చేతులూ తెగ నరికి బుద్ధి చెప్పాలని వన్నియార్ల నాయకుడు, మాజీ ఎంఎల్‌ఏ జె.గురు లోగడ పిలుపునిచ్చారు; వేయి మంది వన్నియారు మూకలు దళితవాడలపై దాడులు నిర్వహించి ఇళ్లు తగులబెట్టారు. ఆ నాయకుడినే పరోక్షంగా ‘జై భీమ్’ సినిమాలో అవమానపరిచారని వారి ఆరోపణ. ‘దళితులు హత్య చేయబడిన కేసుల్లో ప్రభుత్వాల అలసత్వమూ, కోర్టుల ఉదాసీనతా మనదేశంలో మామూలే. కానీ తమిళనాడులో ప్రభుత్వాలు ఇలాటి హత్యాకాండలో పాలు పంచుకోటం చాలా అరుదేనని, వీటిని బైటపెట్టాలని’ హక్కుల ఉద్యమనేత ఆనంద్ తెల్తుంబ్డే దశాబ్దం క్రితమే పిలుపునిచ్చారు. ‘ఒక పాలక పార్టీ తన రాజకీయ ప్రణాళికలో భాగంగా ఇలాటి మారణకాండను బాహాటంగా సాగించటం అరుదే కానీ, బట్టబయలు చేయాల్సిన వాస్తవం’ అన్నారాయన. ఒక నిజనిర్ధారణ కమిటీ నివేదిక సందర్భంగా ఆయన ఆధారాలతో ఈ మాట చెప్పారు. కొవిడ్ లాక్‌డౌన్‌ల కాలంలో - అన్నా డీఎంకే హయాంలో- ఇలాటి దౌర్జన్యాలు ఐదు రెట్లు పెరిగిపోయాయని దళిత సంఘాలు ప్రకటించాయి.


మన నిచ్చెనమెట్ల కులవ్యవస్థను పోలీసు, కోర్టులతో పాటు మొత్తం రాజ్య వ్యవస్థ ఎలా కాపాడుతున్నదో, దానికి వ్యతిరేకంగా ఒక లాయరు ఎలా పోరాడారో 1993–94 నాటి వాస్తవఘటన ఆధారంగా తీసిన సినిమా ‘జై భీమ్’. కాగా కొందరు దాన్ని తమ నేటి కులరాజకీయాలకు వాడుకుంటున్నారు. గురు పేరుతో ఉండిన తమ నాయకుడిని అవమానపరిచారని తమిళనాట తన దళిత వ్యతిరేక రాజకీయాలతో వన్నియార్ల పిఎమ్‌కే పార్టీ; ఎస్సై గురుమూర్తి పేరుని తమ నాయకుడికి వ్యతిరేకంగా వాడారని ఆరెస్సెస్ ఆరోపించాయి. ఇక్కడేమో తమిళ తెలుగు రాష్ట్రాలకీ, పెరియారుకీ కమ్యూనిస్టులకూ పోటీపెట్టి కొందరు కుల సిద్ధాంతాలు వల్లిస్తున్నారు. ‘ఒక అద్భుతమైన సినిమాపై ఇలాటి చర్చలు అనవసరం. ఎర్రజెండాలతో సహా తనతో పాటు ఆయా పాత్రల కులాల, చిత్రణంతా వాస్తవికంగానే ఉంది. ఇది నిచ్చెనమెట్ల సమాజం; ‘శూద్రుల్లోనూ అంతా ఒకటిగా లేరనీ, ప్రతికులానికీ మరొకరు ఇంకా క్రిందికులమేనన్న భావన ఉందనీ’ నాటి లాయరు, మాజీ హైకోర్టు జడ్జి చంద్రు చెప్పారు. బ్రాహ్మణ వ్యతిరేక ఆత్మగౌరవ ఉద్యమం కొన్ని పాలకవర్గాలకు ఉపయోగపడిందే కానీ, పీడితులకూ- ముఖ్యంగా దళిత ఆదివాసీ జనాలకి ఉపయోగపడలేదని 50 ఏళ్ల అనుభవం చాటిచెప్తున్నది.

జయలక్ష్మి

Updated Date - 2021-12-30T06:23:52+05:30 IST